Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వెలుగుమట్ల విధ్వంసం వెనుక చీకటి కథలెన్నో… చెప్పుకోవల్సిందే…

March 8, 2026 by M S R

.

Gurram Seetaramulu … పేదల పక్షాన పిట్ట నిల్చున్నా… రెక్కలు విరిచే పెద్దల రాజ్యం
వెలుగుమట్ల కూల్చివేత వెనక కనిపించని రాబందుల కథ
“పేదల పక్షాన పిట్ట నిల్చున్నా సరే, పెద్దలు దాని రెక్కలు విరిచి రక్తం తాగక మానరు” అనేవాడు మా చాట్రిబాబు అంటే రావి శాస్త్రి. ఒక్కోసారి ఈ రెక్కలు విరిచేవాడు పాలకుడు, పోలీసే కాదు — నువ్వు నమ్మిన మనిషి కూడా కావొచ్చు.

ఖమ్మం సాగర్ కాలవ నుంచి లకారం చెరువు దాకా ఒక రెండు, మూడు కిలోమీటర్ల మేరకు ఒక ముప్పై–నలభై అడుగుల వెడల్పు పంట కాలువ ఉండేది. ఒకప్పుడు అది వేలాది ఎకరాలకు సాగు నీరు, తాగునీరు ఇచ్చింది. ఇప్పుడు ఆ భూమి గజం యాభై వేల నుంచి లక్ష దాకా ఉంది. రియల్ ఎస్టేట్ మాఫియా ఆ కాలవను పూడ్చేసి అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకుంది. అందులో ఎర్ర కాకులు, విప్లవ గద్దలు కూడా ఉన్నాయి. కొన్ని ఎలిసిన ఎర్రజెండాలు ఆ కాలువ అటూ ఇటూ గుడిసెలు వేయించాయి.

Ads

సంపన్న నగరం నడిబొడ్డున రాచపుండులా కొందరు జనాలు గుడిసెలు వేసుకున్నారు — “వేయించారు” అంటే బాగుంటుంది. నాలుగు కర్రలు పాతి, చుట్టూ టార్పాలిన్ కట్టుకున్న వందలాది మందిలో నాకు తెలిసినవాళ్లు కూడా ఉన్నారు.

ఖమ్మం జిల్లా ఐశ్వర్యం కన్నెర్ర చేసింది. ఖరీదైన ఇళ్ల మధ్య దొంగలు, ఖూనీకోరులు, ఎర్రజెండా తగ్స్ వేసుకున్న గుడిసెలు పరమ అసహ్యంగా ఉన్నాయని చెప్పి, ఆ గుడిసెలను ఊరి చివర కొండ మీదికి బట్వాడా చేశారు. ఆ వేసిన గుడిసెల దగ్గర పక్కనే ఈ వెలుగుమట్ల వినోబానగర్ కూడా ఉంది.

వెలుగుమట్లలో ఉన్న భూమి మొత్తం 31 ఎకరాలు. ఆ భూముల్లో ఉన్న పిట్టల కథ బయటి ప్రపంచానికి అసలే తెలియదు. ఈ కథ జరిగి పదేళ్లు అయ్యింది. కొందరికి కరెంట్ మీటర్లు కూడా ఉన్నాయి. అందరూ రేకులతో కట్టుకున్న తాత్కాలిక ఆవాసాలే. మరొకాయన ఏకంగా 18 లక్షలతో ఇల్లు కట్టుకున్నాడు. ఎటువంటి భూ ఆధారం లేకుండా, తనది కాని స్థలంలో ఆయన ఏ ధైర్యంతో కట్టాడో మరి!

అయినా ముందస్తు హెచ్చరిక లేకుండా, సరైన విచారణ లేకుండా కలెక్టర్ చేసిన చర్య అవివేకం — నీతి బాహ్యమైనది, అమానవీయమైనది.

అక్కడ వాలిన పిట్టలు ఇక్కడికి వచ్చి వాలాయి. ఏ మహిమో కానీ వెలుగుమట్ల చుట్టుపక్కల ఖమ్మం జిల్లా ఐశ్వర్యం “కే క్యాంప్” మరింత సంపన్నమైంది. అలాంటి పేదలు కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో కొంపలు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఖరీదైన భూమిలో వాలిన పిట్టల రెక్కలు విరిచి, మళ్లీ కట్టుకున్న రేకుల గుడిసెలను కూల్చేశారు.

ఆ కూల్చివేత వెనక మాజీ మంత్రి, తాజా ఇద్దరు మంత్రులు ఉన్నారు అనేది దాచేస్తే దాగని సత్యం. ఒక మాజీ, ఇద్దరు తాజా మంత్రుల మధ్య కలెక్టర్ శాండ్‌విచ్ అయ్యాడు. ఆ ఘటనకు సంబంధం లేని మరొక మంత్రిని కూడా ఇందులో కలిపారు.

ఇప్పుడు అర్జెంట్‌గా ముప్పై ఎకరాలు కాపాడి దేశానికి ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు?
అయినా మీకు కొన్ని నిజాలు చెప్పాలి. అక్కడ ఉన్న కుటుంబాల్లో నిజమైన పేదలు పది శాతం మాత్రమే. వాళ్లే అర్హులు.
మిగతావాళ్లు — కృష్ణా, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, భూపాలపల్లి, మహబూబాబాద్… ఇన్ని జిల్లాల నుంచి బీద పిట్టలను ఒక దగ్గరకు చెరదీసిన రాబందులకు నా వందనాలు.

అయినా కొన్ని నిజాలు చెప్పాలి:
అక్కడ ఒక్కో ఇళ్ల స్థలం ఇద్దరు, ముగ్గురు పేర్ల మీద ఉంది. ఆ స్థలం అమ్మిన పాపం ఆ ఎర్రజెండా వాళ్లది. భూదాన్ ట్రస్ట్‌లో ఉన్న రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి. (ఇతన్ని బొక్కలో వేసి తంతే అసలు కథ బయటకి వస్తుంది.)
అందులో ఎంతో మంది పోలీసు, రెవెన్యూ, టీచర్లు కూడా ఉన్నారు. పది ఎకరాల భూమి ఉన్నవాళ్లకు కూడా గుడిసెలు ఉన్నాయి. మా ఊరి వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు నిరుపేదలు కాదు.

ఒక పార్టీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను వెలుగుమట్లకు రప్పించింది. ఒక్కొక్కరి దగ్గర 10 వేల నుంచి పది లక్షల దాకా వసూలు చేశారు. చేసిన వాళ్ల మీద ఇప్పటికే ఎన్నో కేసులు నమోదయ్యాయి. వసూలైన సొమ్ము ఇరవై నుంచి ముప్పై కోట్లు. (అందులో సొమ్ముతోనే యూట్యూబ్ పాత్రికేయులు నోరు చేసుకుంటున్నారు.)

నిజమైన లబ్ధిదారులు మాత్రం కొద్దిమందే.
ఖమ్మం పక్కనే అల్లీపురం అనే గ్రామం ఉంది. యాభై– అరవై ఏళ్లుగా మాదిగలు సాగు చేసుకుంటున్న ఇరవై ఎకరాల భూమి బలవంతంగా గుంజుకుని తిరుపతి గుడి కడుతున్నారు. మంత్రి తుమ్మల. అవి ఇందిరా గాంధీ ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములు. వాటిని గుంజుకుని గుడి కట్టి ఆ దళితులను పాప విముక్తం చేసే పనిలో ఉన్నాడు. ఈ భూమి అత్యంత నిరుపేదలది. ఖమ్మం పక్కనే పుట్టడం వాళ్లు చేసిన నేరం.

వీళ్ల గురించి ఒక్క ప్రకటన రాదు. ఒక్క యూట్యూబ్ కూడా మాట్లాడదు. శాశ్వత మూగవ్రతంలోకి వెళ్లాయి.
ఈ దేశంలో బడా సంపన్నవేత్తల దగ్గర ఉన్న లక్షల ఎకరాల్లో వేలాది ఎకరాలు అక్రమ భూములే. వంద ఎకరాలు ఉంటే అందులో అసైన్డ్ భూమి లేకుండా ఉండడం అసాధ్యం.
అందుకే ముందే చెప్పాను —

పేదల పక్షాన పిట్ట నిల్చున్నా సరే, పెద్దలు దాని రెక్కలు విరిచి రక్తం తాగక మానరు.
అది వెలుగుమట్లతో మొదలు కాలేదు. అల్లీపురంతో అంతం కాదు.
అనేది దాచేస్తే దాగని సత్యం.
#వెలుగుమట్ల
#అల్లీపురంఅసైన్డ్ భూములు
#ఖమ్మం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సంస్కారం తప్పిన సాయి మాధవుడు… రైట్ రాయల్ వరలక్ష్మి వివరణ…
  • ప్లీజ్ నమ్మండయ్యా… నాకస్సలు సంబంధం లేదు… నాకేమీ తెలియదు…
  • ఈ వెలుగుమట్ల విధ్వంసం వెనుక చీకటి కథలెన్నో… చెప్పుకోవల్సిందే…
  • మమత నా చెల్లెలు- ఎందుకిలా చేసింది..? హర్టయిన రాష్ట్రపతి ముర్ము..!!
  • రై రై రా రా… పెద్ది శ్రీరామ్‌కు యుద్ధ విధ్వంసాభివందనాలు…
  • టాప్ వన్ బౌలర్ అండ్ టాప్ వన్ బ్యాటర్… తీసేస్తారా, ఉంచేస్తారా…
  • శృతి మించిన శృంగారం… నారీ నారీ నడుమ ‘లైన్’ తప్పిన మురారి…
  • మౌనం ఓ రహస్య సమ్మతి… అది ద్రోహం, నేరం… అనగా మౌనమూ శిక్షార్హమే…
  • “హే గూగుల్… గతం మరవనివ్వవా..! కర్ణాటక హైకోర్టుకు శ్రీలంక సుప్రీం జడ్జి”
  • ఇరాన్ యుద్ధాన్ని ఎఐ శాసిస్తోంది… ఇది కృత్రిమ మెదళ్ల సమరం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions