.
అర్చకులు విదేశీ ప్రయాణాలు చేయవద్దా..? చేస్తే గర్భగుడి ప్రవేశానికి అనర్హులా..? ఓ ఆసక్తికరమైన అంశం… శనిశింగాపూర్ విగ్రహం, శబరిమల రుతుమహిళల ప్రవేశం వంటి సున్నితమైన సమస్యే… నిజానికి ఆగమ శాస్త్రాలు, మతసంబంధ అంశాలపై ఏమాత్రం సంబంధం లేని న్యాయస్థానాలు తమంతటతామే తీర్పులు వెలువరించకుండా… సంబంధిత ఆగమనిపుణులకే వదిలేయడం బెటరనే అభిప్రాయాలు ఉన్నవే కదా…
- తాజాగా ఓ కేసు ఏమిటంటే..? 2010 నవంబరులో… అంటే రాష్ట్ర విభజనకు ముందు… దేవాదాయ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది… అలాగే 2024 డిసెంబరులో శృంగేరీ శారదాపీఠం జగద్గురువు భారతీ తీర్థ మహాస్వామి ఓ ప్రామాణికం జారీచేశాడు… ఆ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలంటూ ఓ పిటిషన్ దాఖలైతే… అవి అమయ్యేలా చూడాలని తీర్పు వెలువరించింది న్యాయస్థానం…
ఇక్కడ కోర్టు తీర్పు చట్టపరంగా సరైన దిశలోనే ఉంది… ఆల్రెడీ దేవాదాయ శాఖ సర్క్యులర్ ఉంది, శృంగేరీ పీఠం మార్గదర్శకాలున్నాయి… సో, వాటిని వివాదం లేకుండా అమలు చేయాలని చెప్పింది… అయితే ఇలాంటి అంశాల్లో దేవాదాయ శాఖ ఆ సర్క్యులర్ జారీకి పాటించిన ప్రమాణాలు ఏమిటి..? శృంగేరీ పీఠం ఏకపక్ష అధికారం ఏమిటనే ప్రశ్నలు తలెత్తడం సహజం…
Ads
- ఎస్, అర్చకులకు సముద్రాలు దాటే విమాన ప్రయాణాలు, నౌకా ప్రయాణాలు శాస్త్రవిహితం కావనే నమ్మకాలు చాన్నాళ్లుగా ఉన్నవే… కానీ కాలం మారింది..? భూగోళం ఓ గ్లోబల్ విలేజ్‌గా మారిందిప్పుడు… విదేశాల్లో ఉన్న మత విశ్వాసులు మతం మీద ప్రేమతోనే అర్చకులను ఆహ్వానిస్తున్నారు… మతానికి పాజిటివ్ అంశమే… ఈ దిశలో న్యాయస్థానం భిన్నంగా ఆలోచించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి…
చాలామంది అర్చకులు విదేశాలకు వెళ్లి, అక్కడి హిందూ గుళ్లల్లో అర్చకులుగా పనిచేస్తున్నారు… ఇతరత్రా పూజలు, కర్మలు, మత సంబంధ క్రతువులు నిర్వర్తిస్తున్నారు… మరి శృంగేరీ పీఠం ఎందుకీ ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసిందో తెలియదు…
- అయోధ్యలో మోడీ ప్రాణప్రతిష్ఠకు కొందరు పీఠాధిపతులు అడ్డుపడే ప్రయత్నం చేశారు… అయోధ్య ట్రస్టు వాటిని కొట్టిపారేసింది… పాలకస్థానమే అర్హత అని తేల్చేసింది… ద్రౌపది ముర్ముతో గుడి సంపూర్ణమైనట్టు ప్రకటించే తంతును కూడా నిర్వహించారు… యావత్ హిందూ మతంలో వీసమెత్తు అభ్యంతరం వ్యక్తం కాలేదు… ధార్మికమార్గంలో కాలం చెల్లిన నమ్మకాలను పక్కనపెట్టేసి, ప్రజెంట్ అవసరాలకు అనుగుణంగా మారాలని ఎందరెందరో ధార్మికవేత్తలు చెబుతున్నదే…
మిత్రుడు Chakradhar Rao ఏమంటాడంటే..?
“దేవుడు సర్వాంతర్యామి” — ఇది మాట కాదు, మన ఆధ్యాత్మిక సంప్రదాయం యొక్క మూల సత్యం.
“యో భూమ్యాం తిష్ఠన్ భూమ్యా అంతరోయం భూమిం న వేద, యస్య భూమిః శరీరం, యో భూమిమంతరో యమయతి, ఏష తే అంతర్యామి అమృతః।” – బృహదారణ్యక ఉపనిషత్తు
భూమిలో ఉండి, భూమికి తెలియకుండా దాన్ని లోపల నుంచే నడిపించే వాడు — అతడే అంతర్యామి.
