.
Subramanyam Dogiparthi …. కమల్ హాసన్ నటించిన మన్మధ లీల , అరవింద్ నటించిన సతీ లీలావతి సినిమాలు గుర్తున్నాయి కదా ! ఉన్ కా బాప్ యే తేనెటీగ సినిమా . 1991 ఫిబ్రవరిలో వచ్చిన ఈ ఫుల్ రొమాన్స్ , s -exiting కామెడీ సినిమాకు పెద్ద స్టోరీయే ఉంది .
Seven years itch అనే ఇంగ్లీషోళ్ళ థియరీ ఒకటుంది . అదేంటంటే పెళ్ళయిన మగాళ్ళకు/ మగోళ్ళకు పెళ్ళయాక ఏడేళ్ళకు ఓ తెగులు (జిల) పుడుతుంది(ట) . దానితో రోడ్డు మీద పడతారు(ట) . ఈ కధాంశంతో 1955 లో ఇంగ్లీషులో ఇదే టైటిలుతో ఓ సినిమా వచ్చింది . అందులో Marilyn Monroe , Tom Ewell లీడ్ పాత్రల్లో నటించారు .
Ads
అలాంటి కధాంశంతో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఈ తెనెటీగ నవలను వ్రాసారు . ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1988 లో ధారావాహికగా వచ్చింది . అప్పట్లో దాని ప్రమోషన్ ప్రకటనలు వగైరా చాలా వివాదాస్పదం అయ్యాయి . మా నరసరావుపేటకు చెందిన అశ్లీల ప్రతిఘటన వేదిక అధ్యక్షులు , ప్రముఖ గాంధేయవాది ఈదర గోపీచంద్ న్యాయపరంగానే కాకుండా సాహిత్య పరంగా , వీధి పోరాటాలు కూడా చేసారు . చివరకు మల్లాది వారు రెండో ముద్రణకు వెళ్ళనని ప్రకటించారు . అయితే ఈ ప్రకటనకు ముందే ఈ సినిమా వచ్చేసింది కొన్ని సెన్సార్ కట్లతో .
ఇంత పెద్ద కధ ఉన్న ఈ సినిమా కధ ఏంటంటే : ఓ భార్యాభర్త , కొడుకు , భార్య తండ్రి వైజాగులో ఉంటారు . బాగా స్థితిపరులు . మామ గారి పాత్రను చక్రవర్తి పోషించారు . చాలా సెక్సియిష్టు . చీరె కనపడితే కారు ఆగిపోతుంది . లైనేస్తుంటాడు . అతనికి ఇలాంటి తొట్టి గేంగ్ ఒకటి ఉంటుంది . డర్టీ జోక్స్ , డర్టీ బుక్స్ , ఆ బాపతు జోక్స్ , ప్లేబాయ్ మేగజైన్ ప్రియులు అన్న మాట . వాళ్ళల్లో వాళ్ళు డర్టీ జోక్స్ , సెక్సియిష్టు జోక్స్ వేసుకుంటూ శునకానందం పొందుతుంటారు .
భర్త గారి పాత్రలో రాజేంద్రప్రసాద్ మొదట్లో రాముడు మంచి బాలుడు వంటివాడే . తేనెటీగ కుట్టాక మామగారి లాగే చీరె కనపడితే కారు ఆగిపోతూ ఉంటుంది . కనిపించిన స్త్రీ మీద మనసు పారేసుకుంటూ ఉంటాడు . అసలు ధైర్యం చేయటానికి వెనకాముందు ఆడుతుంటాడు . చేతి చమురు వదిలించుకుంటూ ఉంటాడు .
మామా అల్లుళ్ళ రొమాంటిక్ స్టోరీ ఇలా సాగుతూ ఉంటుంది .
మామగారికి సితార తారసపడుతుంది . పెళ్ళి చేసుకుంటానంటూ వెంటపడతాడు . బకరా దొరికాడు కదా అని సితార ఆడుకుంటూ ఉంటుంది . చివర్లో షాకిచ్చి త్వరలో మరొకరితో పెళ్లి కానున్నదని చెపుతుంది . ఈ రెండు పాత్రలూ బాగుంటాయి .
ఇంక అల్లుడు . అతనికి ఓ మోడల్ సుమప్రియ తారసపడుతుంది . పెళ్ళయిందా అని అడుగుతుంది . సతీ లీలావతిలో అరవింద్ లాగా కాలేదని చెపుతాడు . చివరకు భార్య రేఖతో కలిసి నాటకం ఆడి బట్టలు ఊడదీసి ఇంటికి పార్సెల్ చేస్తుంది . ఇద్దరూ కలిసి తలంటి పోస్తారు .
Strp poker/ strp cards . ఈ కార్డ్స్ ఆట ఎప్పుడయినా ఆడారా !? ఓడిపోయిన వారు బట్టల్ని ఒక్కోటొక్కోటి తీసేస్తుండాలి . But , don’t try same ex strp cards game . ఇది కూడా కొన్ని దేశాలలో ఉందట .
Seven years itch మీలాగే మా ఆడవాళ్ళకు కూడా కలిగితే , మా ఆడవాళ్ళకూ తేనెటీగలు కుడితే మీరేం కావాలి అని ఓ ప్రశ్న వేసి ఇద్దరు భామలు గీతోపదేశం చేస్తారు . నిజమే . అలా జరిగితే కలి యుగాంతమే లేదా ఇప్పుడు రోజూ పత్రికలలో చదువుతున్నట్లు ప్రియుడితో లేపించటమే . వామ్మో !
ఈ మామా అల్లుళ్ళతో పాటు అల్లుడికి ఓ డర్టీ ఫ్రెండ్ బ్రహ్మానందం ఉంటాడు . అతని భార్య కుట్టి పద్మిని . భర్త గాలి గాడని తెలిసినా సతీ సుమతిలాగా సర్దుకుపోతూ ఉంటుంది . అలా ఈ మూడు కాంబినేషన్ల చుట్టూ తిరుగుతుంది సినిమా .
చాలామంది నటీమణులు అవసరం అవుతారు కదా ! అలాగే కుయిలీ , డిస్కో శాంతి , చంద్రిక వగైరా , చాలామంది తళుక్కుమంటారు . కధను నేసిన మల్లాది వారే మాటల్ని కూడా వ్రాసారు . భావ కాలుష్యం , పద కాలుష్యం కాస్త ఉంటాయి . అయినా సంసారపక్షంగానే ఉంటాయి. సినిమాలో eyes & years అనే ఓ డిటెక్టివ్ సంస్థ కార్యకలాపాలు సరదాగా ఉంటాయి .
షూటింగ్ అంతా వైజాగే . రామకృష్ణ బీచ్ , హోటల్ మేఘాలయ , షాపింగ్ సెంటర్లు అన్నీ కనిపిస్తాయి . అప్పుడూ ఇప్పుడూ లవ్లీ సిటీ వైజాగ్ . మద్రాస్ ఎంత బ్యూటీ సిటీయో అంతే , బహుశా అంత కన్నా , బ్యూటీ సిటీ వైజాగ్ . వైజాగ్ అందాలను బాగానే వాడుకున్నారు .
విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగా చిత్రీకరించబడ్డాయి . భువనచంద్ర వ్రాసిన A ఫర్ అమల B ఫర్ భానుప్రియ అంటూ ఇంగ్లీషు అక్షరమాలలోని అక్షరాలతో నటీమణుల పేర్లను కలుపుతూ సాగే పాట వినూత్నంగా ఉంటుంది . మాయదారి తేనెటీగ మాపటేల కుట్టెనమ్మా బాగుంటుంది .
కలలో తెర తీయాలా , ముద్దులు కావలెనా , మల్లెపూలలో అంటూ సాగే డ్యూయెట్లు అన్నీ అందంగా , హాటుహాటుగా ఉంటాయి . సిరివెన్నెల , వెన్నెలకంటి , భువనచంద్ర వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర పాడారు . ముద్దులు కావలెనా అనే పాటను రాజేంద్రప్రసాదే పాడుకున్నాడు .
ఇంతకుముందు చూసినా , చూడకపోయినా మళ్ళా చూడొచ్చు . మధ్య మధ్యలో రొమాన్స్ రిపీటెడ్ గా అనిపిస్తుంది . అయినా ఓకే . రాజేంద్రప్రసాద్ , బ్రహ్మానందం , చక్రవర్తి మళ్ళా గుంజుకెళతారు . చూడబులే . ముఖ్యంగా రసిక రాజులు , రాణులు అసలు మిస్ కాకూడని సందేశాత్మక చిత్రం .
Share this Article