.
Ashok Kumar Vemulapalli …. డీఎస్పీ @300 కోట్లు… తెలంగాణలో ఏ అధికారిపై ఏసీబీ సోదాలు నిర్వహించినా అక్రమాస్తుల విలువ వంద కోట్లకు ఎక్కడా తగ్గడం లేదు.. సంకిరెడ్డి భీంరెడ్డి అనే ఈ డీఎస్పీ ఏకంగా 300 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టాడు..
పుణ్యం కోసం చార్ ధామ్ యాత్రకు వెళ్తూ, ఎక్కడ ప్రాణాలు పోతాయోనన్న భయంతో, తాను సామాన్యుల రక్తాన్ని పిండి కూడబెట్టిన ముప్పై తరాల ఆస్తిపాస్తుల వివరాలను, బినామీల గుట్టును ఓ డైరీలో రాసి, దాన్ని భద్రంగా స్కాన్ చేసి వాట్సాప్‌లో కొడుకులకు పంపాడు మన పోలీస్ సారు.
Ads
చార్ ధామ్ పుణ్యక్షేత్రాల దర్శనం సంగతి దేవుడెరుగు కానీ, ఆ వాట్సాప్ చాటింగే ఇప్పుడు ఏసీబీకి దొరికిన అసలైన ‘మహా ప్రసాదం’ అయింది. ఆ దేవుడి స్క్రిప్ట్ ఎంత అద్భుతంగా ఉందంటే.. పాపాలు కడుక్కోవడానికి భార్యతో కలిసి హిమాలయాలకు వెళ్లిన సదరు డీఎస్పీ శంకిరెడ్డి భీంరెడ్డికి, ఇప్పుడు చంచల్‌గూడ జైలులో పాపాలు లెక్కపెట్టుకునే భాగ్యం లభించింది.
ఏసీబీ అధికారులు లెక్కగట్టిన అతని అక్రమాస్తుల విలువ అక్షరాలా రూ.300 కోట్లకు పైమాటేనట. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అదీ రక్షణ కల్పించాల్సిన ఒక పోలీస్ అధికారి ఇంతలా ఎలా తెగించగలిగారు? (తను ఎవరో రిటైర్డ్ ఐపీఎస్‌కు బినామీ అనే ప్రచారం జరిగింది గానీ, అదే నిజమైతే వారసులకు పంపకాలు ఎందుకు చేస్తాడు? సో, అంతా తన సొంతమే… అవినీతి గాథల్లో ఇదోరకం సక్సెస్ స్టోరీ… భీముడు కాదు, కుంభకర్ణుడు)
గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనుకుంటూ, నెలాఖరు వస్తే ఇల్లు గడవడం ఎలా అని సామాన్య మధ్యతరగతి జీవి అల్లాడిపోతుంటే, ఖాకీ చొక్కా వేసుకున్న కొందరు ఘనాపాఠీలకు మాత్రం ఈ ప్రభుత్వ ఉద్యోగం ఒక అక్షయపాత్రలా, నిలువునా దోచుకునే ఒక ‘బంగారు గని’లా కనిపిస్తోంది.
- ఇబ్రహీంబాగ్‌లోని వెసెల్లా మెడోస్ లగ్జరీ విల్లా, గచ్చిబౌలి, టెలికాం నగర్, తెల్లాపూర్‌లలో ఫ్లాట్లు, నివాస గృహాలు, ల్యాంకో హిల్స్ రోడ్డులో జీ+5 కమర్షియల్ కాంప్లెక్స్, కర్ణాటక, తెలంగాణల్లో కలిపి ఏకంగా 54 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు, ప్లాట్లు, కేవలం ఇళ్లలోనే కిలోల కొద్దీ బంగారం, వెండి, గుట్టల కొద్దీ నగదు.. ఇదంతా చూస్తుంటే ఒక పోలీస్ అధికారి జీతంతోనే ఇవన్నీ కొన్నారని నమ్మడానికి మనం ఏమైనా అమాయకులమా?
ఒక సామాన్యుడు తలదాచుకోవడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే జీవితకాలం సరిపోని లోన్లు, అప్పుల ఊబిలో కూరుకుపోవాలి. మరి ఈ ఇలాంటి పోలీస్ సాబ్‌లకు మాత్రం వందల కోట్ల సామ్రాజ్యాలు ఎలా సాధ్యమవుతున్నాయి?
వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుంటూ, అధికార దర్పంతో సామాన్యుడిని పీల్చి పిప్పి చేసి, లంచాల రూపంలోనో, బినామీల రూపంలోనో దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి వాచ్‌మన్‌లను, మాజీ హోం గార్డులను బినామీలుగా వాడుకున్న ఈ నీచమైన తెలివితేటలకు ఏ అవార్డు ఇవ్వాలి? చట్టాన్ని రక్షించాల్సిన చేతులే ఇలా అవినీతితో అపవిత్రమైతే, సామాన్యుడు ఇక ఎవరిని నమ్మాలి?
ప్రభుత్వ ఉద్యోగం దొరికితే చాలు సమాజాన్ని నిలువునా దోచేయవచ్చనే ధీమా ఈ అధికారులకు ఎక్కడి నుంచి వస్తోంది? కష్టపడి పన్నులు కట్టే సామాన్యుడి సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, అదే సామాన్యుడిని నిలువునా ముంచే ఇలాంటి అవినీతి తిమింగలాల అసలు స్వరూపం ఈ చార్ ధామ్ డైరీతోనైనా బట్టబయలైంది.
దేవుడికి భయపడి ఆస్తుల లిస్టు రాసుకున్న ఆ డీఎస్పీ గారు, ఇప్పుడు చట్టం ముందు, సమాజం ముందు తలదించుకుని నిలబడాల్సిందే. ఈ దోపిడీ వ్యవస్థ మారనంత కాలం, ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించనంత కాలం, సామాన్యుడి బతుకు నిరంతర పోరాటమే అవుతుంది.
రీసెంట్ గా పట్టుబడిన ప్రతి అధికారి దగ్గరా కనీసం వంద నుంచి మూడొందల కోట్ల అక్రమాస్తులు బయటపడుతూనే ఉన్నాయి..అసలు కరెప్టెడ్ అధికారుల దగ్గర ఉన్న అక్రమాస్తులన్నీ కలిపితే ఒక రాష్ట్ర బడ్జెట్ వచ్చేస్తుందేమో… అశోక్ వేములపల్లి
- ష్… జస్ట్, కొద్దిరోజులు… అంతా సద్దుమణిగి, మళ్లీ ఎక్కడో కీలకమైన అదే డీఎస్పీ పోస్టులో కనిపిస్తాడు, వెయిట్ చేయండి, మన సిస్టం దరిద్రం అది… కింది నుంచి పైదాకా అవినీతి కంపే కదా..!!
Share this Article