.
“బతకడమే శిక్ష అయితే… చావు విముక్తి కాదాా? ఆ చావు హక్కు కాదా..? కోర్టును కదిలించిన కారుణ్య మరణం కథ… న్యాయమూర్తి ఈ తీర్పు చెప్పినప్పుడు ఎందుకు కదిలిపోయాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు..?
తీర్పు చెప్పే సమయంలో కోర్టు గదిలో కొన్ని క్షణాలు నిశ్శబ్దం నెలకొంది. చట్టం ముందు నిలిచింది ఒక కేసు కాదు… ఒక మనిషి బాధ. న్యాయమూర్తి కూడా మనిషే… అందుకే ఓ ఉద్వేగం… తీర్పు చెప్పే వేళ అందుకే న్యాయమూర్తి మాటలు కూడా కాస్త కంపించాయి… ఎందుకంటే ఫైళ్లలో ఉన్నది కేవలం మెడికల్ రిపోర్టులు కాదు… సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక కుటుంబం వేదన…
Ads
అన్నింటికీ మించి ఓ శరీరం ఈ లోకం విడిచివెళ్లిపోవడానికి పడే వేదన… మౌన రోదన… ఈ వ్యవస్థ చావనివ్వదు, విధి బతకనివ్వదు… ప్రేమించే తల్లిదండ్రులకూ బాధ, కన్నీళ్లు, కష్టాలు… నిజానికి గౌరవప్రద మరణం, అనాయాస మరణం, బాధల నుంచి విముక్తి ఇచ్చే మరణం ఓ హక్కు… అంతేకాదు, పద్ధతులతో అంత్యక్రియలు కూడా హక్కే…
“జీవితమంటే అంతులేని నొప్పి, భరించలేని బాధ మాత్రమే అయితే… దాన్ని కేవలం యంత్రాలతో పొడిగించడం ఎంతవరకు న్యాయం?” — ఇదే ప్రశ్న కోర్టులో మార్మోగింది…
ఆ కేసులో ఉన్న వ్యక్తి శరీరం ఇంకా పనిచేస్తోంది. కానీ జీవితం మాత్రం చాలా కాలం క్రితమే ఆగిపోయింది.
మాట్లాడలేడు… కదలలేడు… తన బాధను చెప్పుకోలేడు. అతడిని బతికిస్తోంది కేవలం యంత్రాలే.
రోజూ అతడిని చూస్తూ కుటుంబం కూడా ఒకే ప్రశ్నతో మాడిపోతోంది:
ఇది నిజంగా జీవితమేనా… లేక బతుకు అనే శిక్షా?
కోర్టు చెప్పిన మాట… గుండెల్ని తాకింది
13 ఏళ్లుగా… చావలేక, బతకలేక… జీవచ్ఛవంగా మంచంపై పడి ఉన్న హరీష్ రాణా అనే యువకుడికి కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీం నిన్న తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే కదా… ఆ తల్లిదండ్రులు ఆ చికిత్సకు ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులపాలయ్యారు… తమ బిడ్డను చంపేయండి ప్లీజ్ అని న్యాయస్థానాల చుట్టూ తిరిగారు… చివరకు ఈ చరిత్రాత్మక తీర్పు వెలువడింది… అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయడమే..!!
తీర్పు సందర్భంగా ధర్మాసనం ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. “ఇది మరణానికి అనుమతి ఇవ్వడం కాదు. కృత్రిమంగా పొడిగిస్తున్న జీవితాన్ని సహజంగా ముగియనివ్వడం మాత్రమే…” అంటే… చట్టం జీవితం విలువను కాపాడుతూనే, మానవత్వాన్ని కూడా మరచిపోలేదని సూచించింది.
ఇది కొత్త చర్చ కాదు
భారతదేశంలో కారుణ్య మరణం (Euthanasia)పై చర్చ చాలా కాలంగా సాగుతోంది. 2011లో Aruna Shanbaug Case దేశాన్ని కదిలించింది. ముంబైలో నర్సుగా పనిచేసిన అరుణ శాన్‌బాగ్‌పై జరిగిన దారుణ దాడి తర్వాత ఆమె అనేక సంవత్సరాలు కోమాలో ఉండిపోయింది.
ఆ కేసులో Supreme Court of India ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కొన్ని కఠిన నిబంధనలతో Passive Euthanasiaకి అనుమతి ఇచ్చింది. అంటే — రోగి పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా ఉంటే, జీవనాధార యంత్రాలను నిలిపివేయడానికి కోర్టు అనుమతి ఇవ్వొచ్చు.
కోర్టు ఓకే… కానీ వ్యవస్థ నో
అయితే ఇక్కడే సమస్య మొదలవుతోంది. ఒక సందర్భంలో కోర్టు కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చినా… ఆస్పత్రి మాత్రం ముందుకు రాలేదు. నైతిక కారణాలు… వైద్య భయాలు… చట్టపరమైన సందేహాలు… ‘‘వైద్యం బతికించడానికే తప్ప చంపడానికి కాదు’’ ఇదీ హాస్పిటల్ వాదన…
చివరికి ఆ మహిళ కోరుకున్న విముక్తి రాకముందే నిమోనియాతో మరణించింది. అంటే… కోర్టు తీర్పు ఉన్నా… గౌరవప్రదమైన ముగింపు, అంటే చట్టబద్ధమైన కారుణ్య మరణం మాత్రం దక్కలేదు…
చట్టం ఇంకా ఎందుకు రాలేదు..?
ఈ సమస్యను చూసి ఎన్నోసార్లు Supreme Court of India కేంద్రాన్ని అడిగింది. “ఈ అంశంపై స్పష్టమైన చట్టం తీసుకురండి” అని. కానీ ఇప్పటికీ దేశంలో పూర్తి స్థాయి చట్టం లేదు. కోర్టు మార్గదర్శకాలే ఆధారం. ఇదే పరిస్థితి వైద్యులను, కుటుంబాలను, ఆస్పత్రులను సందిగ్ధంలోకి నెడుతోంది. నిజానికి ఇలాంటి జీవచ్ఛవ కేసులెన్నో… కానీ జవాబు..?
చివరి ప్రశ్న… సమాజానికే
జీవితం విలువైనది. అందుకే దాన్ని కాపాడాలి.
కానీ అదే జీవితం ఒక మనిషికి… అంతులేని బాధగా మారితే?
అప్పుడు ప్రశ్న మారుతుంది. బతకడం హక్కు అయితే… బాధల నుంచి విముక్తి పొందడం కూడా హక్కేనా..?
ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా చట్టంలో రాలేదు. కానీ కోర్టుల్లో… ఆస్పత్రుల్లో… ముఖ్యంగా బాధపడుతున్న కుటుంబాల్లో మాత్రం ఈ చర్చ ప్రతిరోజూ జరుగుతూనే ఉంది…. మన ప్రభుత్వాలు ఎప్పుడూ దుర్మార్గమైనవే కదా, సున్నితమైన విషయాలు దానికి పట్టవు, పట్టలేదు… ఈరోజుకూ ఎన్నో కుటుంబాలు ఈ వ్యథను అనుభవిస్తూనే ఉన్నాయి… కారుణ్య మరణం దక్కక..!!
Share this Article