.
కాకి బంగారం… గిల్ట్ నగలు… ఇమిటేషన్ ఆభరణాలు… పంచలోహ ఆర్నమెంట్స్…. అసలు బంగారంకన్నా వీటికే మెరుపు ఎక్కువ కదా… ఒంటినిండా కిలోల కొద్దీ నగలు దిగేసుకుని, ఫోటోలతో హల్‌చల్ చేసిన ఓ ఫేక్ గోల్డ్ మేన్ గుట్టు రట్టయిందని పత్రికల్లో అందరూ చదివిందే కదా…
సాధారణంగా మహిళలకు ఈ నగల పట్ల మోజు ఎక్కువ… ఫంక్షన్లలో ప్రదర్శనకు మక్కువ చూపిస్తుంటారు… మగాళ్లలో మరీ మరీ అరుదు… ఎక్కువగా రియల్ ఎస్టేట్ మధ్యవర్తుల ఒంటి మీద ఈ హంగామా ఎక్కువగా కనిపిస్తుంది… సరే, సోషల్ మీడియాలో రెండు పోస్టులు నాకు ఆసక్తికరంగా అనిపించాయి… అవేమిటో మీరూ చదివేయండి…
Ads
Naren G …. హయ్యో హయ్యో హయ్యయ్యో… నకిలీ ‘గోల్డ్ మ్యాన్’ గుట్టురట్టు: ఐటీ అధికారుల విచారణలో షాకింగ్ నిజాలు!
హైదరాబాద్‌లో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే “గోల్డ్ మెన్”పై దృష్టి సారించిన ఆదాయపు పన్ను (I-T) శాఖ అధికారులకు ఒక విస్తుపోయే నిజం తెలిసింది. అత్తాపూర్‌కు చెందిన 34 ఏళ్ల సూర్య భాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్ ధరించే నగల్లో మెరుపు ఉందే తప్ప, అసలు బంగారం లేదని తేలింది.
ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల అసలు బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసును విచారిస్తున్న అధికారులకు, సూర్య భాయ్ గురించి సమాచారం అందింది. శుక్రవారం సాయంత్రం విచారణకు హాజరైన సూర్య భాయ్, సుమారు రూ. కోటి విలువైన 12 రకాల ఆభరణాలు ధరించి వచ్చారు. అయితే అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, వాల్యూయర్స్ చేత పరీక్షించగా అసలు రంగు బయటపడింది. ఆ నగలు కేవలం రూ. 3 లక్షల విలువైనవని తేలింది.
నకిలీ హంగామా వెనుక అసలు కథ:
• నకిలీ నగలు: సూర్య భాయ్ ధరించిన నగల్లో మెజారిటీ రాగిపై రోడియం కోటింగ్ పూసినవి, మరికొన్ని వెండిపై గోల్డ్ కోటింగ్ ఉన్నవని తేలింది. ఇలాంటివి దాదాపు 32 సెట్లను ఆయన వాడుతున్నట్లు గుర్తించారు.
• ఆదాయం తక్కువ.. షో ఎక్కువ: గత 6 ఏళ్లలో కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 4.9 లక్షల ఆదాయాన్ని చూపించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. జిమ్ ఇన్స్ట్రక్టర్, చికెన్ షాప్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఆయన జీవనం సాగిస్తున్నారు.
• ఆస్తులు సున్నా: తన పేరు మీద గానీ, భార్య పేరు మీద గానీ ఎటువంటి స్థిరాస్తులు లేవని, నెలకు రూ. 20,000 అద్దె కట్టే ఫ్లాట్‌లో నివసిస్తున్నారని అధికారులు ధృవీకరించారు.
• లగ్జరీ కార్లు: ఆయన వాడుతున్న థార్, సఫారీ, ఎండీవర్ వంటి వాహనాలు కేవలం ప్రదర్శన కోసమేనని, భూ వివాదాల సెటిల్మెంట్లలో వచ్చే కమిషన్లతో వీటిని సమకూర్చుకున్నట్లు విచారణలో తేలింది.
సినిమా పిచ్చి.. పబ్లిసిటీ కోసం పాకులాట:
SNS ప్రజా సేవా ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ నడుపుతున్నానని చెప్పినప్పటికీ, దానికి పాన్ కార్డ్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ లేవని అధికారులు గుర్తించారు. కేవలం సినిమాల్లో అవకాశాల కోసమే ఇలా “గోల్డ్ మ్యాన్”గా బిల్డప్ ఇచ్చానని సూర్య భాయ్ ఒప్పుకున్నారు. ఇప్పటికే ‘ఘటికుడు’ వంటి రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం ఆయన్ని వదిలిపెట్టిన అధికారులు, విజయ్ కుమార్‌కు సంబంధించిన ప్రధాన కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు…
#GoldMan #clnraju #SuryaBhai
Murali Buddha …. నంద్యాల ఎంపీగా ఉన్నప్పుడు నంది పైపుల యజమాని spy రెడ్డి ఇంటర్వ్యూ ఒకటి చదివా … డబ్బులు లేవు … నమ్మి డబ్బు ఇచ్చేవాడు లేడు .. దానితో ఆయన బాగా ఆలోచించి … కొన్ని టాక్సీలను అద్దెకు మాట్లాడుకున్నారు … ఆ టాక్సీలు spy ఇంటి కి రోజు చక్కర్లు కొడుతూ ఉండాలి …
రెడ్డి ఏదో పెద్ద పనే చేస్తున్నాడు … లేకపోతే ఇన్ని టాక్సీలు ఆయన ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతాయి అని పెద్దలు spy రెడ్డిని కలిశారు .. వ్యాపారాలు చేస్తున్నాను అంటే చాలా మంది బతిమిలాడి మరీ డబ్బులు ఇచ్చారు . వాటితో వ్యాపారం చేశాడు, ఎదిగాడు, ఎంపీ కూడా అయ్యారు …
కోలా కృష్ణ మోహన్ ఇంటి ముందు కూడా ఇలానే కార్ల హడావుడి ఉండేది .. ప్రస్తుతం ఈ ఫేక్ గోల్డ్‌మ్యాన్ బంగారు ఆభరణాల వార్తలు చాలానే చూశాం, అవి గిల్టీ నగలని ఐటీ వాళ్ళు తేల్చారు … మెరిసేదంతా బంగారం కాదు గీకి చూడాలి ..,
Share this Article