నిజం… ఒక మమత బెనర్జీ, ఒక జగన్మోహన్రెడ్డి… మరో కోణంలో ఒక కేసీయార్… వాళ్లలాగే ఇప్పుడు అస్సోం ముఖ్యమంత్రి కాబోతున్న హిమంత బిశ్వ శర్మ (52) కూడా కాంగ్రెస్ స్వయంగా కాలదన్నుకున్న వజ్రం… ఇక్కడ వజ్రం అనే మాట తన మేనేజ్మెంట్ నైపుణ్యాలకు సంబంధించిన పదం… మంచి కార్యసాధకుడు… సొల్లు మాటలతో అజ్ఞానాన్ని బయటపెట్టుకునే టైపు కాదు… నిశ్శబ్దంగా కదులుతాడు… తన టార్గెట్ ఏమిటో దానిపైనే దృష్టి పెడతాడు… మింగేస్తాడు… నిజానికి బీజేపీ ఈయన్ని అస్సోంలో అనవసరంగా ముఖ్యమంత్రిని చేస్తున్నది కానీ జాతీయ స్థాయిలో పార్టీ సేవలకు వాడుకోవాలి… కాంగ్రెస్ కాలదన్నుకున్న కేరక్టర్ అనుకున్నాం కదా…. ఆ కథలోకి వెళ్దాం ఓసారి… ఆ కథ బహుముఖ నీతుల్ని చెబుతుంది కాబట్టి… కాంగ్రెస్ వంటి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ నానాటికీ ఎలా భ్రష్టుపట్టిపోతున్నదో చెప్పుకోవాలి కాబట్టి… ఇప్పటికైనా అది తన తప్పులు తెలుసుకుని, దిద్దుకుని బీజేపీకి దీటైన ప్రతిపక్షంగానైనా నిలబడే ప్రయత్నం చేస్తుందేమోనని జనంలో ఆశ ఉన్నది కాబట్టి…
నిజానికి హిమంత బీజేపీ రక్తం ఏమీ కాదు… అంటే, సంఘ్ పరివార్‌లో అక్షరాలు దిద్దుకున్న కార్యకర్త కాదు… ఆర్ఎస్ఎస్ ప్రొడక్ట్ కాదు… అప్పట్లో 1979 నుంచి 1985 మధ్య… అస్సాంలో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది… చాలామంది లీడర్లను తయారు చేసింది… ఆసు అనే వేదిక అక్కడ అధికారాన్ని కూడా చేజిక్కించుకుంది… హిమంత కూడా అలా పుట్టిన నాయకుడే… అప్పటి ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత, అస్సాం గణపరిషత్ మరో కీలకనేత భృగుకుమార్ పుఖాన్లకు సన్నిహితుడే… తరువాత దూరమయ్యాడు… కాంగ్రెస్‌లో చేరాడు… ఏజీపీ చీలికలతో సతమతం అవుతున్నప్పుడు అప్పటి సీఎం హితేశ్వర్ సైకియా ఈ హిమంతుడి మేనేజ్మెంట్ స్కిల్స్ గమనించి కాంగ్రెస్‌లోకి లాగేశాడు… తరువాత తన గురువు భృగుకుమార్ పుఖాన్పైనే జలుక్బరి స్థానంలో పోటీచేసి గెలిచాడు… తరుణ్ గగోయ్ వరుసగా మూడుసార్లు సీఎం అక్కడ… ఆయనకు హిమంతుడు వ్యూహకర్త… తన కేబినెట్లో కీలక మంత్రి…
Ads
మన రాజకీయాల్లో ఉన్న రోగమే వారసత్వం కదా… తరుణ్ గగోయ్కీ అదే పట్టుకుంది… కొడుకు గౌరవ్ గగోయ్‌ను బాగా ప్రమోట్ చేయాలని అనుకున్నాడు… తన స్థానంలోకి తీసుకురావాలని అనుకున్నాడు… పార్టీలో అసంతృప్తికి దారితీసింది అది… రెండేళ్లు హిమంతుడు కూడా అదే అసంతృప్తితో కొనసాగాడు… తనకు ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా ఉంది… తెలుసు కదా, బ్రహ్మాండమైన మేనేజ్మెంట్ నిపుణుడని…! సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ తనకు సర్దిచెప్పి, వచ్చేసారి నువ్వే సీఎం అని హామీ ఇచ్చి పార్టీలోనే కాపాడుకునే ప్రయత్నం చేశారు… కానీ రాహుల్ గాంధీ చెడగొట్టాడు… రాహుల్ ఎంత పెడసరంగా వ్యవహరించాడంటే…. ఓసారి అస్సాం అసంతృప్త ఎమ్మెల్యేలు రాహుల్ నివాసానికి వెళ్లారు, ముందస్తు అపాయింట్మెంట్తోనే…! ఆ దొరవారు వీళ్లతో మాట్లాడకుండా తన పెంపుడుకుక్కతో ఆడుకుంటూ కూర్చుకున్నాడు… హిమంతుడి వర్గం అభిమానం దెబ్బతిన్నది… వాళ్లూ మనుషులే కదా… హిమంతుడిని బీజేపీ సరిగ్గా ఆ సమయంలోనే పికప్ చేసుకుంది… పది మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరాడు హిమంత్… ఇది జరిగాక ఒకే ఒక ఏడాదిలో కాంగ్రెస్ పార్టీని కూలదోసి బీజేపీ అస్సాంను కైవసం చేసుకుంది… మొన్నటిదాకా కొనసాగిన ప్రభుత్వంలో హిమంత్ కీలకమైన మంత్రి… ఇప్పుడు ముఖ్యమంత్రి… సో, బీజేపీలో తన ఆయుష్షు కేవలం ఏడేళ్లే…. కానీ ఎంత వేగంగా పైకి ఎదిగాడో ఇంకాస్త తెలుసుకుందాం…
గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా… తనకు అప్పగించినవి చాలా సంక్లిష్టమైన పార్టీ బాధ్యతలు… తను వివాదరహితుడైన నిప్పేమీ కాదు… లూయీస్ బర్గర్ బ్రైబరీ స్కాం, శారదా చిట్‌ఫండ్ కేసుల్లో ఆరోపణలు వచ్చినా అవి నిలవలేదు… నక్సలైట్లను, మైనారిటీ ప్రధాన పార్టీలను కూడా కూడగట్టి బీజేపీతో పొత్తు కుదిర్చేంత మేనేజ్మెంట్ కెపాసిటీ… ఈశాన్య ఎన్డీఏ సపరేటుగా ఏర్పాటు చేసిన బీజేపీ తనను కన్వీనర్‌ను చేసింది… ఇక అప్పటి నుంచి ఒక్కొక్క రాష్ట్రాన్నే కబళిస్తూ పోయింది బీజేపీ… ఇప్పుడు దాదాపుగా ఈశాన్యమంతా బీజేపీ గుప్పిట్లో ఉన్నదంటే అబద్ధమేమీ కాదు… ఒకప్పుడు బీజేపీకి అవి దుర్గమప్రాంతాలు… తనను కేవలం అస్సాంకు పరిమితం చేయడం పార్టీ కోణంలో కరెక్టు కాదు… ఏమో, మాకే థ్రెట్ అయిపోతాడని ఎవరైనా పెద్దలు భయపడుతున్నారేమో… అందుకే అస్సాంలోనే బంధించేశారేమో….
ఈ కార్యసాధకుడి భార్య పేరు రినికి భూయన్… స్వతహాగా లాయర్… తరువాత ఓ న్యూస్ చానెల్ స్టార్ట్ చేసింది.., క్రమేపీ అది ఓ మీడియా గ్రూపుగా పెరిగింది… మెజారిటీ వాటాలు హిమంతుడి కుటుంబానివే… భార్య పేరిటే 51 శాతానికి పైగా వాటాలున్నయ్… అదుగో ఆ నేపథ్యంలోనే శారదా చిట్‌ఫండ్ సంబంధాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది కూడా… సదరు మీడియా చానెల్ వాటాలు, వివరాలను పైన చార్టులో చూడొచ్చు… ఇదీ కాంగ్రెస్ కాలదన్నుకున్న కార్యసాధకుడి కథ… సరే బ్రదర్, ఈ రెండుమూడేళ్లు అక్కడే ఉండు… ఏమో… తరువాత హస్తిన పిలుస్తుందేమో… పిలిచేలా నువ్వు చేసుకుంటావేమో… అసలే అసాధ్యుడివి…!!
Share this Article