ఒక వార్త… జనసేన పార్టీకి మాదాసు గంగాధరం రాజీనామా… మూడు పేజీల లేఖలో సంచలన వ్యాఖ్యలు… జనసేనకు మరో షాక్… ఇలా సాగిపోయింది ఆ వార్త… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… అదెప్పుడో పడిపోయే వికెట్టే… ఏడాదిగా తను అసలు యాక్టివ్గానే లేడు… పైగా జనసేన నుంచి ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్న కాలంలో, ఈ మాదాసు ఇంకా అక్కడే పవన్ కల్యాణ్‌ను పట్టుకుని వేలాడతాడని ఎవరూ అనుకోలేదు… అది జరిగే పని కూడా కాదు… ఎట్ లాస్ట్, జరిగిపోయింది… కాకపోతే ఇది జనసేనకు శుభసూచకం అవుతుందా..? కావచ్చునేమో… ఎందుకంటే..? మాదాసు చాలామంది నాయకుల దృష్టిలో ఓ ఐరన్ లెగ్గు… ఇప్పుడు ఆయన పవన్‌ను వదిలేయడం పవన్‌కే మంచిదని ఓ అంచనా వినిపిస్తోంది… ఏమో, మాదాసు పార్టీ నుంచి వెళ్లిపోయే కాలం వచ్చేసింది కాబట్టే… పవన్ టైం మళ్లీ స్టార్టయిందేమో… మూడునాలుగేళ్ల తరువాత మరో హిట్ సినిమా, చేతిలో ఇంకొన్ని సినిమాలు, పెరిగిన గిరాకీ, చుట్టూ తిరుగుతున్న బీజేపీ ఉపగ్రహాలు, కాబోయే సీఎం అంటూ కీర్తనలు, మళ్లీ పాపులారిటీ… బాబ్బాబు, మా దేవుడివి నువ్వు, కోపగించబోకు, నువ్వు వినా బ్రోచేవారెవరురా అని సునీల్ దేవధరుడి భజనలు… అంతా గంగాధర మహత్యమే అంటారా..? ఏమో… తను పవన్ కల్యాణ్ క్యాంపులో చేరినప్పుడు… మాజీ జర్నలిస్ట్, నిశిత రాజకీయ విశ్లేషకుడు రజా హుసేన్ రాసిన ఓ కథనం చదవండి… మాదాసు నిష్క్రమణ పవన్‌కు లాభమో నష్టమో మీరే ఫైనల్‌గా చెప్పేస్తారు…
(Abdul Rajahussain………) అనగనగా……. మాదాసు గంగాధరం అను ఓ రాజకీయ ఐరన్ లెగ్ కథ !! ( ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో మాదాసు రాజకీయ ప్రస్థానం ) పట్టులందు రాజకీయ పట్టులు వేరయా…. విశ్వదాభిరామ వినుర మాదాసు !! ఒకప్పుడు చంద్రబాబు జిగ్రీ దోస్త్… ఇప్పుడు జనసేనాని చంకలో పిల్లి ! రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వారికి మాదాసు గంగాధరం పేరు చిరపరిచితమే. సాధారణంగా మనం సీజనల్ రాజకీయాలన్న పదాన్ని వింటుంటాం. దానిలోంచి పుట్టినవాడే ” సీజనల్ పొలిటీషియన్”. ఏ ఎండకు ఆ గొడుగు మార్చినట్లు… అధికారాన్నిబట్టి, పార్టీని, రాజకీయ నాయకుల్ని మార్చడమన్న మాట. ఇదో గొప్ప కళ. ఈ కళలోసాధికారత సాధించిన ఘనత బహుశా రాష్ట్రంలో మాదాసుకే దక్కుతుందేమో. అలా పార్టీలు మార్చీ, మార్చీ ప్రస్తుతం ఈయన జనసేన పంచన అదేనండి పవనుడి పక్కన చేరాడు…
Ads
జనసేన పార్టీ ప్రారంభించాక దాంట్లో చేరిన మొట్టమొదటి రాజకీయజీవి మాదాసు కావడం విశేషమే. జనసేనలో ఈ పేరు వినగానే జనం చెవులు కొరుక్కున్నారు. ఏపి మంత్రి చంద్రమోహన్ రెడ్డి అయితే…” మా జిల్లా ఐరన్ లెగ్ జనసేనలో కాళ్ళు పెట్టాడు. శుభం. ఇక జనసేన గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అంతా ఆ ‘ లెగ్గే ‘ చూసుకుంటుందని ఆమధ్య నెల్లూరులో జరిగిన ఓ బహిరంగ సభలో వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరాడు.
