ఈరోజు తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి ముగింపు… బాబు సభపై రాళ్ల దాడి, దాన్ని తన ప్రచారానికి సమర్థంగా వాడుకున్న చంద్రబాబు, వైఎస్ వివేకా హత్యపై లోకేష్ సవాల్… ఈ ఎన్నిక అయిపోతే పార్టీ లేదు, తొక్క లేదు అంటున్న అచ్చెన్నాయుడు… తనపై స్టింగ్ ఆపరేషన్… ఇక టీడీపీ పని అయిపోయినట్టేనా..? బోర్డు తిప్పేయాల్సిందేనా..? అంటూ వైసీపీ సోషల్ శ్రేణుల ప్రచారం… 5 లక్షల మెజారిటీ రాకపోతే, బాధ్యుల సంగతి చూస్తానని జగన్ హెచ్చరికలు…… ఇవీ రెండుమూడు రోజులుగా చర్చల్లో ఉన్న వార్తాంశాలు… వదిలేయండి… ఈ రాళ్ల దాడి, ఈ స్టింగ్ ఆపరేషన్, వైఎస్ హత్య కేసుపై సవాళ్లు… పోలింగ్ తరువాత వాటి ప్రాధాన్యం ఆటోమేటిక్‌గా చల్లబడొచ్చు, చప్పబడొచ్చు… కానీ రెండు అంశాలపై ఓసారి మనం కాస్త వివరంగా చెప్పుకుందాం… 1) మొన్న ఏప్రిల్ ఫస్ట్ నాడు డెక్కన్ క్రానికల్ రాసిన ఏప్రిల్ ఫూల్ కథనంలో చెప్పినట్టుగా టీడీపీని బీజేపీలో విలీనం చేయడమే దిక్కా..? నిజంగా టీడీపీ అంత ఘోరమైన స్థితిలో ఉందా..? చంద్రబాబు ఇక బండి నడిపించే స్థితిలో లేడా..? కాడి కింద పడేయడమేనా..? 2) అయిదు లక్షల మెజారిటీ సాధ్యమా..? సంభావ్యత ఎంత..? ఏం జరిగితే అంత మెజారిటీ సాధ్యం..?
రాజకీయాల్లో అసాధ్యం అంటూ ఏమీ ఉండదు… అలాగే గెలుపూ ఓటములు కూడా అత్యంత సహజం… అయితే ఒకవేళ నిజంగానే జగన్ గనుక తన అభ్యర్థి గురుమూర్తికి 5 లక్షల మెజారిటీ సాధించి పెడితే… నో డౌట్… చంద్రబాబు ఇక పార్టీని నడిపించడం వృథాయేనేమో… రిటైర్ కావడం మంచిదేమో… ఇది పరుషమైన వ్యాఖ్య ఏమీ కాదు… ఎందుకంటే..? తిరుపతి తన రాజకీయ పాఠశాల… విద్యార్థి జీవితం నుంచి ఇప్పటి దాకా పలు దశాబ్దాల అనుభవం తనది… కానీ ఇప్పుడు జగన్ అనేకరకాలుగా సంధిస్తున్న బంతుల నుంచి తన వికెట్ కాపాడుకోవడానికి నానా కష్టాలూ పడుతున్నాడు… తనేమీ యుద్ధరంగాన్ని గాలికి వదిలేయలేదు… చెమటోడుస్తున్నాడు… శక్తులన్నీ కూడగట్టుకుంటున్నాడు… గెలుపు మాట అటుంచితే, మంచి పోటీ గనుక ఇవ్వలేకపోతే అది తనకు ఎంత సెట్ బ్యాకో తనకు తెలుసు… జగన్ గనుక 5 లక్షల మెజారిటీ టార్గెట్ కొడితే, ఇక తను రిటైర్ కావడమే బెటరనే ఆత్మమథనంలోకి కూడా చంద్రబాబు వెళ్లకతప్పదు… అది కూడా తనకు తెలుసు… ఎందుకంటే..?
