.
మీనాక్షి నటరాజన్… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి… హఠాత్తుగా ఆమె మీద ఎందుకు కొన్ని నిందాపూర్వక వార్తలు వస్తున్నాయో అర్థం కాదు… ఎవరో కావాలని రాయించినట్టుగా ఉన్నాయి కొన్ని వార్తలు…
అవేమిటంటే..? ఆమె షాడో సీఎం అట… ఓవరాక్షన్ చేస్తున్నదట… మంత్రుల కమిటీతో భేటీ ఏమిటి..? సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులతో మాట్లాడటం ఏమిటి..? వర్శిటీ క్షేత్ర పర్యటన చేయడం ఏమిటి..? సివిల్ సొసైటీ ప్రతినిధులతో జూమ్ మీటింగ్ ఏమిటి..? ఎడాపెడా రాసిపారేశారు…
Ads
గాంధేయవాది, నిరాడంబరి, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని ఇన్‌చార్జి అయిన కొత్తలో పల్లకీ మోసిన కలాలే ఇప్పుడామెను తక్కువ చేయడానికి, నిందించడానికి ప్రయత్నిస్తున్నాయి… సో, వాట్… మంత్రుల కమిటీతో భేటీ అయితే తప్పేమిటి..? నేరుగా సెంట్రల్ వర్శిటీ విద్యార్థులతో మాట్లాడితే, సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ వేస్తే నేరమేమిటి..?
అదేమైనా పెత్తనం చేయడమా..? ఆమె ఫలానా చర్యలు తీసుకొండి అని ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదు, ఇచ్చినా తప్పులేదు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా, పార్టీ మంత్రులకు సూచనలు చేస్తే ఎవరికైనా దేనికి అభ్యంతరం…? ఆమె తన పని తాను చేస్తున్నది… మీడియా కవరేజీ ఏమీ కోరలేదు కదా… అనవసర ప్రచారం, ఆర్భాటం ఏమున్నాయి ఇందులో…?
ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా బదనాం అయ్యింది ఈ విషయంలో… ప్రతిపక్షాలు ఫేక్ ఫోటోలతో దుష్ప్రచారం చేశాయనే సాకుతో సమర్థించుకోలేరు… హెచ్‌సీయూ భూముల అమ్మకాల్ని హ్యాండిల్ చేయడంలో ఫ్లాప్… ఫేక్ ఫోటోలు అనే వివాదం వేరు… అమ్మాలనుకున్నది నిజమే కదా… బుల్‌డోజర్లు నిజమే కదా… చదును చేయడం నిజమే కదా…
కాకపోతే అది ప్రభుత్వ భూమే… గత ప్రభుత్వం 111 జీవో ఎత్తేసిన పర్యావరణ విధ్వంస చర్యతో పోలిస్తే ఇదెంత..? ప్రకృతి విధ్వంసం, పర్యావరణ వినాశనం, హైదరాబాద్ లంగ్స్ నాశనం దాకా వెళ్లిపోయాయి ప్రచారాలు… అప్పుడు ఏ గొంతూ పెగల్లేదు… అసలు ఏళ్ల క్రితమే ఈ భూమిని స్వాహా చేయడానికి ప్రయత్నించిన పెద్దమనిషి మీద ఏ వ్యాఖ్యలూ లేవు…
కోర్టుల్లో సుదీర్ఘ పోరాటం తరువాత ప్రభుత్వం దాన్ని కాపాడుకోగలిగింది… ఇవేవీ వార్తల్లోకి రావు… కానీ ప్రతిపక్షం ముప్పేట దాడితో ప్రభుత్వం ఫుల్లు డిఫెన్సులో పడిపోయి, బోలెడు నెగెటివిటీ మూటగట్టుకుని, ఇక కర్తవ్యం తెలియక ఎడ్డిమొహం వేసింది… ఇప్పుడు కళ్లు తెరిచి, జరగాల్సిన నష్టం జరిగాక ఫేక్ ఫోటోల్ని షేర్ చేసిన వాళ్లపై (సెలబ్రిటీలు సహా) ఉరుముతుందట…
అందరూ ఎంటరవుతున్నారు… ఎఐ ఫోటోల షేరింగులతో సెలబ్రిటీలు, ప్రతిపక్షాల సోషల్ మీడియా వింగులు, కోర్టుల్లో సూమోటో కేసులు… సుప్రీం ఏకంగా ఓ ఎంపవర్డ్ కమిటీని క్షేత్ర వాస్తవాల రిపోర్టింగుకు పంపిస్తుందని ఓ వార్త కనిపించింది… అడవుల్ని నరికేస్తున్నారహో, వన్యప్రాణుల్ని ఖతం చేస్తున్నారహో అనే విపరీత ప్రచారం జాతీయ స్థాయిలో జరుగుతోంది…
నష్టనివారణకు కాంగ్రెస్ ప్రభుత్వం నానాపాట్లూ పడుతోంది… ఈ స్థితిలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా వాస్తవాలేమిటో, ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ ఉందో వివరాలు తెలుసుకుని, హైకమాండ్‌కు ఓ రిపోర్ట్ ఇచ్చే పనిలో ఉంది ఆమె… అందులో తప్పేముంది..? తను నేరుగా ఇష్యూలో ఎక్కడా ఇన్వాల్స్ కాలేదు కదా… అనుచిత లబ్ధికీ ప్రయత్నించడం లేదు… ఒక్కసారి గత ఇన్‌చార్జుల వైఖరులతో పోల్చిచూడండి…
ఎస్, తను నేరుగా విద్యార్థులతో మాట్లాడితే తప్పేమిటి..? వాళ్ల విజ్ఞాపనల్ని తీసుకుంటే తప్పేమిటి..? ఆమె మీద అభాండాలు వేసి, ఈ నెగెటివ్ వార్తల్ని రాయించుకునే ప్రయత్నాలు చేసిన వారెవరో, వాళ్ల ఉద్దేశాలు ఏమిటో తెలియదు గానీ… పక్కా చెత్త ప్రయత్నం..!
Share this Article