ఇక అసలు విషయానికొద్దాం….. !!
మాదాసు గంగాధరం గారిది నెల్లూరు జిల్లా కలువాయి గ్రామం. బాగా చదువుకున్నోడే. పూర్వాశ్రమంలో నారా చంద్రబాబు గారి జిగ్రీ దోస్త్.. అప్పట్లో వీళ్ళ యాక్టివిటీ మీద అనేక కథలుండేవి. నారావారి ఎస్వీ యూనివర్సిటీ రాజకీయాల నుండి మాదాసు చేదోడు, వాదోడుగావుండేవాడు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయాలు, కాంగ్రెస్ హయాంలో (అంజయ్యగారి జంబోజెట్ మంత్రివర్గంలో ) మంత్రిగా వున్నప్పుడు కూడా మాదాసు వారితో స్నేహ బంధం కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో మాదాసు తెలుగు దేశం కు చేరాడు. బాబు కొంతకాలం కాంగ్రెస్ లోనే కొనసాగి ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరారు. అంటే బాబు కంటే తెలుగు దేశంలో మాదాసే సీనియర్ అన్న మాట. బాబు తెలుగుదేశానికి రాకముందే పార్టీలో మాదాసు ప్రభ వెలిగిపోతోంది.
తొలిపట్టు…!!
తెలుగుదేశం లో మాదాసు ఏకంగా పార్టీ అధినాయకుడిపైనే గురిపెట్టాడు. ఎన్టీ ఆర్ బ్రాహ్మీముహూర్తంలో తెల్లవారుఝామున 3 గంటలకు నిద్రలేచి, యోగా, స్నానపానాదులు ముగించి 3.45 కల్లా ఇంట్లోని తన కార్యాలయ గదికి వచ్చేవారు. ఆ సమయంలో అంతా నిద్రలో వుండటం, సందర్శకులెవరూ వుండకపోవడంతో ఎన్టీఆర్ కు కూడా ఏం తోచేది కాదు. ఈ విషయాన్ని గమనించిన గంగాధర్ ప్రతిరోజు 3 గంటలకల్లా అబిడ్స్ లోని ఎన్టీఆర్ నివాసానికి చేరుకునేవాడు. ఆరకంగా ఎన్టీఆర్ కు తొలి సందర్శకుడయ్యారు.ఎన్టీఆర్ కూడా గంగాధర్ ను బాగా అభిమానించే వారు. సిఎం పిఎస్ హేమచంద్ర ప్రసాద్ తో సాన్నిహిత్యం పెంచుకొని, అటునుంచి కూడా నరుక్కు వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అంతెందుకు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ఎంట్రీకి అప్పట్లో గంగాధర్ కూడా ఓ చేయి వేశారట. అయితే అనుకున్నదొకటి, అయ్యింది మరొకటి. చంద్రబాబు ప్రవేశంతో గంగాధర్ కు కష్టాలు మొదలయ్యాయి. పాత స్నేహంతో బాబు ద్వారా సాయం పొందాలని మాదాసు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన గురించి అన్నీ తెలిసిన గంగాధర్ ను క్రమంగా అబిడ్స్ కు దూరం చేశారు. బాబు మాటలు విని ఎన్టీఆర్ కూడా మాదాసును అబిడ్స్ గేటు దాటి లోనికి రానివ్వ లేదు… ఇక లాభం లేదనుకొని మాదాసు ప్రత్యామ్నాయ వేటలో పడ్డాడు.
మలి పట్టు…
అప్పట్లో రెవెన్యూ మంత్రిగా వున్న నెల్లూరీయుడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొంత అసంతృప్తిగా వుండేవారు. చంద్రబాబుతో ఆయనకు అంతగా సఖ్యత వుండేది కాదు. బాబును తెలుగు దేశంలో చేర్చుకోడానికి ఆయన విముఖత చూపడమే దీనికి కారణం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న బాబు శీనయ్యకు చెక్ పెట్టారు. దీంతో నల్లపరెడ్డి ఎన్టీఆర్ కు క్రమంగా దూరమై పేరుకే మంత్రిగా మిగిలారు. ఈ సమయంలో గంగాధర్ ఆయన పక్కనచేరి ఎన్టీఆర్, బాబుపై అసంతృప్తిని ఎగదోశాడు. చివరకు నల్లపరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కల్పించాడు. అట్టహాసంగా “శీనయ్య సేనను ప్రారంభించారు. దీనికి కర్త, కర్మ, క్రియ మాదాసే. పాపం అప్పటికే ఆరోగ్యం బాగోకున్నా రాష్ట్రంలో చాలానే మీటింగ్ లు పెట్టి మామా, అల్లుళ్ళను తిట్టిపోశారు. అయితే ఇది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత శీనయ్య మరణించారు. శీనయ్యతో పాటే శీనయ్య సేనా అంతర్థానమైంది. మళ్ళీ మాదాసు ఏకాకయ్యాడు.
