ఒకప్పుడు మళయాళ సినిమా అంటే సబ్ స్టాండర్డ్ బోల్డ్ సీన్లతో చుట్టబెట్టేసి జనం మీదకు వదిలేసే నాసిరకం సరుకు… అలాంటి సినిమాలే తెలుగులోకి డబ్ అయి వచ్చేవి కాబట్టి అందరికీ అదే అభిప్రాయం ఉండేది… కానీ ఓటీటీలు వచ్చాక జనం కేరళ సినిమాలోని రియల్ క్రియేటివిటీ పార్ట్‌ను చూస్తున్నాడు, ఫీలవుతున్నాడు… కొన్ని మనకు కనెక్ట్ కావచ్చు, కొన్ని కాకపోవచ్చుగాక… కానీ ప్రయోగాలు సాగుతూనే ఉన్నయ్… భారీతనం జోలికి పోకుండా, ఫార్ములాల వాసన తగలకుండా… మరీ మనకు అలవాటైన ఆ వెగటు సినీ వంటకాల జోలికి అసలే వెళ్లకుండా… తక్కువ ఖర్చుతో, కథనే ప్రధానంగా నమ్ముకుని, ఏదో ఓ కొత్తదనం కోసం ప్రయత్నించే సినిమాలు… ఇప్పుడు అనుకోని అతిథి అని ఓ సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు… అది అథిరన్ అనే మళయాళ సినిమాకు డబ్బింగ్ వెర్షన్… దీనికి ప్రధాన ఆకర్షణ సాయిపల్లవి… అఫ్ కోర్స్, తెలుగులో ఆమెకున్న పాపులారిటీని కాస్త సొమ్ము చేసుకునే ప్రయత్నం అని కూడా అనిపిస్తుంది… అయితే..?
సినిమాలో సాయిపల్లవి ఓ మెంటల్ కేరక్టర్లో బ్రహ్మాండంగా చేసింది… పెద్దగా డైలాగులుండవ్… ఎక్కువగా హావభావాలతోనే… ఈ సినిమాలో కొన్ని సీన్ల కోసం ఆమె కలరిపయట్టు యుద్ధవిద్యను ప్రాక్టీస్ చేయడం సరేసరి… అయితే కథ ప్రకారం ఆమెకు ఎంత స్కోప్ ఇవ్వాలో అంతే ఇచ్చాడు దర్శకుడు… ఫహాద్ ఫాసిల్ కూడా ఎంతవరకు నటించాలో అంతే… ఓ కీలకమలుపు కోసం ప్రకాష్ రాజ్ వస్తాడు సెకండాఫ్‌లో… మనకు నటులు కనిపించరు, పాత్రలు కనిపిస్తాయి… అసలే థ్రిల్లర్ సినిమా కదా… సీన్లు మాత్రమే కనిపిస్తాయి, కథలోకి లాక్కెళ్తాయి… లీనం చేస్తాయి… మంచి ప్రయత్నం… ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇంకా బాగుంటుంది… అక్కడక్కడా కాస్త కథ లూజ్‌గా ఉన్నట్టు అనిపించినా సరే, కథనంలోని బిగి దాన్ని కప్పేస్తుంది… మనమేదో డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టు కూడా ఉండదు… ప్రధాన పాత్రల్లో పరిచయమున్న మొహాలు కాబట్టి…!
Ads
ఓ పిచ్చాసుపత్రి… కొందరు రోగులు… అందులో ఏం జరుగుతుందో బయటికి తెలియదు… హఠాత్తుగా ఓ డాక్టర్ చెకింగు కోసం వస్తాడు… అన్నీ తెలుసుకుంటాడు… ఆ రోగుల్లో ఒక రోగి సాయిపల్లవి… ఆమెకు ఓ నేపథ్యం ఉంటుంది… ఇంతకీ ఆమె ఎవరు..? ఈ డాక్టర్ ఎవరు..? ఆమె ఎందుకు ఇక్కడ రోగిగా బందీ అయ్యింది..? ఒక థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన ట్విస్టులతో కథ సాగిపోతూ ఉంటుంది… మళయాళ సినిమాల్లో మనకు నచ్చే మరో విషయం ఏమిటంటే..? దర్శకుడి గ్రిప్ ఉంటుంది కథపై, కథనంపై, నటీనటులపై… మన దగ్గర కొందరు హీరోలు వాళ్లే డైరెక్ట్ చేసిపారేస్తారు సినిమాను… ఈ సినిమాలోనూ నటీనటులు పాత్ర పరిధి మేరకు మాత్రమే నటిస్తారు… ఇన్ యాక్షన్ ఉండదు, ఓవర్ యాక్షన్ ఉండదు… 1970 కథాకాలం… అసలు ఆహాలో ఉండే కంటెంటు మీద ప్రేక్షకుల్లో ఓ వ్యతిరేక భావన ఉంది… ఏది పడితే అది నింపేస్తున్నారు అని… అది పోవడానికి ఈ సినిమా కాస్త ఉపయోగపడుతుంది… అతుల్ కులకర్ణి, ప్రకాష్‌రాజ్, సాయిపల్లవి, ఫహాద్ ఫాసిల్… గ్రిప్ సడలని కథాకథనాలు… దానికి తగినట్టు నేపథ్యసంగీతం, సినిమాటోగ్రఫీ… సరిపోదా..?!
Share this Article