ఒకప్పుడు ఎన్టీయార్, తరువాత చంద్రబాబు, ఆ తరువాత వైఎస్ఆర్… ఢిల్లీ పాలసీల్ని కూడా ప్రభావితం చేశారు… కారణం, వాళ్ల చేతుల్లో అధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులు ఉండటం…! అవును, నంబర్ మ్యాటర్స్… మన పాలిటిక్స్‌ను నంబర్లే శాసిస్తాయి… వాజపేయి ప్రభుత్వాన్ని ఒకే ఒక్క వోటు కూలదోసిన తీరే నిదర్శనం… ఈ స్థితిలో జగన్, కేసీయార్, స్టాలిన్ త్రయంపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది… వీళ్లు ముగ్గురూ ఒక్కటిగా ఉంటే… హస్తినను శాసించగలరు, ఢిల్లీ పెత్తనాన్ని నిలువరించగలరు అనే ఆశ కొందరిలో ఈమధ్య బాగా పెరిగింది… ఎందుకంటే, జాతీయ స్థాయిలో బీజేపీని బలంగా నిలువరించగల పార్టీ గానీ కూటమి గానీ లేకుండా పోవడం… నాయకత్వలోపంతో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది… రీసెంట్ ఫలితాలు తాజా తార్కాణం… మోడీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమి నిర్మాణం జరిగే అవకాశాలు కూడా లేవు… సీపీఎం మమతను సహించదు, మమత కాంగ్రెస్‌ను సహించదు… పలు ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ తోక పార్టీగా మారింది తప్ప అది ప్రధాన పార్టీ కాదు… ఎక్కడికక్కడ వైరుధ్యాలున్నయ్…
ఈ నేపథ్యంలో… దక్షిణ రాష్ట్రాల ప్రయోజనాల రక్షణకు గానీ, బీజేపీ విస్తరణను నియంత్రించడానికి గానీ ఏపీ, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రుల దోస్తీ ఉపయోగపడుతుందనే ఆశ ఉత్తరాది పెత్తనాల్ని వ్యతిరేకించేవారిలో పెరగడం సహజం… కేరళ సీఎం కూడా బీజేపీ వ్యతిరేకి అయినా… తనకు స్వేచ్ఛ లేదు… ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు వాళ్ల పార్టీలకు బాసులు… వాళ్లే నిర్ణయాలు తీసుకోగలరు… పినరై విజయన్ అలా చేయలేడు… కర్నాటకలో కుమారస్వామికి చెప్పుకోదగినంత బలం లేదు… ఈ ముగ్గురి వెనుక కలిసొస్తాడేమో గానీ, తను నిర్ణాయక శక్తి కాలేడు… ఈ మూడు రాష్ట్రాల లోకసభ సీట్ల సంఖ్య 81… రాజ్యసభ సీట్ల సంఖ్య 36… నంబర్లాటలో ఇదెంత పెద్ద సంఖ్యో అర్థం చేసుకొండి…
Ads
ఇప్పట్లో తెలంగాణలో కాంగ్రెసో, బీజేపీ సడెన్‌గా రెయిజై పోయి, కుర్చీ ఎక్కేంత సీన్ లేదు… కేసీయార్ ఆధిపత్యం సాగుతోంది… ఏపీలో చంద్రబాబు నుంచి కొంత ప్రతిఘటన ఉన్నా సరే, ప్రస్తుతానికి జగన్‌దే పైచేయి… ప్రతిపక్షాన్ని ఇంకా తొక్కే ప్రయత్నం చేస్తాడు… అన్నాడీఎంకే మనుగడ ప్రశ్నార్థకంగా మారి స్టాలిన్ ఇంకా బలోపేతమవుతాడు… అన్ని లోకసభ సీట్లు, అన్ని రాజ్యసభ సీట్లూ ఈ ముగ్గురి చేతుల్లోనే ఉంటాయని కాదు… కాకపోతే ఈ ముగ్గురి గొంతులూ కలిస్తే ఆ బలం వేరు… జగన్‌కు ఇటు కేసీయార్‌తో, అటు స్టాలిన్‌తో మంచి సంబంధాలున్నయ్… ముగ్గురూ మంచి ‘‘ఆర్థిక వ్యవహారాల నిపుణులే…’’ కానీ ఏం జరిగింది..? ముగ్గురికీ ఏదో భయం… తమ రాష్ట్రాల్లో తమ కేడర్ మోడీపై విరుచుకు పడుతూ ఉంటుంది… ముగ్గురూ ఢిల్లీకి వెళ్తే మాత్రం జీహుజూర్… కేసుల భయం… కేసీయార్‌పై కేసులేమీ లేవు, కానీ పెడతారేమోనని… స్టాలిన్ మీద కూడా కేసులేమీ లేవు… కానీ పాత టూజీ స్కాంలో తమ పార్టీ లీడర్లు, తన సోదరి కణిమొళితో సహా చాలామంది ఉన్నారు… ఆ కేసు మూతపడలేదు… ఇక జగన్ సరేసరి… సొంత పార్టీ ఎంపీయే ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేశాడు… ఒకవైపు ఈ ముగ్గురిపైనా ఆశలు పెరుగుతుంటే… జగన్ ఏం చేశాడు..? ఎవరో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మోడీని ఏదో అన్నాడని, సోరెన్‌కు ట్వీట్ ద్వారా హితబోధ చేశాడు… మోడీ వ్యతిరేకులపై నీళ్లు గుమ్మరించాడు…
హేమంత్ సోరెన్ చదువుకున్నవాడు, చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నవాడు, మోడీ వ్యతిరేక శిబిరంలో ఉన్నవాడు, కాంగ్రెస్-ఆర్జేడీ మద్దతుతో సీఎం కుర్చీ మీద కూర్చున్నవాడు… పైగా మోడీ ఏకపక్ష ప్రసంగంతో విసిగిపోయి… ‘‘సీఎంలు చెప్పేది కూడా కాస్త వినండి మహానుభావా’’ అని ఓ విమర్శ వదిలాడు… రాజకీయాల్లో సహజమే… పైగా కరోనా నియంత్రణలో మోడీ పనితీరు మీద పెద్దఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతున్న దశలో ప్రతిపక్ష శిబిరంలో ఉన్న నాయకుడు ఓ మాట అనకుండా ఎలా ఉంటాడు..? దానికి జగన్ బీజేపీ వాళ్లకన్నా ముందే ఎందుకు స్పందించాల్సి వచ్చింది..? అసలు వైసీపీ శిబిరంలోని కొందరు లీడర్లే తమ బాసు స్పందన చూసి ఆశ్చర్యపోయారు… జగన్ చేసిన వ్యాఖ్యలో తప్పు లేదు, కానీ సోరెన్‌కు కౌంటర్ ఇచ్చే పనేదో బీజేపీ చేసుకుంటుంది కదా… హఠాత్తుగా, వేగంగా ట్విట్టర్ తెర మీదకు జగన్ వచ్చిన తీరు విస్మయకరమే… అసంబద్ధం కూడా… ‘‘మోడీకి భయపడుతున్నాడు, మంచి చేసుకునేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నాడు’’ అనే అభిప్రాయాన్ని జనంలో పెంచడం అంత అవసరమా ఇప్పుడు..?! జగన్ వేసే ప్రతి పొలిటికల్ అడుగులోనూ కొన్ని లెక్కలుంటయ్… చాలామందికి అవి అర్థం కావు… కానీ ఈ అడుగులోని లెక్క కనీసం తనకైనా అర్థమైందా అనేది డౌటే…!!
Share this Article