ముచ్చటగా మూడో పట్టు…!!
రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒంగోలు నుండి మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీ అయ్యారు. సొంత జిల్లా వారు కావడంతో గంగాధరం మాగుంట సంస్థానంలో కాలు మోపాడు. అచిరకాలంలోనే మాగుంటకు అన్నీ తానే అయ్యాడు. ఓ దశలో ఇంటిల్లిపాదీ కుటుంబ సభ్యులంతా కలిసి మాదాసును వదిలించుకోవాలని ఒత్తిడి కూడా తెచ్చారు. అయినా ఆయన ఒప్పుకోలేదు. మిమ్మల్నయినా వదులుకుంటాను గానీ, మాదాసును వదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారట. అంతగా ఆయన మాదాసుతో మమేకం అయ్యారు. నేదురుమల్లి జనార్దన రెడ్డి సిఎంగా వున్నప్పుడు కార్పొరేషన్ అధ్యక్ష పదవి కోసం మాగుంట ద్వారా తీవ్ర ఒత్తిడి తెప్పించాడు. అయితే నేదురుమల్లి ససేమిరా అన్నారు. అయినా మాగుంటను నిద్రపోనివ్వలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మూతపడటానికి సిధ్ధంగా వున్న ఏపి స్కూటర్స్ ఛైర్మన్ గా వేశారు. దీంతో మాదాసుకు కోపం వచ్చి, ఆ పదవిని తిరస్కరించాడు. ఇక అప్పటి నుండి మాగుంటకు నేదురుమల్లికి మధ్య గ్యాప్ వచ్చింది. దీనికి కారణం ఎవరో చెప్పనక్కర్లేదు. తర్వాత ఒంగోలులో నక్సలైట్ల ఘాతుకానికి మాగుంట బలయ్యారు. మాగుంట ఉన్నంతవరకు మాదాసుకు ఎదురే లేదు. ఆయన మరణం తర్వాత మాదాసు మళ్ళీ ఒంటరోడయ్యాడు.
నాలుగో ప్రయత్నం… కొండకే వేశాడు!!
వైఎస్ రాజశేఖరరెడ్డి సిఎం గా వున్నప్పుడు మాదాసు అధికార శిబిరంలో చేరిపోయాడు. వైఎస్ తో పాటు ఆయన ఆత్మ కెవిపి అయితే మాదాసును గంగూ అంటూ పిలిచేవారు. వైఎస్ పేషీలోని కొందరు ఉన్నతాధికారుల సాయంతో వైఎస్ కు బాగా దగ్గరయ్యాడు. వైఎస్ ఉన్నంతకాలం మాదాసు హవా బాగా కొనసాగింది. గల్లీ, ఢిల్లీ అన్న తేడా లేకుండా వైఎస్ ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే వాడు. వైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవీ దక్కింది. వైఎస్ శిబిరంలో ఇంటా, బయటా ఎవరి నోట విన్నా… ఒకటే కూత గంగూ.. గంగూ..!! చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక వైఎస్ కు, చిరంజీవికి మధ్య మాదాసు సంధానకర్తగా పనిచేశాడట… అలా వైఎస్ కు మరీ దగ్గరయ్యాడు. ఇక సిఎం ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఫొటోల్లో, వీడియోల్లో సిఎం పక్కన మాదాసు తొంగి చూస్తూ వుండాల్సిందే. అంతా బాగుందనుకుంటున్న సమయంలో దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు.
మొదట్లో గంగాధర్ ను ఇంట అడుగు పెట్టనివ్వని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా మాదాసు హవా చూసి గంగూ అంటూ కలవరించడం మొదలెట్టారు. అయితే ఏ ప్రాపకం లేని నేదురుమల్లిని గంగూ లెక్కచేయలేదు. ఆయన పిలిచినా అవాయిడ్ చేసేవాడు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య క్యాబినెట్ లోని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్సా సత్యనారాయణకు తల్లో నాలుకయ్యాడు. వాళ్ళు ఎక్కడుంటే మాదాసు కూడా అక్కడే కనిపించే వాడు. వాళ్ళిద్దరి మంచీ చెడ్డలు వ్యక్తి గత అభిరుచుల్ని దగ్గరుండి చూసుకునేవాడు.
