ఓ ఊరి కథ అంటూ మన ఊరికొచ్చి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పనోరమా విభాగంలో తెలుగు సినిమాకు పట్టం కట్టించిన దర్శకుడు మృణాల్ సేన్. 25వ జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా ఆ బెంగాలీ దర్శకుడి మెగాఫోన్ తో రూపుదిద్దుకున్న ఓ ఊరికథ. మరి భారత్ గర్వించదగ్గ పేరెన్నికగన్న దర్శకుల్లో ఒకరైన సేన్ పుట్టినరోజున ఆయన సంస్మరణే ఈ యాది.
రెగ్యులర్ అండ్ రొటీన్ ప్యాటర్న్ సినిమాను ఆఫ్ బీట్ మోడ్ తో కొత్త జానర్ లో సజీవంగా నడిపించిన ఇండియన్ తొలితరం దర్శకుల్లో మృణాల్ సేన్ ది… సత్యజిత్ రే తో పోటీ పడ్డ హైట్. రే, సేన్, రిత్విక్ ఘాటక్ ఈ ముగ్గురూ బెంగాలీ సినిమాను ప్రపంచ యవనికపై నిలబెట్టిన దర్శకులు. ముగ్గురూ మంచి మిత్రులే అయినప్పటికీ… సినిమా నిర్మాణపరంగా మాత్రం పోటీలో ఎవరి రీతి, ఎవరి శైలి వారిదే!
ఓ ఊళ్లో ఏ పనికీ పోకుండా… ఎలాగైతే అలా.. కట్టెలు కొట్టుకోనో.. లేక ఓ రెండ్రోజులు పస్తులుండో బతకడమే తప్ప… ఎవ్వరివద్దా తలవంచని ఆత్మగౌరవం మెండైన… ఆకలిని జయించిన ఇద్దరు తండ్రీ, కొడుకుల కథను సెల్యూలాయిడ్ కు సేన్ ఎక్కించిన తీరు చూస్తుంటే… నిజంగానే మనమా ఊళ్లోనే ఉన్నామా అనిపిస్తుంటుంది. కొడుకు తండ్రికి నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. ఆ అమ్మాయి ఆ తర్వాత కుటుంబాన్నే నియంత్రించడానికి యత్నించడం.. మామ మాత్రం మారకపోవడం.. తీరా ఆమె గర్భవతవ్వడం.. తండ్రి మంత్రసానిని పిలవడానికి నిరాకరించడం.. వైద్యసాయమందని స్థితిలో కోడలు మరణించడం.. ఆమె అంత్యక్రియల కోసం డబ్బు యాచించడం.. ఇదిగో ఇలా నడుస్తుంటుంది ఓ ఊరి కథ.
Ads
ప్రేమ్ చంద్ మున్షీ రాసిన కఫాన్ ఆధారంగా ఓ ఊరి కథను మల్చారట సేన్. అయితే పాత్రలను పాత్రధారులతో పండించిన తీరు.. సజీవంగా మనమే ఆ ఊళ్లో ఉండి అంతా చూస్తున్నామా అన్నట్టుగా నడిపించిన స్క్రీన్ ప్లే సేన్ పనితనానికి ప్రతీకైతే… దొరహంకారానికి వ్యతిరేకంగా కనిపించే కమ్యూనిస్ట్ భావజాలానికి ఆకర్షితుడైన ఆయన వ్యవహారశైలీ సినిమాలో ప్రస్ఫుటిస్తుంది.
