Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హమారా హైదరాబాద్… దీని తెహజీబ్ నిత్యాంతర్వాహిని…!

December 28, 2025 by M S R

.

Gottimukkala Kamalakar …… నాలుగొందల ఇరువై తొమ్మిదేండ్ల కింద నా హైద్రాబాదుకు బునియాది రాయి పాతిన తురుక రాజుకు నా వాలేకుమ్ అస్సలామ్…!

రాజ్యం కోసం పని చేశిన అక్కన్న మాదన్నలను నెత్తిన వెట్టుకోని, సక్కగ జూసుకోని, ట్రెజరీ పైసలను ఇష్టమొచ్చినట్టు పుక్యానికి వాడినోడు ఆల్ల మేనల్లుడైనా సరే, లోపట నూకి రాజంటె ఏందో సూపిచ్చిన తానీషాకు తారీఫులు..!

Ads

ఒక ఒడ్లగింజ పండాలెనంటెనే శానా మంది చెయ్యిపడాలె..! పొలం దున్నెటోడు, యూరియ సల్లెటోడు, నీల్లు గట్టెటోడు, గట్టు గట్టెటోడు, తుకం సల్లెటోడు, వడిశె తిప్పెటోడు, అప్పిచ్చే సావుకారి, కోత కోశి కుప్ప నూర్పే కూలోడు, ఎండవెట్టెటోడు, బండి గట్టెటోడు, గిర్ని పట్టెటోడు…. గీ లెక్కంత తేలేలోపట్నే, మెతుకు కడుపులకు పోతది.

మరింత పెద్ద పట్నం తయారు గావలెనంటె ఎంతమంది చెయ్యి పడాలె..? ఎంత మంది పానం బెట్టాలె..?
ఇంత పెద్ద పట్నం ఎంతమందికి బువ్వ పెడుతుంది..?
చార్మినార్ తోటి ప్రయోజనం ఏముందండీ..? అని ఓ సత్యన్నారాయణ మూర్తి గారు అడిగిండు. “ఓ సున్నపురాతి కట్టడం అంతేగా..?” అంటూ ఓ కిళ్లీ పెదవి విరిచిండు గూడా.

పెండ్లం కోసం కట్టిన బొందలగడ్డ తాజ్ మహలో, ధ్వంసం చేసిన గుళ్ల మట్టితో కట్టిన కుతుబ్ మినారో, క్విడ్ ప్రో కో పథకం కింద తయారైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనో, ఈఫిల్ టవరో కాదిది, ఇదో తెహజీబ్ అని ఎట్ల చెబితే ఆయినకు తెలుస్తది..?

****
గుజరాతు పటేలు టింబర్లు..
రాజస్థాను కూలోల్ల గ్రానైట్లు..
షాలిబండ అబ్దుల్ గాని కడక్ చాయ్..
సింధీ కరాచీ బేకరీ బిస్కోట్లు..
వెల్లంకి రాజు గారి, కర్నూలు రెడ్డి గారి, రాజస్థాన్ జైన్ గారి మిఠాయిలు,
నెల్లూరు రెడ్డి గారి, భీమ్వరం రాజుగారి బువ్వ,
రాయలసీమోల్ల రాగిసంకటీ, శనిగె తొక్కు,

తుర్క పఠాన్ దమ్ బిర్యానీ,
చిక్కడపల్లి, నల్లకుంట బాపనోల్లు,
మాదాపూర్ల సిక్కోలు కూలీ,
ఓఆరార్ మీద బువ్వపెట్టినోల్లు, తిన్నోల్లు, సంపాయిచ్చుకున్నోల్లు, పోగొట్టుకున్నోల్లు…
అంకాపూర్ చికెన్ దుకునంల పనిచేశే అనకాపల్లి పోరగాడు..
అందర్ని అమ్మ లెక్క కడుపుల పెట్టుకుంటది మన హైదరాబాద్..!