అదే భావం నీటిలో, గాలిలో, అగ్నిలో, మనిషిలో కూడా వర్తిస్తుంది.
అనె ఉపనిషత్ వాక్యం పుస్తకానికే పరిమితమా ?
“ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి।” – శ్రీమద్భగవద్గీత
ప్రతి జీవి హృదయంలో దేవుడు ఉన్నాడని స్పష్టంగా చెప్తుంది.
మరి మనం ప్రతిరోజూ జపించే శాంతి మంత్రం:
“ఓం ద్యౌః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః
వనస్పతయః శాంతిర్విశ్వేదేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః
శాంతిరేవ శాంతిః సా మా శాంతిర్భవతు॥” – శుక్ల యజుర్వేదం
ఆకాశం నుంచి భూమి వరకు, నీటి నుంచి మొక్కల వరకు — అన్నింటిలో ఒకే శాంతి, ఒకే దైవత్వం ఉందని అంగీకరిస్తున్నాం.
ఇంత స్పష్టంగా, ఇంత గట్టిగా తత్వం చెప్పిన దేశంలో…
విదేశాలకు వెళ్లి వచ్చినవాడు గర్భగుడిలోకి రాకూడదని చెప్పడం హాస్వాస్పదం కాక మరేమిటి ? భూగోళ్లాన్ని, అంతరిక్షాన్ని చుట్టివచ్చినా గర్భగుడి.. గర్బంలోకి వెళ్ళొచ్చు. భగవత్ సృష్టిని ఎక్కువగా చూసొచ్చాడు కనక అతడికే ఎక్కువ అర్హత ఉండాలి.
దేవుడు అందరిలోనూ… అన్నిటిలో ఉన్నాడు అంటూనే
శాస్త్రం పేరుతో ఇలాంటి నిబంధనలు ఇంకా అవసరమా ?
ఇది తత్వానికి విరుద్ధం కాదా?
శాస్త్రం అంటే మనిషిని విశాలంగా చేయాలి.
భయం పెంచి, వేరుచేసి, అడ్డుకట్టలు పెట్టేదైతే — అది శాస్త్రం కాదు.
మన పూర్వికులు అంతరిక్ష శాంతి కోరారు.
భూమి మొత్తాన్ని ఒక సమగ్ర జీవంగా చూశారు.
ప్రతి జీవిలో దైవత్వం ఉన్నదని బోధించారు.
అలాంటి తత్వాన్ని చెప్పిన వారసులమని గర్వపడే మనం —
ఈ రోజుకి కూడా “సముద్రం దాటితే పూజకు పనికి రావు ? అని అనటం విచిత్రం కాదా?
తత్వం పుస్తకాల్లో ఉండటానికి కాదు. మన ప్రవర్తనలో కనిపించాలి.
తత్వం చెప్పిన దారిలో నడవని ఆచారం,
ఎంత పాతదైనా… ఎంత పేరున్నదైనా… నిజమైన ధర్మం కాదు….
(కేవలం ఆరోగ్యకరమైన చర్చ కోసం మాత్రమే ఈ అభిప్రాయం, విభేదించేవాళ్లూ ఉంటారు, తప్పుకాదు... టిబెట్, నేపాల్ కూడా విదేశాలే... కానీ అవి హైందవ ధర్మం బలంగా ఉనికి కలిగి ఉన్న ప్రాంతాలే... సముద్ర ప్రయాణం, విమాన ప్రయాణం కూడా అవసరం లేదు... ఆది శంకరాచార్యులు కూడా కాలినడకన వెళ్లినవే... ఆగమాలు కూడా అన్ని గుళ్లల్లోనూ ఒకేరకంగా ఉండవు... ఒక్కో పీఠం ఒక్కోరకంగా చెబుతుంది... కొందరు అర్చకులు చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వర్తించి వస్తున్నారు కూడా...)
ధర్మం స్టాటిక్ కాదు, డైనమిక్… ఒక్కోచోట ఒక్కో పూజాపద్ధతి ఉంటుంది, అన్నీ ఆమోదనీయమే కదా… ఆదిశక్తి, గ్రామదేవతల గుళ్లల్లో పూజాపద్ధతులు వేరు… అన్నీ సంరక్షించుకోవాలి, అన్నీ గౌరవించబడాలి… అంతిమంగా ధర్మరక్షణ, ధర్మవ్యాప్తి ప్రధానం…
Share this Article