రెగ్యులర్, రొటీన్ సినిమా రివ్యూ ఫార్మాట్ కాదు… దీన్ని కొత్తగా చూడాలి… కొత్తగా రాసుకోవాలి… అసలు ఇది సినిమా కాదు… రొటీన్ కమర్షియల్ సినిమా లక్షణాలు కూడా లేవు… ఉండకూడదు… ఓటీటీల్లో వచ్చే వెబ్ సీరీసుల్లో మితిమీరిన హింస, వల్గర్ గట్రా ఉండవచ్చుగాక… కానీ ఇన్నాళ్లూ రొటీన్ సినిమాల్లోని అనేక పైత్యాల నుంచి ప్రేక్షకుల్ని అవి దూరం తీసుకుపోతున్నయ్… క్రియేటివిటీకి పదును పెడుతున్నయ్… కొత్త కథల్ని, కొత్త కథనాల్ని, కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నయ్… లేకపోతే మామూలు సినిమా పైత్యాన్ని రెండు గంటలపాటు భరించడమే కష్టమైపోతున్నవేళ… చాలామంది ప్రేక్షకుల్నిఏకబిగిన తొమ్మిది ఎపిసోడ్లను చూసేస్తున్నారు… అదే ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సీరీస్… అదెలా సాధ్యమైంది..? దీనికి జవాబు సింపుల్… కథలో దమ్ము, కథనంలో పట్టు, ప్రజెంటేషన్‌లో కొత్తదనం… వీటికితోడు హై టెక్నికల్ వాల్యూస్… అన్నింటికీ మించి తులమెత్తు ఎక్కువ గాకుండా, తక్కువ గాకుండా పాత్రల్ని ఓన్ చేసుకునే నటీనటులు… అదీ కారణం…
మన తెలుగువాళ్లే… డీకే, రాజ్… ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సీరిస్‌ను రక్తికట్టించారు… టాప్ రేటెడ్ ఇండియన్ వెబ్ సీరీసుల్లో అదీ ఒకటి… సెకండ్ పార్ట్ అనేసరికి కొన్ని వివాదాలు… ప్రత్యేకించి ప్రత్యేక తమిళదేశం (ఈలం) కోసం జరిగిన టైగర్ల పోరాటాన్ని తప్పుడు పంథాలో ప్రజెంట్ చేశారని, మరీ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు చిత్రీకరించారని ఓ విమర్శ… ఏకంగా ఈ సినిమాను నిషేధించాలని డీఎంకే ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది… తమిళులు ఏది చేసినా ‘అతి’ సహజం కదా… సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు… అదింకా ముదరకముందే హిందీలో దాని స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేశాడు అమెజాన్ ప్రైమ్ వాడు… మరి మిగతా భాషల్లో..? తెలియదు…! నిజానికి ఈ సీరీసులో టైగర్ల పోరాటాన్ని కించపరిచే అంశాలేమీ లేవు… అలాగే ఐఎస్ఐ, ఎల్టీటీఈ సంబంధాల మీద బొచ్చెడు వార్తలొచ్చాయ్… దర్శకులు, కథా రచయిత అధ్యయనం లేకుండా ఈ కథ రాయలేదు… ఈ వివాదం పొడిగింపూ అనవసరం… నిజానికి కథారచయిత అధ్యయనం ఎంత లోతుకు వెళ్లిందంటే… శ్రీలంక రాజకీయాల్లో ఇండియా జోక్యానికి కారణం కేవలం తమిళ మూలాలే కాదు… హిందూ మహాసముద్రంపై పట్టుకు చైనా వేసే ఎత్తుగడలు, దాని చుట్టూ ఉన్న ప్రపంచ రాజకీయాలు… భేష్… ఓ కథారచయితకు ఉండాల్సిన క్లారిటీ, అవగాహన ఇదీ…
Ads
సీక్రెట్ ఆపరేషన్లలో పాల్గొనే ఓ హీరో… మరీ మన సినిమాల్లో చూపించే సూపర్ మ్యాన్ కాదు… ఆ ఫైట్లు, ఆ డాన్సులు గట్రా ఏమీ ఉండవ్… మనలో మనిషి… కాకపోతే బుర్ర వాడతాడు… ఆపరేషన్‌ను ప్రొఫెషనల్‌గా డీల్ చేస్తాడు… తనకూ ఓ ఫ్యామిలీ, కొన్ని పొరపొచ్చాలు కామన్… భార్య పాత్రలో ప్రియమణి… మూణ్నాలుగు ఎపిసోడ్ల దాకా కథ సోసో… ఎప్పుడైతే సమంత ఎంట్రీ ఉంటుందో అప్పట్నుంచీ కథలో వేగం, జోరు… ఓ మహిళా టైగర్ పాత్ర… సూసైడ్ బ్యాచ్… ప్రధానిని హతమార్చడానికి ఏ ప్లాన్ వేస్తారు, చివరకు ఏం జరుగుతుంది అనేది కథ… అక్కడక్కడా లూప్ హోల్స్ ఉన్నా కథనంలోని గ్రిప్‌తో తెలివిగా కవర్ చేసేశారు దర్శకులు… కథలో ప్రేక్షకుడిని లీనం చేస్తారు… అందుకే ఏకబిగిన కొందరు మొత్తం ఎపిసోడ్లు చూసేస్తున్నారు… అంటే, కథను నడిపిన తీరును మెచ్చుకోవాల్సిందే కదా…
మనోజ్ వాజపేయి నటన గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు… నాగ చైతన్యతో పెళ్లయ్యాక సమంత ప్రతి కమర్షియల్ పాత్రనూ ఒప్పుకోవడం లేదు… సెలెక్టివ్‌గా ఉంటోంది… ప్రత్యేకించి తనలోని నటిని ఎక్స్పోజ్ చేయగల పాత్రల మీద మక్కువ పెంచుకుంటోంది… మంచి పాత్ర దొరికితే జీవించగల ప్రతిభ ఉంది ఆమెకు… కానీ పెళ్లయ్యేదాకా రొటీన్, ఫార్ములా హీరోయిన్ మాత్రమే ఆమె… ఈ ఫ్యామిలీ మ్యాన్ ఆమెను నటిగా నాలుగైదు మెట్లను ఒకేసారి ఎక్కించినట్టే… బాగా చేసింది… తెలుగు, తమిళ ప్రేక్షకులకు సమంత తెలిసిందే, ఇప్పుడు హిందీ ప్రేక్షకులకూ సమంత ఓ రేంజ్లో పరిచయం అయ్యింది… ఈ సీరీస్ షో ఆమెదే… గుడ్… అన్నట్టు… వివాదాస్పద అంశాలను కూడా టచ్ చేస్తూ, కథలో ఇరికిస్తూ, సీరీస్ నడిపించడం అలవాటైన ఈ దర్శక ద్వయం మూడో పార్ట్‌లో ఏం చేయబోతోంది తెలుసా..? ఏకంగా కరోనా వైరస్- చైనాలో పుట్టుక అనే మరింత కాంట్రవర్సీ సబ్జెక్టును ఎన్నుకున్నది… ఆల్ ది బెస్ట్ బ్రోస్…!! కానీ ఒక్క విషయం… ఇంగ్లిషు వెర్షన్, వీలయితే మాండరిన్ (చైనా భాష) వెర్షన్ కూడా విడుదల చేయండి… ఇంకా వీలయితే గబ్బిలాల గుహల్లోకి వెళ్లి కరోనా వైరస్ పుట్టుక గురించి అన్వేషించే సైంటిస్టు పాత్రలోకి ఈ సమంతనే తీసుకొండి…!!
Share this Article