టెర్రరిస్టులకు ఒకరు ఆశ్రయం ఇస్తారు… ఒకరు డబ్బు సాయం చేస్తారు… ఒకరు రవాణా సదుపాయం ఏర్పటు చేస్తారు… ఒకరు ప్రభుత్వ వ్యవహారాలను చేరవేస్తారు… ఒకరు భద్రత బలగాల కదలికల్ని చెబుతారు… వాట్ నాట్..? పాకిస్థానీ ప్రేరిత టెర్రరిస్టులకు కశ్మీర్ లోయలో దొరకని సాయం ఏముంది..? అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా…! వాళ్లకేమీ కాదు, వాళ్ల కొలువులు వాళ్లకుంటయ్… ఒకవేళ వాళ్లు దొరికిపోయినా, కేసులు పెట్టినా సరే, త్వరలోనే అవి కొట్టివేయబడతయ్… ఇదేకదా, ఇప్పటిదాకా కశ్మీర్లో సిట్యుయేషన్… కానీ ఇప్పుడు అక్కడి ప్రభుత్వం (లెఫ్టినెంట్ గవర్నర్ ప్రభుత్వం) దీనికి తెరవేయాలని, ప్రభుత్వ యంత్రాంగాన్ని క్లీన్ చేయాలని నిర్ణయించింది,.. సహజంగానే పీడీపీ, ఎన్సీ, సీపీఎం దీన్ని వ్యతిరేకిస్తున్నయ్… ఆ పార్టీల ధోరణులు తెలిసిందే కదా…
ఇంతకీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా చేస్తున్నదేమిటి..? ఆర్టికల్ 311 ప్రయోగించబోతోంది… ఆర్టికల్ 370 ఎత్తిపారేశారు, 35ఏ తీసేశారు… మరి ఈ ఆర్టికల్ 311 ఏమిటి..? ఈ ఆర్టికల్‌లోని సెక్షన్ 2 (సి) ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి గనుక జాతి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలాంటి విచారణలూ అవసరం లేకుండా డిస్మిస్ చేయవచ్చు… సస్పెన్షన్ కాదు, నేరుగా డిస్మిసల్..! నిజానికి ఇది కశ్మీర్‌కు వర్తించేది కాదు, కానీ ఆర్టికల్ 370 ఎత్తిపారేశాక, దేశంలో మిగతా ప్రాంతాలకు వర్తించే చట్టాలే కశ్మీర్‌కూ వర్తిస్తాయి ఇప్పుడు… మొన్నటి 21వ తారీఖున లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీసుకున్న నిర్ణయం మేరకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటవుతుంది… దీనికి బాస్ స్వెయిన్… ఈయన పదేళ్లపాటు భారత గూఢచార సంస్థలో పనిచేశాడు… తన పనేమిటయ్యా అంటే..? ఎవరెవరిపై కేసులున్నయ్, ఏ దశలో ఉన్నయ్, తీవ్రత ఎంత..? గుర్తించడం, క్రోడీకరించడం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు రిపోర్ట్ చేయడం, ఆయన డిస్మిస్ చేసేయడం…
Ads
దీనికితోడు టెర్రర్ మానిటరింగ్ గ్రూపు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు… టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెర్రరిస్టు సంస్థల సానుభూతిపరుల్ని గుర్తించడం దీని పని… ఫిబ్రవరిలో సైబర్ వాలంటీర్స్ అనే వ్యవస్థ ఏర్పాటు చేశారు… ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవాళ్ల సోషల్ మీడియా ఖాతాల్ని అది మానిటర్ చేస్తుంటుంది… మార్చిలో మరో నిర్ణయం తీసుకున్నారు, దాని ప్రకారం ప్రతి ఉద్యోగి తన సోషల్ మీడియా ఖాతా వివరాల్ని సమర్పించాల్సి ఉంటుంది… దేశవ్యతిరేక, ఉగ్రవాదమద్దతు పోస్టులు నిఘా రాడార్ కిందకు వస్తాయి… దీన్ని కూడా సహజంగానే పీడీపీ, ఎన్సీ, సీపీఎం వ్యతిరేకించాయి… హక్కుల పోరాటాలు, రాజకీయ సంస్థలను అణగదొక్కేందుకు ఉద్దేశించిన అప్రజాస్వామిక, అరాచక, అక్రమ, అనుచిత, అవాంఛనీయ నిర్ణయమని తిట్టిపోశాయి… అవి తిట్టేకొద్దీ అక్కడి ప్రభుత్వం ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తుంది కదా… అదే జరుగుతోంది ఇప్పుడు…! సీఐడీ వెరిఫికేషన్, జీతాల నిలిపివేత వంటివీ తెరమీదకు వస్తున్నయ్…!!
Share this Article