.
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలే కావచ్చు… పేరు గుర్తులేదు… ఓ రచయిత పాత్ర… తన నవలను కంప్యూటర్‌కు అప్పగించి విశ్లేషించమంటాడు… అందులో రొమాన్స్ ఎంత శాతమో, క్రైమ్ ఎంత శాతమో, సస్పెన్స్ ఎంత శాతమో విశ్లేషిస్తుంది అది… పర్లేదు, సక్సెస్ అనుకుంటాడు తను… అంతా పాపులర్ ఈక్వేషనే కదానే ధీమా… కానీ నవల ఫ్లాపవుతుంది… కారణం… అది హ్యూమన్ ఎమోషన్స్‌తో పాఠకుడిని కనెక్ట్ కాలేకపోవడం, కేవలం ఈక్వేషన్ల పరిధుల్లో వండబడిన కథ కాబట్టి…!
మనకు గతంలోనే కాదు, ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు వస్తుంటాయి… పక్కా కమర్షియల్ ఈక్వేషన్లు… నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, ఓ కామెడీ ట్రాక్, రొమాన్స్, వీలయితే ఓ రోత ఐటమ్ సాంగ్… చివరలో సుఖాంతం… అక్కడక్కడా హీరో ఎలివేషన్లు… కానీ అలా తీసిన సినిమాలు బోలెడు కొట్టుకుపోయాయి… కారణం సేమ్, ఎమోషనల్‌గా ప్రేక్షకుడిని కనెక్ట్ కాకపోవడం..!
Ads
మీకు లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ కావాలి… ఆ స్కోర్ కావాలీ అంటే లోన్ తీసుకోవాలి, సరిగ్గా రీపే ఉండాలి, ఈఎంఐలతో వస్తువులు కొనాలి, సమయానికి చెల్లించాలి, సరైన స్కోర్ లేకపోతే పెద్ద రుణాలు ఇవ్వరు… నాకు లోన్లు లేవు, ఈఎంఐలు లేవు, క్రెడిట్ కార్డుల్లేవు అని చెప్పినా బ్యాంకులు వినిపించుకోవు… సిబిల్ స్కోర్ కావాలీ అంటాయి… అదొక దిక్కుమాలిన విధానం, అదొక చర్చ…. సరే, ఇక విషయానికి వద్దాం…
ఈక్వేషన్స్ వేరు- ఎమోషన్స్ వేరు… ఇదెందుకు చెప్పుకోవడం అంటే… లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (LIK) అని నిన్న ఓ సినిమా వచ్చింది… నయనతార మొగుడు విఘ్నేష్ శివన్ దర్శకుడు… నిన్న రిలీజైంది… సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ జానర్… మనం ఇప్పుడు రకరకాల యాప్స్, స్మార్ట్ ఫోన్ల గుప్పిట్లోనే బతుకులు ఈడుస్తున్నాం కదా… 2040 లో ఓ యాప్ వస్తుందట…
అది గుణాలు, జాతకాలు గట్రా చూడదు… యువతీయువకుల పాత ప్రేమకథల్ని బట్టి స్కోర్ ఇస్తుంది… సిబిల్ స్కోర్‌లాగే… అది బాగుంటేనే పెళ్లిళ్లు కుదురుతాయి… సరే, ఓ కొత్త స్టోరీ పాయింటే… కానీ..?
మనుషుల నడుమ ఎమోషనల్ బాండింగ్స్ ఘోరంగా దెబ్బతింటూ… భర్తల్ని ప్రియుల సాయంతో భార్యలు చంపేస్తున్నారు.,. ఎప్పటిలాగే భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు… పిల్లల్ని తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని పిల్లలు కూడా చంపేస్తున్నారు… అన్నీ రకరకాల ఈక్వేషన్స్, నో ఎమోషన్స్…
సరే, సినిమాకు వస్తే… కథానాయిక కృతి శెట్టి సరైన లవ్ స్కోర్ లేదని కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ పెళ్లి ప్రపోజల్ కొట్టేస్తుంది… ఈ యాప్స్, ఈ ఈక్వేషన్స్‌కు భిన్నంగా హాయిగా ఓ ఆర్గానిక్ ప్రపంచంలో బతికే కథానాయకుడు అప్పుడేం చేయాలి..? అదీ కథ… కొత్త పాయింట్‌కు అనుగుణంగా సరైన ప్రజెంటేషన్ లేక దర్శకుడు పరమ బోర్ సినిమాను వదిలాడు…
నిజానికి ప్రేమ అనేది ఏ ఈక్వేషన్లలోనూ ఇమడదు… ఈక్వేషన్లు మాత్రమే ఉంటే ఎమోషన్ కరువై బంధం నిలబడదు… ఈక్వేషన్లే ముఖ్యమైతే కులాంతరాలు, ఆస్తులు- అంతస్థుల తేడా పెళ్లిళ్లు, ప్రేమలు, పెద్దలపై, సమాజంపై తిరగబడటం గట్రా ఉండ వు కదా… ఇదే చెప్పాలనుకున్నాడు దర్శకుడు… కానీ సరిగ్గా చెప్పలేక విసిగించాడు… మంచి చేయి తిరిగిన దర్శకుడైతే బలంగా ఈ పాయింటుతో మంచి సినిమాను ఇచ్చేవాడు…
ఇలాంటి సినిమాలకు సంగీతం బలంగా ఉండాలి… పేరు గొప్ప అనిరుధ్ పేలవమైన మ్యూజిక్ ఇచ్చాడు… హీరోహీరోయిన్ల నటన పర్లేదు… అక్కడక్కడా కాస్త కామెడీ బాగున్నా సరే… ఎడిటింగ్, నిర్మాణ విలువలు పూర్… చివరగా… మనిషిని నడిపించాల్సింది ఆల్గారిథమ్ కాదు, అదసలు రిథమ్ కాదు… స్పష్టంగా నిర్వచించలేని ఎమోషన్స్ మాత్రం మనిషి జీవనాన్ని పండించేవి… ప్చ్, బాగా చెప్పగలిగితే మంచి ఆసక్తికరమైన కథ..!!
Share this Article