(ఎస్. రాము)…….. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తారని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి చవిచూసినట్లే… తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తానని రెండేళ్లకు పైగా పనిచేస్తున్న అసాధారణ అందాల నటుడు సూపర్ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన కోయంబత్తూర్ (దక్షిణ) నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో పరాజయం పొందటం అభిమానులను నిరాశ పరిచింది.
2018 ఫిబ్రవరిలో కమల్ అనేక సదుద్దేశాలతో స్థాపించిన ‘మక్కల్ నీతి మైయం’ పోటీ చేసిన 142 నియోజకవర్గాల్లోనూ ఓడిపోయింది. మరో నటుడు ఆర్.శరత్‌కుమార్‌కు చెందిన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచి సహా మూడు పార్టీలతో జతకట్టి కూటమిగా ఏర్పడినా కమల్ కు లాభం లేకపోయింది. పార్టీ పెట్టిన 14 నెలల తరువాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కమల్ నిలబెట్టిన అభ్యర్థులు 3.72 శాతం ఓట్లు సాధించి ఆశలు రేకెత్తించినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ లభించలేదు. గొప్ప పోరాట పటిమ కనబరిచిన తన తండ్రి తనకెప్పుడూ గర్వకారణమే అని కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ చెప్పారని కథనాలు వచ్చాయి. ఇది మంచి విషయమే…. కానీ భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక అధ్యాయం నిర్మించుకున్న కమల్ ఇప్పుడేమి చేయబోతున్నారో అన్న ప్రశ్న మొదలయ్యింది.
Ads
సినిమాలలో రాణించిన వారే తమిళ రాజకీయాలను శాసిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. దానికి భిన్నంగా అంత గొప్ప సామాజిక స్పృహ కలిగిన నటుడు కమల్‌ను జనం ఢమాల్ అనిపించడం ఆశ్చర్యం కలిగించకమానదు. ఈ నేపథ్యంలో ఈ కింది ప్రశ్నలు ఉదయించక మానవు.
1) తమిళ ప్రజలకు సినిమా వ్యామోహం తగ్గిందా?
2) ఎప్పుడూ సినిమా వాళ్లే చక్రం తిప్పడంపట్ల మొహం మొత్తిందా?
3) తమిళ ఓటర్లు సినిమా నటులను నమ్మడం లేదా?
4) తమ బతుకులను సినిమా వాళ్ళ కన్నా మిన్నగా రాజకీయ నాయకులే బాగుచేస్తారని జనం అనుకుంటున్నారా?
5) సినీ స్టార్లు ఓటర్ల నాడిని, ఎన్నికలప్పటి వారి అవసరాలను సరిగా గమనించలేకపోతున్నారా?
6) సినిమాల్లో జనం బ్రహ్మ రథం పడుతున్నారు కాబట్టి…. తాము అసాధారణ శక్తి సంపన్నులమని, అద్భుతమైన సమ్మోహన శక్తి తమ సొత్తుగా భావించి ఈ యాక్టర్ కం పొలిటీషియన్స్ మంచి వ్యూహకర్తలను పెట్టుకోకపోవడం, ఇతరులను నమ్మకపోవడం దెబ్బ కొడుతున్నదా?
7) సినిమాల్లో సంపాదించిన డబ్బును ఎన్నికలప్పుడు ఖర్చు చేయడానికి సినీ స్టార్లు సిద్ధంగా లేరా?
8) ఓటర్లలో పరిణతి పెరిగి పాలిటిక్స్ అనేది పొలిటీషియన్స్ మాత్రమే చేయాలన్న నిర్ణయానికి వచ్చారా?
9) గ్లామర్ కు పొలిటికల్ గ్రామర్‌కు ఉన్న తేడాను గ్రహించడంతో కమల్ విఫలమయ్యారా?
10) మొట్టమొదటి ఎన్నికల్లో ఒక షాక్ ఇచ్చి, ఒక ఐదేళ్లు నిజంగా నిలబడతారో లేదో (పార్ట్ టైం బాపతో) చూశాకగానీ సినిమా వాళ్లకు ఒక అవకాశం ఇద్దామని విజ్ఞులైన ఓటర్లు పరీక్ష పెడుతున్నారా?
Share this Article