ఏడవకు ఏడవకు బిబిసి!
ఏడిస్తే నీ కళ్లు ఎరుపెక్కుతాయి!!
——————-
జర్నలిజం ప్రపంచంలో బిబిసి ఒక అందుకోదగ్గ ప్రమాణం. చూసి నేర్చుకోవాల్సిన పాఠం. బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టింగ్ కంపెనీ- బిబిసి బ్రిటన్ ప్రభుత్వ సంస్థ. దాదాపు వందేళ్ల చరిత్ర దానిది. ప్రపంచవ్యాప్తంగా బి బి సి రేడియో, వివిధ భాషల్లో టీ వీ, డిజిటల్ అన్నీ కలిపి పాతికవేల మంది పని చేస్తుంటారు. అలాంటి బి బి సి కూడా విమర్శలకు అతీతమేమీ కాదు. అయితే చాలాసార్లు ఆ విమర్శలు బ్రిటీషు పౌరులు ఎక్కుపెట్టినవే అయి ఉంటాయి. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం భూగోళమంతా విస్తరించాలని కలలుగన్న బ్రిటీషువారు అసలు ఎండపొడ తగలక బ్రెగ్జిట్ దెబ్బకు లండన్ వీధుల్లోనే చలికాచుకుంటున్నారు.భాషకు, మర్యాదకు, స్టయిల్ కు, డీసెన్సీకి కేరాఫ్ అడ్రెస్ అనుకునే బ్రిటీషు మేడిపండు చూడ పైకి మేలిమై ఉండు! పొట్టవిప్పి చూడ లోపల సవాలక్ష లోపాల పురుగులుండు!
Ads
మనలాంటి దేశాలకు ప్రజాస్వామ్య విలువలు నేర్పానని అనుకునే ది గ్రేట్ బ్రిటన్ లో పేరుకే ప్రజాస్వామ్యం, ఎన్నికలు. అక్కడ ఉండేది రాజమాత, రాజకుమారులు, రాజమాత కోడలు, రాజమాత అంతఃపురాలు, రాజమాత కుక్కలు, రాణి, రాణివాసపు గుర్రబ్బండ్లు, పల్లకీలు, ఆ పల్లకీలు మోసే బోయీలు. రాణి కదిలితే కుడి ఎడమల డాల్ కత్తులు మెరుస్తాయి. ఎర్రబొచ్చు పొడుగు టోపీలతో సైనికులు రాణి ముందు తలవంచి చేసే గార్డ్ ఆఫ్ ఆనర్ బకింగ్ హామ్ ప్యాలెస్ రాతిగోడల సాక్షిగా మనలాంటి టూరిస్టులకు చూసితీరదగ్గ మర్యాదలు. రాజ్యాలు పోలేదు; రాజులు రాణులు, వారి రాచరికపు చిత్ర విచిత్ర మానవాతీత మర్యాదలు, వేషాలు అలాగే ఉన్నాయని బ్రిటీషు రాజసౌధమే ప్రపంచానికి రోజూ టికెట్టులేని ఉచిత ప్రదర్శన ఇస్తోంది. అది వారికి మర్యాద. మనకు ఉచిత వినోదం.
ఆ రాణివాసం మహా వటవృక్షం నీడలో ఒదిగిన ప్రిన్స్ ఫిలిప్స్ నిండు నూరేళ్లు బతికి అదే బకింగ్ హామ్ మహా సౌధంలో ఒకరోజు తెల్లవారకముందే మౌనంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. విషయం తెలిసిన బిబిసి మోర్ లాయల్ ద్యాన్ ది కింగ్- రాజును మించిన రాజ భక్తితో గుండెలు బాదుకుంది. అప్పటికే షెడ్యూల్ అయిన ప్రోగ్రాములను తోసిరాజని ఫిలిప్ మరణానికి రోజంతా ఏడుస్తూ ప్రసారాల్లో విషాదాన్ని, కన్నీళ్లను కంటికి మంటికి ఏకధారగా కురిపించింది. ప్రిన్స్ ఫిలిప్ అంటే మాకూ ఇష్టమే, గౌరవమే, ఆయన మృతి బాధాకరమే, కానీ- ఇలా బిబిసి కడవల కొద్దీ కన్నీళ్లు కారుస్తూ రోజులతరబడి ఏడుపు మొహాలేసుకుని తెరమీద కనిపించడం మాత్రం- అతిగా ఉందని అసహనం వ్యక్తం చేస్తూ బ్రిటీషు పౌరులయిన ప్రేక్షకులే బిబిసికి వేల కొద్దీ మెయిల్స్ పెట్టారు. ఏడవాల్సినదానికంటే కొంచెం ఎక్కువగా ఏడ్చినట్టు బిబిసి ఏడుపు మొహంతోనో, ఏడ్చి మొహం కడుక్కునో అంగీకరించింది. గుండెల్లో కొలువయిన నిండు నూరేళ్ల ప్రిన్స్ ఫిలిప్ పొతే బి బి సి ఆమాత్రం ఏడవకపోతే ఎలా? అని బిబిసి రోదనను సమర్థించిన వారూ ఉన్నారు.
ఎంత ఏడిస్తే ప్రామాణికం? అంగీకారం?
ఎంత ఏడిస్తే అతి?
అనంగీకారం?
అన్న రోదనా ప్రమాణాలను పాటించడానికి వీలుగా బిబిసి కొన్ని కొలమానాలను రూపొందించుకోవాలి. బిబిసి అతిని బ్రిటీషు పౌరులే ప్రశ్నించినందుకు సంతోషించాలి.
మన భారత ప్రభుత్వ సొంత సంస్థ అంటే ప్రజల సొంత దూరదర్శన్ అతిని, గతిని, మతిని భారత ప్రజలు ప్రశ్నించగలరా? ప్రశ్నించి తట్టుకోగలరా?
-పమిడికాల్వ మధుసూదన్
Share this Article