వై ఎస్ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా వున్న కాలంలో కూడా మాదాసు హవా కొనసాగింది. రోశయ్య గారు సిఎంగా రాజీనామా చేశారు. ఆ తర్వాత గవర్నర్ అయ్యాక క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన సిఎంగా మిగిలి పోయాడు. ఈ సందర్భంగానే పార్టీ అధిష్టానంతో పొరపొచ్చాలొచ్చి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాడు. సొంత కుంపటి (పార్టీ ) పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. జనం తిరస్కరించడంతో రాజకీయ సన్యాసం స్వీకరించాడు. ప్రస్తుతం అనామకుడిగా మిగిలిపోయాడు. చివరకు తాను ఎంతగానో ద్వేషించే తెలుగుదేశం పార్టీలోకి తమ్ముడ్ని పంపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
గవర్నర్ కూడా….!!
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు మాదాసుకు మధ్య దోస్తీ కుదరడం చాలా మందికి అర్థం కాలేదు. రాష్ట్ర విభజన సమయంలో రాజ్ భవన్ హవా వుండింది. సరిగ్గా అదే సమయంలో మాదాసు రాజ్ భవన్ కు అతిథిగా మారాడు. తెల్లవారు ఝామునే లేచి, గవర్నర్ గారిని స్థానిక గుళ్ళూ, గోపురాలకు తిప్పేవాడు. చాలా కాలం ఇలానే వుండింది. కానీ ఏమైందో ఏమో గానీ, అర్థాంతరంగా రాజ్ భవన్ ఎంట్రీకి గండి పడింది. అయితే గవర్నర్ గారు మాత్రం ఇంకా కొనసాగుతుండటం వింతల్లో వింతగా చెప్పుకుంటూ వుంటారు. ఆ తర్వాత కూడా మాదాసుకు మంత్రులతో సాన్నిహిత్యం కొనసాగింది. ఆ తర్వాత మంత్రులుగా వున్న ఆనం, బొత్సా ఎన్నికల్లో ఓడిపోయారు. మాదాసు మళ్ళీ ఒంటరోడయ్యాడు.
చాలాకాలం తర్వాత…..!
ఖాళీగా ఉన్న మాదాసుకు ఈసారి కొత్త శిబిరం ఎంపికకు కొంత సమయం పట్టింది. తెలుగుదేశంలో ఎంట్రీ లేకపోవడం, కాంగ్రెస్ ఉన్నా లేనట్లే కాబట్టి కొంతకాలం సైలెంట్ అయ్యాడు. చివరకు కాంగ్రెస్ ను వదిలేశాడు.
ఇక జనసేన పవన్ వంతు….!!
ఇటీవలనే పవన్ కల్యాణ్ జనసేనలో సమన్వయకర్త గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. జనసేనలో చేరిన తొలి నాయకుడిగా పవన్ కు సొంత మనిషన్న అభిప్రాయం కలిగించాడు. గుంటూరుకు సమీపంలో జరిగిన పార్టీ సమావేశానికి కో ఆర్డినేటర్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు జనసేనకు, జనసేనాధిపతికి ఆయనే పెద్ద దిక్కన్న బిల్డప్ అంతటా వుంది. ఎన్నికలయ్యేదాకా జనసేనలో మాదాసు కొనసాగటానికి ఇబ్బందేమీ లేదు కానీ, ఫలితం కాస్తా అటూ, ఇటూ అయితే మాదాసు భవితవ్యం ఏమిటన్నది అప్పుడు తెలుస్తుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా…. మాదాసుకు మాత్రం ఫరక్ పడదు. ఎందుకంటే…. మాదాసు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా ఒదిగిపోతాడు.. ఏ పార్టీ కండువా వేసుకోడానిక్కూడా పెద్దగా మొఖమాట పడడు.. రిస్క్ బాసులకే గానీ, ఆయనకు కాదు…!! అంతా’ లెగ్ ‘ మహిమ అని తెలిసినా…… మాదాసుకొచ్చిన ఇబ్బందేం లేదు. మాదాసు రాజకీయ ప్రస్థానానికొచ్చిన నష్టమూ ఏదీ లేదు!! ఇట్ విల్ కంటిన్యూ…కంటిన్యూ…..కంటిన్యూ!!……….
Share this Article