……… by……. Ashok Vemulapalli………. NAYATTU………. కొన్నిసినిమాలు చూశాక ఆ మూడ్ నుంచి చాలా రోజుల వరకూ బయటకు రాలేము.. ఆ సినిమాల ముగింపు కూడా ప్రేక్షకులకే తేల్చుకోండని వదిలేస్తాడు డైరెక్టర్.. వ్యవస్థలో ఉండే లోపాలు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యాధ్వేషాలు అన్నీ కొన్ని సందర్భాల్లో మనిషి మీద రిఫ్లెక్ట్ అవుతాయి.. బయటి శతృవులు చేసే దాడి ముందే తెలిస్తే మనం కూడా ఆయుధాలతో సిద్దంగా ఉండి ఎదుర్కోవచ్చు.. కానీ ఇంట్లోనే శతృవులు ఉంటే ఎప్పుడు, ఎలా దాడి చేస్తారో తెలియకపోతే ఆ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది.. నయాట్టు సినిమా కూడా అదే..
ఒక చిన్న లైన్ తో రెండున్నర గంటలపాటు దర్శకుడు అద్భుతంగా సినిమా తీశాడు.. సినిమా ముగిసిపోయాక కూడా కనీసం పావుగంట ఆ సినిమా గురించి మనం చర్చించుకుంటాం.. ఎస్సై పాత్రలో మనకు కనిపించే జోజు జార్జ్ మీద విపరీతమైన జాలి కలుగుతుంది. కొన్నిసార్లు అతని లో మనల్ని ఊహించుకుంటాం.. నయాట్టు సినిమా చివర్లో ఒక సన్నివేశం ఉంటుంది.. ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంటే ఒక కళ్లు లేని వృద్ధురాలు పోలింగ్ బూత్ కి వస్తుంది.. ఆమెను ఒక కుర్రాడు చేయి పట్టుకుని ఈవీఎం దగ్గరకు తీసుకెళ్తాడు.. అక్కడ కళ్లు లేని ఆ వృద్దురాలి వేలు పట్టుకుని ఈవీఎం బటన్ మీద నొక్కుతాడు.. అంతే ఈవీఎం శబ్దం వినిపిస్తుంది.. డైరెక్టర్ పేరు తెరమీద కనిపిస్తుంది… ఇదేదో చిన్న సన్నివేశం కదా ఇందులో ఏముంది అనుకోవచ్చు..ఆ చిన్న సన్నివేశంలోనే సినిమా స్టోరీ మొత్తాన్ని చూపిస్తాడు దర్శకుడు.. అక్కడ కళ్లులేని వృద్ధురాలు సమాజం అయితే ఆమెతో ఓటు వేయించేది పొలిటికల్ లీడర్లు.. ఆమె ఎవరికి ఓటేయాలనుకుందో ఇక్కడ అనవసరం.. పొలిటికల్ లీడర్లు ఆడే గేమ్ లో సొసైటీలో ప్రజలంతా పావులే… వాళ్లకి కళ్లుండవ్.. నాయకులు ఏది చెప్పినా నమ్మేస్తారు.. ఆ మైకంలో ఆలోచన మందగిస్తుంది.. ఓటు వేయడానికి ఈవీఎం మీదకు వేలు మనకు తెలీకుండానే వెళ్లిపోతుంది..
పొలిటికల్ లీడర్లు ఆడే గేమ్ లో ముగ్గురు పోలీస్ అధికారులు ఎలా బలయ్యారు అనేది నాయట్టు సినిమా.. నాయట్టు అంటే వేట అని అర్థం.. చేయని తప్పుకు ఉచ్చులో చిక్కుకున్న ముగ్గురు పోలీసులను అదే డిపార్ట్ మెంట్ అధికారులు వెంటాడి వేటాడటమే ఈ సినిమా సారాంశం.. స్థూలంగా పోలీసులకు సొంత అభిప్రాయాలు ఉండవ్.. అధికారంలో ఉన్న నాయకుడు, పరిపాలకుడు ఏం చెబితే అది చేయాల్సిందే.. తాము చేస్తున్నది తప్పని తెలిసినా సరే కళ్లు మూసుకోవాల్సిందే.. తమతో కలిసే పని చేసే ముగ్గురు పోలీసులు తప్పు చేయలేదని ఉన్నతాధికారులందరికీ తెలుసు.. కానీ అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం జరగకూడదంటే తమ వాళ్లైనా సరే ఇరికించాల్సిందే..
Ads
మళయాళం సినిమాలు చూసేవారికి జోజి జార్జ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. జోసెఫ్ సినిమాలో రిటైర్డ్ తాగుబోతు పోలీస్ గా, చోళలో జీప్ డ్రైవర్ గా, ఇటీవలే వచ్చిన వన్ సినిమాలో బేబీగా, వైరస్ మూవీలో బాబుగా అతని నటనను చూశాం.. ఇక నిమిషా సజయన్ గ్రేట్ ఇండియన్ కిచెన్ ద్వారా మనందరికీ పరిచయమే… చోళలో అమాయక పల్లెటూరి అమ్మాయి పాత్రలో జీవించేసింది.. అలాగే ఒరు కుప్రసిద్ద పయ్యన్ సినిమాలో లాయర్ గా అద్భుతంగా నటించింది. ఇదే సినిమా తెలుగులో వ్యూహం పేరుతో డబ్ అయింది కానీ నడవలేదు… అదే సినిమాని అల్లరి నరేష్ తో నాంది సినిమాగా తీశారు.. ఇక ప్రైవేట్ ఉద్యోగి అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా వారికి శతృవులు ఎక్కడో ఉండరు.. వారి ఆఫీసుల్లోనే వారి స్నేహితుల రూపంలోనే ఉంటారు… (సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది)
Share this Article