****
పాలిటిక్సు చేశెటోల్లు మస్తు మాట్లాడుతరు.
ఒకరు నేనే కట్టిన అంటడు. ఇంకొకరు విశ్వనగరం చేస్తనని ఆయినది కాని భాషల చెప్తడు.
సంటిపోరల ఎచ్చుల మాటలిని అమ్మ నవ్వినట్టు ఈ పట్నం నవ్వుతది…!

కరోనా టయంల వాన దంచికొడ్తుంటె గుడ్క జనాలు ట్రాఫిక్ జామ్ ఐందాంక బైట తిరుగుతనే ఉంటరు.
ఈ పట్నం యిలువ పెద్దమనుసులకు అందరికి తెలుసు. దీక్షలు యాడ జేశినా, నవనిర్మాణాలు మాత్రం ఈడనే జేస్తరు.

చెరువులు కబ్జ పెడతరు. పార్కులు నాశనం చేస్తరు. గోల్మాల్ మాల్ కట్టి బండ్ల పార్కింగ్ కోసం ఆరంతస్తుల బొక్క తవ్వి, నీల్లు రాకుట్ట సిమిటి గోడలు కడ్తరు. మల్ల నీల్లను శేరుకు ఇరవై రూపాయలిచ్చి కొనుక్క తాగుతరు. పట్నం ఏడ్వలేక నవ్వుతది…!

****
ఒక పిల్ల పద్ధతిగ బట్టలు కట్టుక పోతుంటె, యిగురం తప్పిన దున్నపోతులు నాలుగు ఆగంజేశి తలగబెడతయ్. ఆటెన్క కొత్వాల్ చేతుల అయి తలగబడతయ్. పట్నం ఆ ఐదుగురి అమ్మనాయినల కోసం ఏడుస్తది…!

ఇంకో పొడుగు పిల్ల పొట్టి బట్టలేస్కోని పబ్బుకు పొయ్యి బిర్రుగ తాగి డాన్సులాడుతది. ఇంకో తాగినోడు తాకితె లొల్లి జేశి కేసుపెడతది. నక్లీసు రోడ్ల ఓంబత్తీల జులూజ్ తీస్తరు. ఫేసుబుక్కులల్ల సంఘసేవకుల తిట్ల ఒర్లుడు లైవ్ ఒస్తది. తీట గొర్లు లైకులు కొడ్తయి. ఈల్లందరి దమాఖులల్ల ఉన్న గబ్బు ముందల నా గబ్బు పచ్చకర్పూరం లెక్క అని ట్యాంకుబండు హుస్సేన్ సాగర్ అనుకుంటది. ఈల్ల ఖ్వాయిష్ పాడుగానూ అనుకుంట బుద్ధుడు కండ్లు మూస్కుంటడు…!

మెట్రోల ఓ నిలవడ్డ పోరడు ఓ స్పాటిఫై పాటలింటున్న పోరికి స్పాట్ పెట్టనీకె స్పాట్ ల లైనేస్తుంటడు…!
ఇంకో కూసున్న పోరడు లేశి నిలబడి ముసలాయినకు సీటిస్తడు…!
సెన్సేషన్ టాకీసు కాడ ఓ అంతర్వేది అప్పల్నాయుడు వోమ కలిపిన మిర్పకాయ బజ్జీలేస్తుంటడు. ఆడ సైకిల్ మీద సమోసాలు అమ్ముకునే యూసఫ్ షరీఫ్ ఓ ప్లేట్ బజ్జీలు కొనుక్క తింటుంటడు…!

ఓ బీదర్ కెంచి బత్కనీక ఒచ్చిన పోరడు కేతిర్ల చాయ్, పేపర్ గిలాసలు పట్కోని తిరుక్కుంట అమ్ముతుంటడు.
కార్పోరేట్ దావఖానల పనిజేశే స్వీపర్ యాదమ్మ, ఆమె మొగని క్యాన్సర్ రోగానికి నీలోఫర్ సర్కార్ దావఖానల కీమోథెరపీ చేపిస్తుంటది.