Ads
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అత్యంత భారీ మెజారిటీలు నమోదైన సందర్భాలు రెండు… 1) ప్రధాని పీవీ నరసింహారావు 1991లో నంద్యాలలో పోటీచేసినప్పుడు 5.8 లక్షల మెజారిటీ సాధించాడు… కానీ ఆ ఎన్నికలో ఎన్టీయార్ టీడీపీని పోటీకి దింపలేదు… పోరు ఏకపక్షం… అది విశేష సందర్భం… 2) ఆ తరువాత ఇరవై ఏళ్లకు, అంటే 2011లో 5.45 లక్షల మెజారిటీతో జగన్ గెలిచాడు… అది కూడా విశేష సందర్భమే… సోనియాను ధిక్కరించి, సొంత పార్టీ పెట్టుకుని, ఏ పరిణామానికైనా సిద్ధమే అనే మొండి పట్టుదలతో అడుగులు వేస్తున్న కాలం అది… నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే, నీ వెనుక మేమున్నాం అని కడప ప్రజలంతా జైకొట్టిన సందర్భం అది… మరి తిరుపతిలో ఇప్పుడు ఆ రేంజ్ మెజారిటీ ఎలా సాధ్యం..? ఒక బలమైన ఎమోషన్ ఏదీ లేదిప్పుడు… పైగా బీజేపీ, జనసేన కలిసి టీడీపీని రెండో స్థానంలోకి నెట్టేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి… ఇదే జరిగితే చంద్రబాబు పూర్తిగా కార్నర్ అయిపోతాడు… బీజేపీకి నైతికంగా తదుపరి ప్రయోగాలకు తగినంత ధైర్యం చిక్కుతుంది… (దేశంలోకెల్లా అయిదు రికార్డు మెజారిటీల్లో రెండు తెలుగు రాజకీయాలవే… అవి గాకుండా… బీడ్‌లో బీజేపీకి చెందిన ప్రీతమ్ ముండే 2014లో 6.96 లక్షల మెజారిటీ సాధించింది… 2004లో బెంగాల్, అరామ్బాగ్ నుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు సాధించిన 5.92 లక్షల మెజారిటీ రికార్డును ఆమె చెరిపేసింది… 2014లోనే ప్రధాని మోడీ వారణాసి నుంచి 5.7 లక్షల మెజారిటీ సాధించాడు…) (జగన్ రికార్డు మెజారిటీ సాధించిన అదే కడపలో, వైఎస్‌కు 1996 ఎన్నికలో దాదాపు ఓడిపోయినంత పనైంది… కేవలం 5 వేల మెజారిటీతో గట్టెక్కాడు… సో, రాజకీయాలు ఎప్పుడూ ఒకేరకంగా ఉండవు…)
సరే, తిరుపతికి వద్దాం… పైన గ్రాఫ్ పోయిన ఎన్నికల్లో తిరుపతి లోకసభ స్థానంలో వచ్చిన వోట్ల శాతాలు… జనసేన పోటీలో లేదు… బీఎస్పీ మరీ ఒక శాతం వోట్లకు పరిమితం… బీజేపీ అంతకు తక్కువ… రెండు పార్టీలూ నోటాకన్నా తక్కువ… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ రెండు పార్టీలు గానీ, కాంగ్రెస్ గానీ అసలు పోటీలో లేనట్టే లెక్క… అంత పూర్ పర్ఫామెన్స్… టీడీపీపై వైసీపీ 17 శాతానికిపైగా ఎక్కువ వోట్లు సాధించింది… ఐనా సరే, వైసీపీకి వచ్చిన మెజారిటీ 2.28 లక్షలు… తిరుపతిలో ఇది తక్కువేమీ కాదు… కానీ జగన్ నిర్దేశించుకున్నట్లు చెబుతున్న 5 లక్షల మెజారిటీకి చేరడం చాలా చాలా దుస్సాధ్యంగా కనిపిస్తోంది… అది జరగాలంటే పోటీ ఏకపక్షంగా ఉండాలి… కానీ పరిస్థితి అలా లేదు… ఒకవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ ప్లస్ జనసేన ఏవో తిప్పలు బాగానే పడుతున్నాయి… ఒకవేళ 5 లక్షల మెజారిటీ రావాలంటే ఏం జరగాలి..? మార్కెటింగ్ నిపుణుడు గోపు విజయకుమార్ రెడ్డి గణాంక విశ్లేషణ ఓసారి చూద్దాం… ఇంట్రస్టింగు…
- మొత్తం వోట్లు 16 లక్షలు… 2019లో పోలైనవి 12.87 లక్షలు… 80 శాతం… ఒకవేళ ఈసారి 70 శాతం వోట్లు పోలవుతాయని అనుకుంటే 11.26 లక్షల వోట్లు పడతాయి…
- 2019 ట్రెండ్ కొనసాగితే… వైసీపీకి 6.3 లక్షలు, టీడీపీ 4.28 లక్షల వోట్లు వస్తయ్… అంటే 2 లక్షల మెజారిటీ… ఒకవేళ టీడీపీ పాత ఎన్నికల్లోకన్నా 9 శాతం వోట్లు తక్కువ సాధించినా, వైసీపీ ఆమేరకు ఎక్కువ సాధించినా సరే… 4 లక్షల మెజారిటీ దాటదు…
- ఒకవేళ నిజంగా 5 లక్షల మెజారిటీ రావాలంటే… పోలింగు 87 లేదా 88 శాతం దాకా జరగాలి… ఇప్పుడున్న స్థితిలో ఇది కష్టం…
- తిరుపతి సెగ్మెంటులో వైసీపీ వీక్… అక్కడ బీజేపీ ఎన్ని వోట్లు సాధిస్తుందనేది చూడాలి… అలాగే వెంకటగిరిలో ఆనం వైసీపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడనేవి వార్తలు… అక్కడ మెజారిటీ చూడాల్సి ఉంది… అలాగే గూడూరులో అక్కడి నాయకత్వం మీద జనంలో కొంత అసంతృప్తి ఉన్నట్టు చెబుతున్నారు… అక్కడ మెజారిటీ కూడా పరిశీలించతగిందే…
- టీడీపీ తన పాత 38 శాతం వోట్ షేర్ నుంచి 24 శాతానికి పడిపోవాలి… ఇది జరుగుతుందా చూడాలి… ఇదే ఆసక్తికరం… దేనికంటే..? ఈసారి జనసేన, బీజేపీ కాస్త బలంగా పోటీపడుతున్నట్టుగా కనిపిస్తోంది… అవి టీడీపీ వోట్లను గనుక విశేషంగా చీల్చగలిగితే ఆమేరకు వైసీపికి నయం అవుతుంది… అయితే టీడీపీ వోట్లను ఏ 24 శాతానికో పరిమితం చేసి, నిజంగానే బీజేపీ చంద్రబాబు రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడవేస్తుందా..? అసలు దానికి పవన్ కల్యాణ్ అంగీకరిస్తాడా..? అందుకే తిరుపతి ఉపఎన్నిక ఇంట్రస్టింగుగా మారింది…
Share this Article