‘‘కొన్ని ఖాళీల్ని పూరించలేం… ఆ ఖాళీతనాన్ని ఓర్చుకోలేం… ఒక నిండైన నివాళిని ఖాళీగా ప్రజెంట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేం…’’ విషయం ఏమిటంటే..? కాదు, విషాదం ఏమిటంటే..? అనిర్బన్ బోరా… ఎకనమిక్ టైమ్స్ పత్రికలో డిప్యూటీ గ్రాఫిక్ ఎడిటర్‌గా పనిచేసేవాడు… కార్టూన్లు, బొమ్మలు కూడా గీసేవాడు… ఈ కరోనా సెకండ్ వేవ్ సునామీకి ఐదు రోజుల క్రితం బలైపోయాడు… చాలా పత్రికాఫీసుల్లో పరిస్థితి ఇదే… ఆ ఖాళీ కుర్చీ చూసేకొద్దీ ఎడిటోరియల్ సిబ్బంది విషాదం మరింత ఎక్కువయ్యేది… మనమధ్య చురుకుగా తిరుగుతూ ఉండే ఓ కేరక్టర్ హఠాత్తుగా మాయం అయిపోతే… మరీ కంటాక్ట్స్ నంబర్ల లిస్టు నుంచి, సోషల్ ఖాతాల నుంచి డిలిట్ చేసుకుని దులిపేసుకోలేం కదా… ఆ ఖాళీని దేంతో భర్తీ చేయగలం అసలు..? నివాళి అర్పించడంకన్నా ఇంకేం చేయగలం..?
సపోజ్, మీరు ఓ పత్రికలో పనిచేస్తున్నారు… మీ తోటి ఉద్యోగి ఒకరిని కరోనా మింగేసింది… మరుసటిరోజు ఆఫీసుకు వెళ్లగానే మీ దినచర్యలో ఓ వెలితి… ఓ ఖాళీ… ఎలా స్మరించగలం, ఎలా నివాళి అర్పిస్తారు..? ఓ ఫేస్బుక్ పోస్టు లేదా వాట్సప్ పోస్టు పెడదారు… అందరూ ఆర్ఐపీ అని కామెంట్లు పెట్టి మీ విషాదాన్ని షేర్ చేసుకుంటారు… రెండుసార్లు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికీ భయం… అక్కడక్కడే దాగి ఉన్న కరోనా ఎక్కడ మీద పడుతుందో అని…! పెదాల మీద కనిపించే ఓ ప్లాస్టిక్ నవ్వులాంటి ప్రభుత్వసాయ ప్రకటనలు గుర్తొస్తే ఓ విస్మయం, ఓ విషాదం… జర్నలిస్టులంటే ఏ ప్రభుత్వానికీ పడదు, పట్టదు… అది నిష్ఠురంగా ఉండే నిజం… యాజమాన్యాలు మరీ దుర్మార్గం… కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు ఆ వార్తల్ని కూడా ప్రకటించవు… ఓ పెద్ద దుర్మార్గ పత్రిక అయితే మరణవార్తకు సింగిల్ కాలమ్ స్పేస్ ఇవ్వదు… ఒక వర్కింగ్ హ్యాండ్ ఖాళీ అయ్యింది, దాన్ని నింపాలనే ధ్యాస తప్ప మరేమీ కనిపించదు… బాధపడటం మినహా జర్నలిస్టు ప్రపంచం పీకేదేమీ లేదు కూడా…
Ads
కొంతమేరకు జాతీయ పత్రికలు నయం… తమ గ్రాఫిక్స్ సహచరుడు అనిర్బన్ బోరా మరణానికి ఎకనమిక్ టైమ్స్ సంపాదక సిబ్బందికి ఓ చిన్న వార్త రాసి పారేయడం సరైన నివాళి అనిపించలేదు.., కాస్త క్రియేటివ్‌గా ఆలోచించారు… మన ప్రాంతీయ జర్నలిజంలో అదెప్పుడో మరణించింది కానీ ఇంకాస్త ఇంగ్లిషు, ఇతర భాషల జర్నలిజాల్లో ఛాయామాత్రంగానైనా కనిపిస్తోంది… సదరు అనిర్బన్ బోరా రెగ్యులర్‌గా ఓ పంచ్ కార్టూన్ వదిలే ‘క్విక్ బైట్’ స్పేస్‌ను అలా ఖాళీగా వదిలేశారు… తమ మనస్సుల్లో ఏర్పడిన ఖాళీతనాన్ని అలా ప్రకటించారు… అదొక నివాళి… అరుదే… ఎందుకు అరుదో, ఎందుకు కష్టమో దిన పత్రికల డెస్కుల్లో పనిచేసేవాళ్లకు సులభంగా అర్థం అవుతుంది… స్థూలంగా చదివితే చాలామందికి ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చుగాక… కానీ ఒక సింపుల్ వార్తకన్నా, తన రెగ్యులర్ స్పేస్‌లోనే తన మరణవార్తను, ఆ స్పేస్ ఖాళీ అయిన తీరును ఇలా పాఠకులతో ఖాళీతనంతో షేర్ చేసుకోవడం చాలామందికి కనెక్టయింది… అందుకే ఇక్కడ కూడా ఓ కథనమైంది…
Share this Article