Former MP Mohd Shahabuddin | Via Facebook
Former MP Mohd Shahabuddin | Via Facebook
‘‘1998 ఎన్నికల కవరేజీకి బీహార్‌లో తిరుగుతున్నాను… సివన్ ఏరియాకు కూడా వెళ్లాను… అటూఇటూ తిరిగొచ్చి హోటల్‌లో పడుకున్నానో లేదో, ఎవరో తలుపు కొట్టారు… తెరిచాను… కారిడార్‌లో ఏకే-47 తుపాకులతో ఆగంతకులు కొందరు… లోకల్ డాన్ కమ్ పొలిటిషియన్ షాబుద్దీన్ లోపలకు వచ్చాడు… సివన్ వస్తున్నట్టు నాకు ముందుగా చెప్పనేలేదేమిటబ్బా అన్నాడు నవ్వుతూ… సరే, వెళ్లేటప్పుడైనా చెప్పి వెళ్లు అన్నాడు… అన్నట్టూ, నాకు వ్యతిరేకంగా ఏదైనా కామెంట్ కావాలంటే చంద్రశేఖర్ ప్రసాద్ వాళ్ల అమ్మ కౌసల్యాదేవిని కలువు… (చంద్రశేఖర్ షాబుద్దీన్ గ్యాంగు చేతిలో హత్యకు గురయ్యాడు)… ఆమె తప్ప ఇంకెవరూ మాట్లాడరు, సరేనా అంటూ వెళ్లిపోయాడు…
నాలుగు రోజులపాటు ఆ ఏరియాలోనే తిరిగాను… నిజమే, ఒక్కడంటే ఒక్కడూ షాబుద్దీన్‌కు వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడలేదు… అంతా భయమే… చివరకు ఆ కౌసల్యాదేవి మాత్రమే నాలుగు ముక్కలు చెప్పింది, అంతే… సివన్ ఏరియా మీద షాబుద్దీన్ గ్రిప్ అది… నాలుగుసార్లు ఎంపీ తను… లాలూ-రబ్రీ కాలం నాటి భయానక రాజకీయానికి ఓ ప్రతీక షాబుద్దీన్… తను పోటీలో ఉంటే ఇక ఎవ్వడూ పోస్టర్ గానీ, బ్యానర్ గానీ తనకు వ్యతిరేకంగా కనిపించకూడదు… జిల్లా ఉన్నతాధికారులు, చివరకు జిల్లా మేజిస్ట్రేట్లు సాహెబ్ అని పిలవాలి తనను… తను చెప్పనిదే అక్కడ పురుగు కూడా కదలడానికి వీల్లేదు… అధికారికంగానే అతని మీద ఉన్న కేసులు 40… హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, దోపిడీ, అడ్డగింత, కిడ్నాప్… అన్నిరకాలూ… ‘‘ప్రకాష్ ఝా తీసిన అపహరణ్ అనే సినిమాలో నానా పటేకర్ పోషించిన ఓ పాత్ర ఉంటుంది… ఎమ్మెల్యే-డాన్… అదే నాకు స్పూర్తి’’ అంటాడు షాబుద్దీన్…
saheb

పెద్ద వయస్సేమీ కాదు, 1967లో పుట్టాడు… లోకసభ వెబ్‌సైటులో తన వివరాలు చూడండి… పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ, పీహెచ్‌డీ చేసినట్టు కనిపిస్తుంది… బాగా చదువుతాడు, గుర్రం స్వారీ, ఫుట్ బాల్ అంటే ఇష్టం… 1990లో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే… జనతాదళ్‌లో చేరాడు, 1995లో మళ్లీ గెలిచాడు… అది మన ప్రథమ రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ పుట్టిన ఏరియా, జిరాదాయ్… తరువాత లోకసభకు ఎన్నికయ్యాడు… 2007లో అనర్హతకు గురయ్యేవరకూ గెలుస్తూనే ఉన్నాడు… లాలూ హవా కొనసాగుతున్నప్పుడు షాబుద్దీన్ ప్రభ వెలిగిపోయింది… లాలూ తనను ఛోటా భాయ్ అనేవాడు పబ్లిక్‌గా… హత్య కేసులో శిక్ష పడ్డాక కూడా రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ కార్యవర్గం నుంచి అతన్ని తొలగించలేదు… అంటే షాబుద్దీన్ చెప్పినట్టు వినండి అని అధికారులకు, తోటి నాయకులకు సంకేతం ఇచ్చినట్టు…

ఓసారి పోలీసులతో ఘర్షణ జరిగి, కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, 8 మంది షాబుద్దీన్ రౌడీలు మరణించారు… లాలూ సివన్ వెళ్లి తప్పంతా పోలీసోళ్లదే అన్నాడు… అదీ లాలూకున్న ప్రేమ… షాబుద్దీన్ జైలుపాలయ్యాక కూడా వెళ్లేవాడు, పరామర్శించేవాడు… అసలు జైలులోనూ రాజభోగమే… కొత్తగా కట్టిన ఒక ఫ్లోర్ మొత్తం తనకే… మంచి ప్లాస్మా టీవీ, ఫ్రిజ్, జిమ్ ఎట్సెట్రా అన్నీ… ఎవరు కావాలంటే వాళ్లు వచ్చి కలిసి వెళ్లిపోయేవారు… క్లుప్తంగా చెప్పాలంటే తన కొత్త అడ్డా ఆ జైలు… అదొక హాలీడే రిసార్ట్…

సీపీఎం(ఎంఎల్) యాక్టివిస్టు చంద్రశేఖర్ అలియాస్ చందును మర్డర్ చేశాక షాబుద్దీన్ కథ టర్నయింది… తను చదివిన జేఎన్యూ స్టూడెంట్స్ ఢిల్లీలోని బీహార్ భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు… నలుగురిని అరెస్టు చేసి, కేసు నడిపిస్తే అందరికీ యావజ్జీవం పడింది… ఆ నలుగురూ లాలూ పార్టీ మనుషులే… షాబుద్దీన్ జైలుపాలయ్యాక, తదుపరి పోటీలకు అనర్హతకు గురయ్యాక అతని భార్య హీనా సాహెబ్ తెరపైకి వచ్చింది… కానీ వరుసగా మూడుసార్లూ ఓడిపోయింది… అసలు వ్యక్తిని సుప్రీం ఆదేశాల మేరకు తీహార్ జైలుకు తరిమేశాక ఇక తన ప్రభావం, భయం సహజంగానే తగ్గిపోతుంది కదా… ప్రస్తుతం అదే సీపీఐ(ఎంఎల్) పార్టీ అదే రాష్ట్రీయ జనతాదళ్ కూటమిలో మిత్రపక్షం… పాలిటిక్స్ అంటే ఇలాగే ఉంటయ్… చెప్పనేలేదు కదూ… నా 1998 ఎన్నికల కవరేజీ అయిపోయి, వాపస్ వెళ్లేముందు తనను కలిశాను… నువ్వంటే ప్రతిచోటా భయమే కనిపిస్తోంది అన్నాను… ‘‘అవును, నేను సంప్రదాయిక లీడర్‌ను కాను… ఎవరికీ భయపడను… రాత్రి పది గంటలకైనా ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరుగుతారు నా ఏరియాలో… నేరాలు జరగవు ఇక్కడ..’’ అని చెప్పుకొచ్చాడు… ‘‘నిజమే, తను ప్లాన్ చేసిన నేరాలు మాత్రమే జరగాలి అక్కడ, ఇతరత్రా జరిగితే అస్సలు ఊరుకునేవాడు కాదు…’’

Ads