ఓ కేరళ నాయర్ అరటికాయ చిప్సూ, ఓ బెంగుళూరు అయ్యంగారు అన్నిరకాల పఫ్సూ, ఓ అరవ చెట్టి చెట్టినాడు చికెనూ అమ్ముతుంటడు. ఆల్ల పిల్లలు కేయఫ్సీల, సబ్వేల, మెక్డీల, పిట్జాహట్ల, డామినోల ద్వారా పడమటి దునియాను పోషిస్తుంటరు. జీయెస్టీ పెంకీసలు దొరుకుతున్నయ్ కాబట్కె సర్కారు ఆల్లను వారకాంతాగృహతాత్కాలికదశమగ్రహం పొందే మర్యాదలను, సౌలతును అందిస్తది.

మల్లేషు పొద్దూకులు అడ్డమీద కూలిపని జేశి ఓ నూటాభై రూపాయలతోటి పావుశేరు మందు, పది రూపాయల మసాలపల్లీ కొనుక్కోని ఆని కిరాయి గుడిశెకు పోతడు. ఆని పెండ్లం రూపాయకు కిలో బియ్యం, ఇరువై రూపాయలకు పావుకిల టమాట, ఆరు రూపాయలకు ఓ గుడ్డు కొనుక్కొచ్చి బువ్వ ఒండుతది. ఇద్దరు కలర్ టీవీల జబర్దస్త్ చూసుకుంట మందేసుకుంట నవ్వుకుంట నవ్వుకుంట తింటరు. అటెన్క తెల్లారి కొడుకు కాన్వెంటు ఫీజెట్ల కట్టాలెనని ఫికరు చేస్తరు.

జూబ్లీ హిల్సుల సీన్మ హీరో రేపటికెంచి స్నానానికి బిస్లెరీ ఒద్దు. కిన్లే నీల్లు పెట్టిపియ్యుర్రి అని పనోల్లకు చెప్పి హాల్లకొచ్చి మేడే గురించి టీవీలోల్లకు ఇంటర్వ్యూ ఇస్తడు. ఇంకో పది రోజులల్ల ఆ సారు సీన్మ రిలీజు ఉందంట..
మూసీల మురికి పారుతుంటది.

“మా ఊరి మేనకా టాకీస్ ముందు పెసర పుణుగులేస్తారండీ.., అసలా రుచి భూప్రపంచంలో ఎక్కడా దొరకదు..” అంటూ ఒహడు పాయారోటీ తింటూ హఠాత్తుగా ఏడుపొచ్చేసి ఆన్లైన్ లో సొంతూరికి తత్కాల్ బుక్ చేసుకుందామని తాత్కాలికంగా అనుకుంటాడు.
అందరినీ హైదరాబాద్ చూస్తూ ఉంటుంది.
దాని తెహజీబ్ నిత్యాంతర్వాహిని..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమారా హైదరాబాద్… దీని తెహజీబ్ నిత్యాంతర్వాహిని…!
  • రాబందు’వులొస్తున్నారు జాగర్త…! కానీ ఇప్పుడలాంటి సీన్లు లేవు…!!
  • ఎవరు తప్పుదోవ పట్టించారో గానీ… రేవంత్ రెడ్డి దిద్దుకోవాల్సిన పాలసీ…
  • పాత కేసుల్ని కెలుకుతున్న బండి సంజయ్…! కేటీఆర్‌పై డ్రగ్స్ దాడి..!!
  • జలద్రోహి ఎవరు..?! కవిత చెప్పిన చేదు నిజాల్ని అసెంబ్లీలో వినిపిస్తే సరి..!!
  • సమస్య బట్టలు కాదు… అది మూక ఉన్మాదం… మగాళ్లనూ వదలరు…
  • మేల్ శ్రీముఖి..! ఆ హాలీవుడ్ చెత్తతో మన పురాణాలకూ పోలికేమిటి.,.!!
  • దాదాపు ఏడాదిపాటు ప్రతిరోజూ వీఐపీ లాంజులో ఫ్రీ మందు, ఫ్రీ విందు…!!
  • తేడా వస్తే… ఆదుకునేవాడు ఉండడు … ఆడుకునేవాళ్లు తప్ప…
  • రాముడి అయోధ్యలో ఓ కొరియన్ రాణి విగ్రహావిష్కరణ..! ఏమిటీ ఆమె కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions