.
Bhavanarayana Thota …. తమిళనాడులో సినిమావాళ్ళ రాజకీయ పార్టీలు… తమిళనాడులో రాజకీయాలు, సినిమా కలిసిపోయాయన్నది అందరికీ తెలుసు. ముఖ్యంగా సినీ రచయితల డీఎంకేతో మొదలై ఆ తరువాత నటుడు ఎమ్జీఆర్ నుంచి స్ఫూర్తి పొందిన నటులు చాలామంది పార్టీలు పెట్టారు. తమిళనాడులో కొత్త పార్టీ పెట్టడం సులభం, కానీ దాన్ని నిలబెట్టడం చాలా కష్టం అనేది కాలం చెప్పిన నిజం.
నటుడు శివాజీ గణేశన్ మొదలుకొని విజయ్ దాకా పార్టీలు పెట్టిన చరిత్ర ఇప్పుడు నెమరువేసుకోవాల్సిన అవసరమొచ్చింది. వ్యక్తిగత ప్రతిష్ఠకు సంస్థాగత బలం తోడు లేనప్పుడు ఫలితాలు తాత్కాలికమని చరిత్ర చెబుతోంది. విజయ్ సొంతగా పోటీలో దిగితే మొత్తం 234 లో 6 నుంచి 12 సీట్లు వస్తాయని IANS MATRIZE సర్వే చెబుతోంది. సినీ నటుల పార్టీల చరిత్ర పునరావృతమవుతుందా? కొత్త అధ్యాయం మొదలవుతుందా? ఇంకో నెలలో జరిగే ఎన్నికల్లో తేలిపోతుంది.
Ads
*****
కాంగ్రెస్ ను అధికారం నుంచి కూలదోసిన ప్రాంతీయ పార్టీ డీఎంకే. అలా స్వతంత్ర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయిన అన్నాదురై రాజకీయాల్లోకి రాకముందు రంగస్థల నాటక రచయిత. అప్పట్లో ఆయన రాసిన వేలైక్కారి (పనిమనిషి) అనే నాటకం, ఒరే ఇరావు (ఒకే రాత్రి) అనే ఇంకో నాటకం ఆ తరువాత కాలంలో సినిమాలుగా మారాయి.
అలా ఆయన మాటలు , స్క్రీన్ ప్లే రచయితగా గుర్తింపు సంపాదించారు. ఎమ్జీఆర్ సినిమాలకు ఆయన డైలాగ్స్ బాగా పనికొచ్చాయి, పరోక్షంగా ద్రావిడ ఉద్యమానికి, డీఎంకేకి కూడా. 1967 లో డీఎంకే గెలవగానే ఆయన సీఎం అయ్యారు.
ఆయన శిష్యుడిగా సినీ రచనలు చేస్తూ పదునైన సంభాషణలతో ప్రజల్ని ఆకట్టుకున్నవాడు కరుణానిధి. పరాశక్తి, మనోహర లాంటి సినిమాలు ఆయనను సినీ జగత్తులో పెద్ద స్థానంలో కూర్చోబెట్టటమే కాదు.. వాటిలోని సామాజిక సందేశం డీఎంకే ఎదుగుదలకు దోహదపడింది. అందుకే సీఎం అన్నాదురై చనిపోయినప్పుడు మరో ఆలోచనకు తావులేకుండా కరుణానిధిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది ఆ పార్టీ.
తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశించిన ఎమ్జీఆర్ కు మాత్రం నిరాశే ఎదురైంది. పార్టీ కోశాధికారి పదవికే పరిమితం కావాల్సి వచ్చింది. పార్టీ నిధులు దుర్వినియోగమవుతున్నాయంటూ ఆరోపణలు మొదలుపెట్టటంతో కరుణానిధి ఇరుకునపడ్డారు. మంత్రిపదవి దక్కలేదనే ఇలా ఆరోపిస్తున్నారని ఎదురుదాడి చేసినా ఫలితం కనబడలేదు.
