.
కేసీయార్ వార్తను నమస్తే తెలంగాణ గానీ, టీ న్యూస్ గానీ హైడ్ చేయగలదా..? చేస్తే ఎడిటర్ల కొలువులు ఉంటాయా..? సేమ్, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎట్సెట్రా చంద్రబాబు ప్రసంగాల్ని ప్రసారం చేయకుండా, పబ్లిష్ చేయకుండా ఉండగలవా..?
సేమ్, సన్ నెట్‌వర్క్- డీఎంకే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన- సామ్నా, రిపబ్లిక్ టీవీ- మోదీ… చెబుతూ పోతే బోలెడు… సేమ్, సాక్షి జగన్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి, ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలు దాచిపెట్టేయగలదా..? గలదు… గలదనే సాక్షి నిరూపించింది… అద్భుతమైన పాత్రికేయ ప్రమాణాలతో కాదు…
Ads
జగన్ ఏదో ఫ్లోలో తన మనసులోని మాటల్ని చెప్పేయడంతో…. అవి పార్టీకి డ్యామేజింగ్ అనే స్పృహ లేటుగా వెలిగి… దాచేసింది..! చివరకు తన సొంత మైక్ కూడా భయపడే రేంజ్ వ్యాఖ్యలు దేనిపైన..? నిజమేనా..? నిజమే కాబట్టే వెంటనే మాజీ ఆల్ పోర్ట్‌ఫోలియోల మినిస్టర్, ప్రస్తుత పార్టీ అన్ని విభాగాల హెడ్ సజ్జల రామకృష్ణారెడ్డి అర్జెంటుగా అధినేత వ్యాఖ్యలకు భిన్నంగా మాట్లాడాల్సి వచ్చింది… ఒకరకంగా జగన్‌ను తన గొంతులే తప్పుపట్టడం..!
ఇదంతా అమరావతి రాజధాని మీద..! తనేమన్నాడంటే..? ‘రివర్ బేసిన్‌లో రాజధాని ఏమిటి..?’ ఎందుకు..? కేంద్ర ప్రభుత్వం త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించబోతున్న నేపథ్యంలో..! తనకు ఇష్టం లేదు కాబట్టి… అందుకే మూడు రాజధానుల పేరిట కొత్త విధానం ప్రకటించాడు కాబట్టి… విశాఖలో రాజధానిని ఏర్పాటు చేసి, అక్కడే ఉండేందుకు ఓ రాజమహల్ కూడా కట్టుకున్నాడు కాబట్టి…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకు భాషలో చెప్పాలంటే… ‘‘2029లో జగన్ రెడ్డికి మళ్లీ అధికారం దక్కే పరిస్థితి కల్పిస్తే, అమరావతికి ఆయువు మూడుతుంది… శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ పార్లమెంటులో చట్టం చేసినా సరే, జగన్ రెడ్డి అంటూ అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేస్తాడు… అమరావతి ఉసురు తీయడానికి ఆయన మళ్లీ సిద్ధపడతారు… ఇందులో సందేహం లేదు…’’
నిజమే… జగన్ దృష్టిలో అది ఓ కులరాజధాని… తనకు అది పడదు… అంతెందుకు..? రుషికొండ ప్యాలెస్‌ను చంద్రబాబు ఎవరికి అప్పగించినా సరే, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఒకే నెలలో తను లాక్కుంటాడు… మరి అమరావతి మీద తన వ్యాఖ్యల్ని తన పత్రికే ఎందుకు దాచిపెట్టింది… సజ్జల జగన్ వ్యక్తపరిచిన వ్యాఖ్యలకు భిన్నంగా ఎందుకు మాట్లాడాడు..?

మళ్లీ కొత్త పలుకు భాషలో చెప్పాలంటే..? ’’రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి నోటి వెంట వెలువడిన విష గుళికలు ఆయన సొంత మీడియాలో ఎక్కడా కనిపించలేదు… వింతల్లోకెల్లా వింత ఇది… జగన్ ఏమి మాట్లాడినా ఆయన షిక్కటి షిరునవ్వులు చిందించే ఫొటో పెట్టి తాటికాయంత అక్షరాలతో ప్రచురించే, ప్రసారం చేసే నీలి మీడియా, కూలి మీడియా కూడా మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉంది…
అంటే, అమరావతిపై జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారికే రోతగా అనిపించాయా? జగన్ రెడ్డి తొందరపడి నోరు జారారని భావించారా? లేక ఆయన వ్యాఖ్యల వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని భావించారా? ఇంతకు మించిన నిగూఢ రహస్యం ఏమైనా ఉందా? మొత్తం మీద జగన్ రెడ్డి అమరావతి మీద కక్కిన విషాన్ని కప్పి పెట్టాలని చూశారు…
రాజకీయంగా నష్టం జరుగుతుందని పార్టీ నాయకులు ఆయన మాటలకు ప్రచారం కల్పించకుండా నీలి, కూలి మీడియాను కట్డడి చేసి ఉంటే చేసివుండొచ్చు… సో, జగన్ రెడ్డి ఆంతర్యం బయటపడింది కనుక అమరావతి ఆయువు అర్ధంతరంగా ముగియకూడదంటే… కూటమి ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉంది… ఇక జగన్ కూడా ఏమీ చేయలేనంత వేగంగా అమరావతి రాజధాని పనులు సాగాల్సిందే’’

మరి కొత్త పలుకులోకి కేసీయార్ ఎందుకొచ్చాడు అంటారా..? ‘నేనెక్కడ ఉంటే అదే సచివాలయం అనేవాడు కేసీయార్, ఓ గడీ కట్టుకుని దాన్నే సచివాలయంగా మార్చుకున్నాడు… సేమ్, జగన్… ఇద్దరూ సేమ్ కదా… నేనెక్కడుంటే అదే రాజధాని అనుకునేవాడు జగన్… తను కూడా ఓ గడీ ప్యాలెస్ కట్టుకున్నాడు… తను వైజాగులో ఉంటే అదే రాజధాని అనుకున్నాడు కాబట్టి… ఇద్దరూ ఇద్దరే కాబట్టి..!!
చివరగా... రాధాకృష్ణ తొందరపడుతున్నాడు గానీ... వేల ఎకరాలు ఇంకా ఇంకా సమీకరించి, తాపీగా భవన నిర్మాణాలు, భూపంపిణీ యవ్వారాలు చేస్తాడు తప్ప చంద్రబాబు ఆంధ్రజ్యోతి చెప్పిందని తొందరపడడు... అదేమీ అబ్రకదబ్ర అనగానే కళ్లెదుట ప్రత్యక్షమయ్యే పాతాళభైరవి మాయల మార్క్ రాజధాని కాదు... కేవలం భవనాల నిర్మాణాలతో ఓ నగరం నిర్మితం కాదు కాబట్టి..!! వేల ఎకరాల్లో రైల్వే స్టేషన్, వేల ఎకరాల్లో వరల్డ్ క్లాస్ ఎయిర్ పోర్టు గట్రా ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టేందుకు చంద్రబాబుకు కాస్త టైమివ్వవయ్యా రాధాకృష్ణా..!!
Share this Article