.
Subramanyam Dogiparthi …. ఓ ఇంటర్నేషనల్ పిసినారి , ఆ పిసినారి కొడుకు మహా పిసినారిల కధే ఈ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా . జంధ్యాల అహ నా పెళ్ళంట సినిమాలో పిసినారి కోట శ్రీనివాసరావు రేలంగి నరసింహారావు గారి బుర్రలో గట్టిగా పడిపోయి ఉంటుంది . ఇలాంటి పిసినారి మొగుళ్ళు , పరాన్నభుక్కులు మన బంధువుల్లో , స్నేహితుల్లో పుష్కలంగా ఉంటారు .
సెలూనుకు వెళ్లి పౌడర్ రాసుకునే వాళ్ళు , కూరగాయల మార్కెట్లో సేంపుల్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళు , ఆటోలను పట్టుకుని బళ్ళు నడుపుకునే వాళ్ళు , సాయంత్రం భోజనాలకు ఆహ్వానిస్తే మధ్యాహ్నం భోజనం స్కిప్ చేసేవాళ్ళు , ఇంట్లో టిఫిన్ చేసి దారిలో ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కాఫీలకు తగలడే వాళ్ళు , బాదరాయణ బంధువులు కుప్పలకుప్పలు .
Ads
వీళ్ళ పెళ్ళాల గోల , పిల్లల హాహాకారాలు అంతింత కాదు . ఏం చేస్తారు పాపం ! కొన్నాళ్ళ భరిస్తారు . తర్వాత ఏ దారి దొరికితే ఆ దారిన పోతారు . ఈ సినిమాలో విసిగిపోయిన పెళ్ళాం గారు మొగుడు గారి సూట్ కేసును బయటకు వేసి తలుపు మూసేస్తుంది .
ఆ మొగుడు గారు తిరుపతిలో కూరగాయల మార్కెట్ కాంట్రాక్టర్ అవతారం ఎత్తుతాడు . ఆ ఊరి మున్సిపల్ ఆఫీసులోనే కమీషనర్ PA గా వస్తుంది ఆ పెళ్ళాం గారు . మొగుడు గారి వారసుడు తండ్రిని మించిన తనయుడు . ఆకులు నాకే వాడికి మూతులు నాకే వాడు తోడయినట్లు . ఒకరికి ఒకరు తోడయి అహ నా పెళ్ళంట సినిమాలో కోట , రాజేంద్రప్రసాద్ విన్యాసాలను మించి వెలగపెడుతుంటారు తిరుపతిలో .
ఇది కథ కాదు సినిమాలో చిరంజీవి తల్లి లీలావతిలాగా రాజేంద్రప్రసాద్ తల్లి అన్నపూర్ణ కోడలు దగ్గర పని మనిషిగా చేరుతుంది . మునిసిపల్ కమీషనరుగా వచ్చిన వయ్యారాల వై విజయ ఓ నాటకమాడి రాజేంద్రప్రసాదుకు డబ్బు మీద యావను తొలగించి కుటుంబ సభ్యుల ఆత్మీయత , ప్రేమ , అనుబంధాలే ముఖ్యమనే జ్ఞానోదయం కలిగించటంతో సినిమా శుభాంతం అవుతుంది .
ఆద్యంతం సరదా సరదాగా నడిపారు రేలంగి నరసింహారావు . రాజేంద్రప్రసాద్ హవా నడుస్తున్న ఆ దశకంలో కేవలం 18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని పలు కేంద్రాలలో వంద రోజులు ఆడింది . కన్నడం , మరాఠీ భాషల్లోకి రీమేక్ అయింది కూడా .
హాస్య రస విద్యాలయం నుండి వచ్చిన రేలంగి నరసింహారావు , కాశీ విశ్వనాధులు కధను నేయగా , కాశీ విశ్వనాథ్ , శంకరమంచి పార్ధసారధి సంభాషణలను చాలా బాగా వ్రాసారు . జాలాది , పిళ్ళా శ్రీ , సాహితి పాటల్ని వ్రాయగా , జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు .
డబ్బు ఖర్చు పెట్టకుండా దాచుకోండి నాయనా , ఖర్చులన్ని ఊరి మీద వేసుకోండి నాయనా పాట ఈ సినిమాకు ఐకాన్ సాంగ్ . తిరుపతి వీధుల్లో అద్భుతంగా చిత్రీకరించారు . అలాగే ప్రేక్షకులను హుషారు చేసిన వాన డ్యూయెట్ చిటుకు చిటుకుమని చిన్నదానా పాట .
ఏక్ దో తీన్ అంటూ సాగే మ్యూజికల్ చైర్స్ సాంగులో వయ్యారాల వై విజయ అదరగొట్టేస్తుంది . రాజేంద్ర ప్రసాద్ , దివ్యవాణి మీద కస్సు బుస్సు పాపాయమ్మా , లే లే లేత పచ్చ అంటూ సాగే డ్యూయెట్ పాటలు బాగుంటాయి .
- ముందుగా మెచ్చుకోవలసింది బుడ్డోడు ఆదిత్యనే . రాజేంద్రప్రసాదుతో ధీటుగా నటించాడు . దివ్యవాణికి హీరోయినుగా గుర్తింపు వచ్చింది . గుజరాతీ వై విజయ వచ్చీ రాని తెలుగు , ఆ తెలుగులో బూతులు , గందరగోళం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి .
తల్లిగా అన్నపూర్ణమ్మ , రచయితగా శ్రీలక్ష్మి , ఆమె నిస్సహాయ భర్తగా సుత్తి వేలు , ఆ ఇంట్లో పనోడిగా బట్టల సత్యం , ఆఫీస్ మేనేజరుగా రావి కొండలరావు , తాగుబోతు ప్యూనుగా బాబూమోహన్ తదితరులు నటించారు . ప్రేక్షకులు మరచిపోని మరో పాత్ర సూర్యకళది . చాలా కాలం తర్వాత తళుక్కుమన్నది . బావ మీద మనసేసుకున్న ఓనరమ్మగా గుర్తుండిపోతుంది .
వెరశి మంచి హాస్య రస వినోదాత్మక పిసినారోళ్ళ , వాళ్ళ బాధితుల సినిమా . యూట్యూబులో ఉంది . కాసేపు హుషారు కావాలనుకున్నప్పుడు చూడండి . చూసి ఉండకపోతే తప్పక చూడండి …..
Share this Article