ఎమ్జీఆర్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇదే అదను కోసం ఎదురు చూసిన ఎమ్జీఆర్ రైలెక్కారు. ఆయన అభిమానులు ఎక్కడికక్కడ రైలును ఆపుతూ ఒక రోజుకు పైగా ఆలస్యంగా నడిచేట్టు చేసారంటేనే ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. దీంతో పార్టీ పెట్టి ఘన విజయం సాధించారు.
ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా నటి. ఎమ్జీఆర్ చనిపోయాక 23 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎమ్జీఆర్ తో కలిసి నటించిన జయలలిత రాజకీయాల్లో ఆయనకు శిష్యురాలిగా మారి పార్టీని ముందుకు నడిపించారు. ఎమ్జీఆర్ చనిపోయాక కొంతమంది జానకీ రామచంద్రన్ ను సమర్థించినా, ఆమె కూడా జయలలితకే పార్టీని అప్పజెప్పారు.
భారతదేశంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన తొలి సినిమా నటుడిగా ఎంజీ రామచంద్రన్ ది చరిత్ర. ఆయన నుంచి స్ఫూర్తి పొందిన ఎన్టీయార్ కూడా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాక తమిళనటుడు శివాజీ గణేశన్ సొంత పార్టీ ఆలోచన చేశారు. ద్రావిడ ఉద్యమంతో రాజకీయ ప్రవేశం చేసి డీఎంకేలో చేరినా, చాలాకాలం కాంగ్రెస్ లో ఉన్నా, చివరికి 1988 లో తమిళగ మున్నేట్ర కళగం – TMM పేరుతో పార్టీ పెట్టారు.
అప్పటికే పోటాపోటీగా సాగుతున్న రెండు ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలన్నది ఆయన ఆలోచన. కానీ, పార్టీ పెట్టిన ఏడాదికే (1989లో) జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క సీటు కూడా గెలవలేదు. శివాజీ గణేశన్ కి మాస్ ఇమేజ్ ఉన్నా రాజకీయ బలం లేకపోవడం, గ్రామీణ కార్యకర్తల బలం లేకపోవడం, ఎమ్జీఆర్ లాగా సంక్షేమ పథకాలందించిన వారసత్వం లేకపోవటం వల్ల ఓటమి తప్పలేదు. కొద్ది కాలానికే పార్టీ కనుమరుగైంది.
డీఎంకేలో ప్రచార కార్యదర్శిగా ఉన్న రోజుల్లోనే బహిష్కరణకు గురైన ఇంకో నాయకుడు టి. రాజేందర్. తెలుగులోకి డబ్ అయిన ప్రేమసాగరం వంటి సూపర్ హిట్ తమిళ సినిమా దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడిగా 1980 ల నాటి సినీ ప్రేమికులకు ఆయన పరిచయస్తుడే. ఈ తరానికి ఆయన ‘శింబూ తండ్రి’ అంటే అర్థమవుతుంది. ఆయన డీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యాక 1991లో తాయగ మరుమలర్చి కళగం- TMK పేరుతో పార్టీ పెట్టి తాను, తన భార్య అయిన మాజీ నటి, తన బావమరిది కీలకపదవులు చేపట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు.
మళ్ళీ డీఎంకేలోనే చేరినా, 2004 లో ఇంకోసారి బైటికి వచ్చి పార్టీ పెట్టారు. ఆలిండియా లచ్చియ ద్రావిడ మున్నేట్ర కళగం – AILDMK అనే ఆ పార్టీ అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోగా ఆ పార్టీ ఓడింది. తరువాత ఆయన క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా కాలం గడుపుతున్నారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన నటుడు, దర్శకుడు, రచయిత భాగ్యరాజ్ కూడా రాజకీయ పార్టీ పెట్టినవారే. ఒక సందర్భంలో ఎమ్జీఆర్ తన నటనా వారసుడంటూ భాగ్యరాజ్ పేరు చెప్పటంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. అందుకే ఎమ్జీఆర్ చనిపోయిన కొద్ది నెలలకే 1989 లో ‘ఎంజీఆర్ మక్కళ్ మున్నేట్ర కళగం’ – MMMK పేరుతో పార్టీ పెట్టారు.
కానీ అది ముందుకు సాగలేదు. ఆ తరువాత కొన్నాళ్ళు అన్నా డీఎంకేలోనూ, ఇంకొన్నాళ్ళు డీఎంకేలోనూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీజేపీ వైపు మొగ్గు చూపి అక్కడక్కడా బీజేఎపీ సభల్లో కనబడుతున్నారు.
నిజానికి జయలలితతో కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ 1996 లో కాంగ్రెస్ నుంచి మూపనార్ వర్గం బైటికి రాబోయే ముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరిగింది. తమిళనాడు కాంగ్రెస్ నాయకులు ఆయనను పీవీ నరసింహారావు దగ్గరకు తీసుకువెళ్లారు. కానీ కలిసిన తరువాత ఆయన పార్టీలో చేరబోవటం లేదని ప్రకటించారు.
ఆ తరువాత కూడా కొన్నిసార్లు ఇదిగో అదుగో.. అని చెబుతూ వచ్చినా.. ఒక దశలో అనారోగ్యం పేరుతో పార్టీ పేరు కూడా ప్రకటించకుండానే వెనక్కు తగ్గి అభిమానులను నిరాశపరచారు. ఇపుడు విజయ్ పార్టీ నాయకులు రజనీకాంత్ ను పిరికివాడని విమర్శించే పరిస్థితి వచ్చింది.
అయితే, కెప్టెన్ గా అభిమానులు ప్రేమతో పిలుచుకునే విజయకాంత్ ది తమిళరాజకీయాల్లో చెప్పుకోదగిన పాత్ర. 2005 లో ఆయన దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం –DMDK పార్టీ పెట్టి మొదటిసారి ఒక్కడే గెలిచారు. కానీ 2011 లో అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకొని 41 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాలు గెలుచుకున్నారు. డీఎంకే కంటే ఎక్కువ సీట్లు దక్కించుకోవటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కింది. అయితే, ఆ తరువాత అన్నా డీఎంకే తో వచ్చిన విభేదాల కారణంగా తన పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రతిపక్ష నేత హోదా వదులుకోవటానికి ఏ మాత్రం వెనకాడలేదు.
ఆ తరువాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 ఎలక్షన్స్ లో విరుదునగర్ నియోజకవర్గంలో ఆయన కొడుకు విజయ్ ప్రభాకరన్ ఎంపీగా పోటీచేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా పనిచేసిన మాణిక్కం టాగూర్ ను ఆఖరి నిమిషం దాకా ఉక్కిరిబిక్కిరి చేసి 4379 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అక్కడ పోటీ చేసిన సినీ నటి రాధికా శరత్ కుమార్ (బీజేపీ) 16 శాతం ఓట్లకు పరిమితమయ్యారు. జర్నలిస్టుగా, బాడీబిల్డర్ గా పేరుతెచ్చుకొని సినిమాల్లోకి వచ్చి 2007లో పార్టీ పెట్టిన మరో సినీ నటుడు శరత్ కుమార్ ది విచిత్రమైన పరిస్థితి. 1996 లోనే డీఎంకేలో చేరి, ఐదేళ్ల తరువాత రాజ్యసభకు నామినేట్ అయినా, 2006 ఎలక్షన్స్ కు ముందు భార్య రాధికతో కలసి అన్నా డీఎంకేలో చేరారాయన. అప్పుడు డీఎంకే గెలిచింది. ఇక లాభం లేదని 2007 లో ఆలిండియా సమత్తువ మక్కళ్ కచ్చి పేరుతో పార్టీ పెట్టారు. కానీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీని బీజేపీలో కలిపేశారు. భార్య రాధిక విరుదునగర్ లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
తెలుగులో సీతాకోకచిలక, అభినందన, అన్వేషణ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న నవరస నాయకన్ మురళి కూడా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ నాన్న ముత్తురామన్ ఒకప్పుడు జయలలిత సరసన కూడా హీరోగా నటించినవారే. తమిళంలో కార్తిక్ గా పిలుచుకునే నటుడు మురళి 2006 అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరారు. కానీ 2009 లోక్ సభ ఎన్నికలకు ముందు సొంతగా ఆలిండియా నాడాడు మక్కళ్ కచ్చి పేరుతో పార్టీ పెట్టారు.
విరుదునగర్ లోక్ సభ స్థానంలో 15 వేల వోట్లే వచ్చాయి. మళ్ళీ 2019 ఎలక్షన్స్ ముందు మనిద ఉరిమైగళ్ కాక్కుమ్ కచ్చి (మానవ హక్కుల పరిరక్షణ పార్టీ) అనే ఇంకో పార్టీ పెట్టినా, పోటీ చేయకుండా AIADMK కూటమికి మద్దతు ప్రకటించారు.
సినీనటుడు కమల్ హాసన్ కూడా భారీ అంచనాలతోనే తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2018 లో మక్కళ్ నీది మయ్యమ్ పేరుతో పార్టీ ప్రకటించారు. అవినీతి వ్యతిరేక అజెండా తీసుకున్నా, పట్టణ మధ్యతరగతి ప్రజల మద్దతు మాత్రమే దక్కింది. గ్రామీణ ఓటర్ల స్పందన కరవవటం, కేడర్ లేకపోవటం ఆయన పార్టీకి ప్రధాన బలహీనతలుగా మారాయి.
2021 లో కోయంబత్తూరు అసెంబ్లీ స్థానంలో కొద్ది వోట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, ఆ తరువాత లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే తో సఖ్యత కారణంగా ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. మొత్తంగా రజనీకాంత్ కంటే ఆయనే మెరుగనిపించారు.
ఇక తమిళ సినీ అభిమానులు దళపతి విజయ్ గా పిలుచుకునే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ రెండేళ్ళ కిందట ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ పెట్టి 2026 ఎన్నికలకు సిద్ధమయ్యాడు. దర్శకుడైన తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ వల్ల బాలనటుడిగా సినీ రంగంలో మొదలైన విజయ్ తన ప్రేక్షకుల అభిమానాన్ని వోట్లుగా మార్చుకోవాలనుకుంటున్నాడు.
నిజానికి ఇదే ఆలోచనతో మొదలైన నటుల సక్సెస్ రేట్ చూసినప్పుడు విజయ్ ఎంత మేరకు విజయుడిగా నిలుస్తాడన్న అనుమానాలు కూడా ఉన్నాయి. సమయం సరిపోదని 2024 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్న విజయ్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరైన వేళ రకరకాల సమస్యల్లో చిక్కుకున్నాడు.
పన్ను వ్యవహారంలో మద్రాసు హైకోర్టులో చుక్కెదురు కావటం, జన నాయగన్ సినిమా విడుదలలో ఏర్పడిన ప్రతిష్ఠంభన, కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట మీద సీబీఐ విచారణ, భార్య విడాకుల పిటిషన్ లాంటి సమస్యలన్నీ చుట్టుముట్టాయి. రకరకాల సంక్షేమ పథకాలను ఎన్నికల వాగ్దానాలుగా ప్రకటించినా, ఒంటరి పోరాటం కుదరకపోవచ్చునన్న అంచనాలు మొదలయ్యాయి. అదే జరిగితే కూటమి వాగ్దానాలకే కట్టుబడక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ వాగ్దానాలన్నీ బుట్ట దాఖలవుతాయి. అప్పుడు విజయావకాశాలు ఎలా ఉంటాయన్నది ప్రశ్నార్థకం కాక తప్పదు.
మొత్తంగా చూస్తే తమిళనాడులో కొత్త పార్టీ పెట్టడం సులభమే గానీ దాన్ని నిలబెట్టడం చాలా కష్టమని చరిత్ర చెబుతోంది. శివాజీ గణేశన్ నుంచి విజయ్ దాకా అన్ని కథలూ చెబుతున్నాడొకటే .. వ్యక్తి ప్రభావం తాత్కాలికం. సంస్థాగత బలం శాశ్వతం. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరికి ఎలాంటి పాఠాలు నేర్పుతాయో చూద్దాం. – తోట భావనారాయణ
Share this Article