.
Subramanyam Dogiparthi …. ఈ ఆస్తులు అంతస్తులు 1969 లో వచ్చిన కృష్ణ , వాణిశ్రీ , యస్ వరలక్ష్మి , రేలంగి ఆస్తులు- అంతస్తులు సినిమా కాదు . కధాంశం మాత్రం అదే .
డబ్బున్నోళ్ళ ఆడబిడ్డ ఎలాంటి ఠికాణా లేని పేదోడిని ప్రేమించిన ఆ వాణిశ్రీ , కృష్ణల ప్రేమ కధ వంటిదే . అయితే అది శాకాహారం , ఇది కాస్త నాన్ వెజిటేరియన్ .
Ads
కృష్ణ , వాణిశ్రీల ఆస్తులు అంతస్తులు సినిమా నాకు బ్రహ్మాండంగా నచ్చిన సినిమా . ఇంక ఈ 1988 ఏప్రిల్ ఆస్తులు అంతస్తులు సినిమాకు వద్దాం .
ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది . రెండు పక్క పక్క ఊళ్ళను పాలించే ఇద్దరు రాక్షసులు కోట శ్రీనివాసరావు , చరణ్ రాజ్ . కోటకు ఓ గడసరి కూతురు . ఆమె తమ ఇంట్లో పనిచేసే చంటి లాంటి అమాయక పనివాడు రాజేంద్రప్రసాదుని ప్రేమించేస్తుంది . వెంటబడి ఒప్పించుకుంటుంది . ఇంక ఆస్తులు అంతస్తులు అడ్డం వస్తాయి .
తప్పుడు కేసు బనాయించి రాజేంద్రప్రసాదుని కోట జైలుకు పంపుతాడు . జైల్లో పిల్లి లాంటి రాజేంద్రప్రసాద్ పులి అయి బయటకు వస్తాడు . వచ్చి కంస మామకు అల్టిమేటం ఇస్తాడు . నీ కూతురిని పెళ్లి చేసుకుంటాను దమ్ముంటే ఆపుకో అని సవాలు విసురుతాడు .
కోట శ్రీనివాసరావు తన ప్రత్యర్ధి అయిన చరణ్ రాజుతో అవగాహనకు వచ్చి చివరకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసేందుకు సిధ్ధపడతాడు . కానీ చరణ్ రాజ్ తన మనసు మార్చుకుని రాజేంద్రప్రసాద్ , రమ్యకృష్ణల పెళ్ళికి సహకరిస్తాడు . కోట శ్రీనివాసరావుకు బుధ్ధి వచ్చి ఆ పెళ్ళిని ఆమోదించి జైలుకు వెళ్ళటంతో సినిమా సుఖాంతం అవుతుంది .
విలనాసురులుగా నటించిన కోట శ్రీనివాసరావు , చరణ్ రాజుల గురించి చెప్పేదేముంది . పండిపోయిన విలనాసురులు . సినిమాలో రెండు జంటలు . ఒకటి రాజేంద్రప్రసాద్ , రమ్యకృష్ణ . మరొకటి చంద్రమోహన్ , రెండు జళ్ళ మహాలక్ష్మి . నలుగురూ బ్రహ్మాండంగా నటించారు . చంద్రమోహన్ అదరగొడతాడు .

మరో ముఖ్య పాత్ర గంగులు పాత్ర . ఆ పాత్రలో ప్రభాకరరెడ్డి బాగా నటించారు . ఇతర పాత్రల్లో శుభ , మమత , రాళ్ళపల్లి , మాడా , సారధి , భీమేశ్వరరావు తదితరులు నటించారు . బి భాస్కరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి .
బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , మనో ఆ శ్రావ్యమైన పాటల్ని పాడారు .పాటల్ని వేటూరి , గోపి , రాజశ్రీలు వ్రాసారు . మిడిసిపడే దీపాలివి ఎగిసిపడే కెరటాలివి వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు , అలుపు రాని కెరటాలివి గెలుపు లేని హృదయాలివి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . రాజేంద్రప్రసాద్ , రమ్యకృష్ణల మీద రెండు డ్యూయెట్లు బాగా చిత్రీకరించబడ్డాయి .
తుళ్ళి తుళ్ళి తుళ్ళిందమ్మా ఎంతో వింతగా , ఆడెను ఒక పువ్వల్లె ఈ తోట సాగేను సందేళ నా పాట అంటూ సాగే డ్యూయెట్లు బాగుంటాయి . ఇద్దరు విలనాసురుల పాట ఒకటి కన్నె వయసు వచ్చె లేత సొగసు తెచ్చె నోరూరిపోతుంది బాగుంటుంది . మనసు కవి ఆత్రేయ ఈ సినిమాకు మాటలు వ్రాయడం విశేషం.
మన తెలుగు సినిమాకు మాతృక తమిళంలో వచ్చిన ముదల్ వసంతం . తమిళంలో పాండియన్ , సత్యరాజ్ , రమ్యకృష్ణ , రెండు జళ్ళ మహాలక్ష్మి నటించారు . హిందీలో కూడా రీమేక్ అయింది . హిందీలో సంజయ్ దత్ , జాకీ షరాఫ్ , జయప్రద , రాజ్ బబ్బర్ , నీలం , సోనంలు నటించారు .
మన తెలుగు సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు చూడవచ్చు . చూడబులే . సినిమాలో గుర్రాలని అదుపులోకి తీసుకునే పోటీలు హైలైట్ . నేను పరిచయం చేస్తున్న 1188 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article