.
సోషల్ మీడియాలో ఏ వార్త ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం… కానీ, కొన్నిసార్లు పాత జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తేవడం వెనుక లోతైన వ్యూహాలు ఉంటాయనేది కాదనలేని సత్యం… ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది… దాదాపు తొమ్మిదేళ్ల క్రితం (2017) నాటి కోహ్లీ- అనుష్కల పెళ్లి రిసెప్షన్ ఫోటోలు, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన దృశ్యాలు ఇప్పుడు మళ్ళీ నెట్టింట కనిపిస్తున్నాయి…
దీని వెనుక కేవలం నోస్టాల్జియా మాత్రమే ఉందా? లేక ఇటీవల కోహ్లీపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ‘ఇమేజ్ మేనేజ్‌మెంట్’ ఉందా? అనే చర్చ మొదలైంది… కావాలనే కోహ్లీ పీఆర్ టీమ్ తెరపైకి తీసుకొచ్చిన కొత్త ఎత్తుగడా..? ఎందుకంటే..?
Ads
ఇండియాలో ఏ క్రికెటర్‌కూ లేనంత భారీ బ్రాండ్ ఇమేజ్, బ్రాండ్ వాల్యూ ఉంది విరాట్ కోహ్లీ… అదేదో తెలుగు సినిమాలో చెప్పినట్టు… కోహ్లీ అంటే అదొక బ్రాండ్..! ఐతే తను టెస్టుల నుంచి, టీ20 నుంచి రిటైరయ్యాడు… ఐపీఎల్, వన్డేలలో మాత్రం కొనసాగుతున్నాడు… రోహిత్- కోహ్లీలకు గౌతమ్ గంభీర్‌కూ నడుమ ఏదో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది…
దీనికితోడు అనుష్కతో కోహ్లీ లండన్‌లో ఉంటున్నాడు… ఇండియా నుంచి వలస వెళ్లిపోయాడు… సహజంగానే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు అది పెద్దగా నచ్చడం లేదు… నిజానికి కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకుల్లో అభిమానులున్నారు, చివరకు పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా..! అయితే… లండన్‌లో ఉండటం, కేవలం మ్యాచులు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు వస్తుండటం మీద ‘కోహ్లీ ఓవర్సీస్ ప్లేయర్’ అనే సెటైర్లు పడుతున్నాయి తన మీద…
అంతేకాదు, ఇటీవల మలబార్ గోల్డ్ వంటి కొన్ని అంతర్జాతీయ బ్రాండ్లు పాకిస్థానీ ఇన్‌ఫ్లుయెన్సర్లను తమ ప్రమోషన్ల కోసం వాడుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి… దీన్ని కూడా కొందరు ఈ వివాదాన్ని కోహ్లీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు… కోహ్లీకి పాకిస్థానీ వ్యాపార భాగస్వాములు ఉన్నారనే నిరాధారమైన ప్రచారం కూడా కనిపిస్తుంటుంది…
-
పాత పెట్టుబడులు – కొత్త రంగు… 2014లో కోహ్లీ ‘Sport Convo’ అనే లండన్ ఆధారిత సోషల్ మీడియా స్టార్టప్‌లో వాటా కొనుగోలు చేశాడు… ఇది కేవలం క్రీడాకారుల కోసం ఉద్దేశించిన వేదిక… ఇది పదేళ్ల క్రితం నాటి పాత వార్త అయినప్పటికీ, ఇప్పుడు దీనిని “లండన్ బిజినెస్ లింక్స్” అంటూ కొత్తగా ప్రచారం చేస్తున్నారు…
వాస్తవానికి కోహ్లీ వ్యాపార సామ్రాజ్యం అంతా భారతదేశం చుట్టూనే కేంద్రీకృతమై ఉంది… తన సొంత బ్రాండ్ One8, ఫ్యాషన్ బ్రాండ్ WROGN, ప్లాంట్-బేస్డ్ మీట్ స్టార్టప్ Blue Tribe వంటివన్నీ భారతీయ కంపెనీలే… ఓవర్సీస్ ప్లేయర్, వ్యాపారాల్లో తలమునకలు, ఆటపై తగ్గిన ఆసక్తి వంటివి తన బ్రాండ్ వాల్యూ పడేయకుండా ఉండటానికి తన పీఆర్ టీమ్ తెలివిగా… కోహ్లీ పెళ్లి రిసెప్షన్‌కు మోడీ హాజరు వంటి పాత ఫోటోల్ని ప్రచారంలోకి తీసుకువస్తోంది…
ఇమేజ్ బ్యాలెన్సింగ్… ప్రతికూల (నెగెటివ్) వార్తల ప్రభావాన్ని సానుకూల జ్ఞాపకాలతో ‘బ్రేక్’ చేయడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం… ఓ మోరల్ షీల్డ్… సోషల్ మీడియాలో హఠాత్తుగా ఇలాంటి ఫోటోలు ప్రత్యక్షం కావడం వెనుక ఇదుగో, ఇన్ని కారణాలుంటాయి… అంతా పీఆర్ టీమ్స్ మహత్తు, మాయ, ఆట… ఇది క్రికెట్‌కన్నా పెద్ద ఆట..!!
Share this Article