తన తొమ్మిది, పదేళ్ల మధ్య వయస్సులో చార్లీచాప్లిన్ నటించిన ‘ది కిడ్’ సినిమా సేన్ పై ఎనలేని ప్రభావం చూపింది. కొంతకాలం సీపీఐ సాంస్కృతిక విభాగంలోనూ పనిచేసిన సేన్… బతుకుచిత్రం కోసం మెడికల్ రిప్రజంటేటివ్ గా పనిచేసినా… రంగురంగుల చలనచిత్రమే రారమ్మని ఊరించేసరికి తన ఠికాణా కాస్త కలకత్తాకు మారిపోయింది. రాత్ భోరే, నీల్ ఆకాషర్ నీచే వంటి బెంగాలీ చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఆతర్వాత చేసిన బైషే శ్రావణ్, భువన్ షోమ్ వంటి చిత్రాలు ఆయనకు ఎనలేని గుర్తింపునిచ్చాయి. ఒక పేద జంట ఆహారం లేకుండా తమను తాము నిలబెట్టుకోవటానికి పడే కష్టాలు.. విపత్తును ఎదుర్కోవడంలో మానవ స్వభావంలోకనిపించే చీకటి కోణాలను ఆవిష్కరించడమే బైషే శ్రావణ్. విదేశీ చలన చిత్రోత్సవానికి లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు మొట్టమొదటగా పంపిన మృణాల్ సేన్ చిత్రం బైషే శ్రావణ్.
మృణాల్ సేన్ తన సినిమా క్యాన్వాస్ కు ఎంచుకునే ఇతివృత్తాలన్నీ చీకటి కథలో లేక, ఆవేదనాపూరితమైన అంశాలో ఉంటాయని.. ఆయన సినిమాలన్నీ దుఖంతో కూడిన ముగింపులేనన్న విమర్శలతో పాటే… తన కమ్యూనిజం భావజాలం కూడా తన సినిమాలపై ఉంటుందన్న సునిశితమైన ఆరోపణలనూ ఎదుర్కొన్నారు. అయినా సరే తన పంథా మాత్రం మానకుండానే… తన సినిమా ద్వారా ఏం చెప్పదల్చుకున్నారో సూటిగా… అంతే సజీవంగా చెప్పగల్గిన చలనచిత్ర నిర్మాణశిల్పి సేన్.
సేన్ సినిమాలకు ప్రీ ప్రొడక్షన్ లో అయినా.. పోస్ట్ ప్రొడక్షన్ లో అయినా ఆయన భార్య, సేన్ సినిమాల్లో నటైన గీతా సేనే ప్రధాన విమర్శకురాలు. సేన్ కెమెరా అనే థర్డ్ ఐతో పనిచేస్తే… ఆమె తన భర్త మూడు కళ్లకు.. తన రెండు కళ్లూ జోడించి ఒక వ్యూయర్ గా నిక్కచ్చిగా ప్రీప్రొడక్షన్ లోనే నచ్చలేదని చెప్పిన ఎన్నో సందర్భాలే.. ఆ తర్వాత ఆయా సినిమాల్లోని ఆయా సన్నివేశాలు పండడానికి ప్రధాన కారణమంటుంది వారినెరిగిన నాటి తరం.
కలకత్తా అంటే వల్లమాలిన అభిమానమున్న సేన్… కలకత్తా నగరంలోని విభిన్నకోణాలను స్పృశిస్తూ… సమాంతర సినిమాకు భిన్నంగా పేదరికం, నిరుద్యోగిత వంటి పలు అంశాలను జొప్పించి రూపొందించిన డాక్యుమెంటరీసూ రంగురంగుల కలకత్తా వెనుకనున్న ఈతిగాధలను ప్రస్తావించి సమాజం కళ్లకు కట్టాయి.
96 ఏళ్లు బతికిన సేన్ 2002 లో తన చివరి చిత్రం అమర్ భువన్ షూటింగ్ సందర్భంగా.. తన చిత్రనిర్మాణ ప్రక్రియ గురించి మాట్లాడినప్పుడు… “తాను సినిమా చేసిన తరువాత కూలిపోయినట్లు అనిపిస్తుంది.. కానీ తాను తిరిగి మళ్ళీ మేల్కొంటానని చెప్పేవాడట”. నిజంగానే సేన్ లేకపోయినా… రొటీన్ రొడ్డకొట్టుడు సినిమా ప్రపంచంలో ఆయన సినిమా ఇప్పటికీ బతికే ఉంటుందిలా టీవీల్లో, ఇలా అక్షరాల్లో. అందుకే ఇండియన్ సినిమా రేంజ్ ని ప్రపంచానికి చాటిచెప్పి.. దాదాసాహెబ్ అందుకున్న ఆ పద్మభూషణుడు.. సినిమా ఉన్నంతకాలం చిరంజీవే………… రమణ కొంటికర్ల
Share this Article