Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్ హైబ్రీడ్ మోడల్ కేంద్రం పాటించదగిందే… అదెలాగంటే..?

April 14, 2026 by M S R

.

కేంద్రం తేలికగా తీసిపడేయకుండా… రాజకీయ భేషజాలకు పోకుండా… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రీడ్ మోడల్ డీలిమిటేషన్‌ను ఓసారి సీరియస్‌గా పరిశీలించాలి… ప్రతిపక్షం ఏదో చెబుతోంది, అడ్డుపడుతోంది అని గాకుండా ఆచరణసాధ్యతను, అవకాశాల్ని, ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి… విజ్ఞత ప్రదర్శించాలి… ఓసారి వివరాల్లోకి వెళ్దాం…

అప్పుడెప్పుడో జరిగిన జనగణన (1971) ఆధారంగా జనాభాను బట్టి ఒక్కో రాష్ట్రానికి ఎన్ని ఎంపీ సీట్లు ఉండాలో నిర్ధారించారు… ఇప్పుడు సేమ్ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ గనుక జరిగితే… జనాభా నియంత్రణ వంటి అభివృద్ధి సూచికల్లో సిన్సియర్‌గా కృషి చేసిన, ముందున్న సౌత్ స్టేట్స్‌కు రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్యాయం జరుగుతుంది… అంటే, బాగా పనిచేసిన వాళ్లకు శిక్ష విధించినట్టు కాదా..? నిర్లక్ష్యపు బీమారు రాష్ట్రాలను ప్రోత్సహించినట్టు కాదా..? సౌత్ స్టేట్స్‌కు కేంద్ర అధికారంలో ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోదా..?

Ads

ఈ అభిప్రాయాలు, ఈ విశ్లేషణలు చాన్నాళ్లుగా ఉన్నవే… నిజమే… ఇది సౌత్ వర్సెస్ నార్త్ వైరానికి దారితీసే ప్రమాదముందని గ్రహించి మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ 50 శాతం సీట్లను ప్రొరేటా ప్రకారం పెంచుతామంటూ ముందుకొస్తోంది… స్థూలంగా చూస్తే ఇదేదో బాగానే ఉంది కదా అనిపిస్తుంది పైపైకి… కానీ నార్త్, సౌత్ నడుమ గ్యాప్ అలాగే ఉంటుంది కదా… కామన్ సెన్స్..! 1971 నుంచి ‘మంచి పనితీరు’ కనబరిచి, కేంద్రాన్ని నిలబెడుతున్న సౌత్ స్టేట్స్‌కు దక్కే ప్రోత్సాహం ఏమున్నట్టు మరి..?!

ఇప్పటికే గణాంక సహిత విశ్లేషణలున్నాయి… సౌత్ స్టేట్స్ నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును నార్తరన్ స్టేట్స్‌కు ధారబోస్తున్నారని..! కేంద్రాన్ని నిలబెడుతున్నదే సౌత్ స్టేట్స్ టాక్స్ రెవిన్యూలో..! అలాంటప్పుడు ‘బాగా పనిచేసే’ రాష్ట్రాలకు, ఆర్థిక వెన్నెముకగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రంలో ఎక్కువ ప్రాతినిధ్యం ఎందుకు ఉండకూడదు..? ఇలా చేస్తేనే కదా అన్ని రాష్ట్రాలూ పోటీలుపడి పనిచేసేది..? ఇదీ స్థూలంగా రేవంత్ రెడ్డి హైబ్రీడ్ మోడల్ డీలిమిటేషన్ ప్రతిపాదన… పనితనానికి ఓ ప్రేరణ…

  • అదెలా అంటే..? ప్రస్తుత సీట్లు 543… 50 శాతం ప్రొరేటాతో పెంచితే పెరిగేవి 272 (అసలు ఎంపీ సీట్లు ఎందుకు పెరగాలనేది మరో ప్రశ్న)… ఈ 272 సీట్లలో సగం అంటే 136 కేంద్రం చెబుతున్న ప్రొరేటా ప్రకారం, అన్ని రాష్ట్రాల్లోనూ పెంచాలి… మరో 136 స్థానాల్ని మాత్రం ఆయా రాష్ట్రాల జీఎస్డీపీ (స్థూల ఉత్పత్తి) ప్రకారం పెంచాలి… ఇదీ ఆ మోడల్… దీనివల్ల ‘పనిచేసే’ రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కినట్టు, బీమారు రాష్ట్రాలకు ఓ హెచ్చరిక…

కానీ ప్రజాప్రాతినిధ్యం అంటేనే జనాభా ఆధారంగా ప్రాతినిధ్యం కదా… రాజ్యాంగం చెబుతున్నదీ అదే కదా… మళ్లీ ఈ జీఎస్డీపీ ప్రాతిపదిక ఏమిటనే ప్రశ్న కొందరు లేవనెత్తుతారు… కానీ అవసరాన్ని బట్టి మారేదే కదా ఆదర్శ విధానం… తప్పేముంది..? పైగా ఇప్పుడు జనాభాను బట్టి ప్రాతినిధ్యం అనేది ఎలాగూ అమల్లో లేదు, ఇది రియాలిటీ… ఆ సమతూకం ఏమీలేదు…

ఉదాహరణకు… తెలంగాణలోని మల్కాజ్‌గిరి... 2024 ఎన్నికల గణాంకాల ప్రకారం ఇక్కడ సుమారు 31.5 లక్షల మంది ఓటర్లు… దేశంలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గం… కానీ లక్షద్వీప్..? ఇక్కడ ఓటర్ల సంఖ్య చాలా తక్కువ, సుమారు 57,000 నుండి 58,000 మధ్య ఉంటుంది… మరిక జనాభాను బట్టి ప్రాతినిధ్యంలో బ్యాలెన్స్, సరైన రేషియో ఏమీ లేనట్టే కదా… జనాభా ఎక్కువ లేకపోయినా ఈశాన్య రాష్ట్రాలకు ఎంపీ సీట్లు ఇచ్చారు అప్పట్లో… ప్రాతినిధ్యం ఉండాలని..!

ఓ చిన్న ఉదాహరణ… ఉత్తరప్రదేశ్ సీట్లు 80… సగం పెంచితే 120… సో, ఇప్పటిలాగే ఎవరు యూపీని గెలుస్తాడో, కేంద్రాన్ని కూడా గెలుస్తాడన్నట్టే కదా… మరిక డీలిమిటేషన్‌తో జరిగే న్యాయం ఏమున్నట్టు..? అదే నార్త్ ఆధిపత్యమే కదా… ఇంకా చెప్పుకుందాం…

2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కో నియోజకవర్గానికి సగటున సుమారు 22 లక్షల మంది జనాభా వస్తారు… కానీ రాష్ట్రాల వారీగా ఈ సగటులో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి…



రాష్ట్రం  నియోజకవర్గ సగటు)
రాజస్థాన్ ~27.4 లక్షలు
బీహార్ ~26.0 లక్షలు
ఉత్తర ప్రదేశ్         ~25.0 లక్షలు
మధ్యప్రదేశ్ ~25.0 లక్షలు
హర్యానా ~25.3 లక్షలు
తెలంగాణ ~20.6 లక్షలు
ఆంధ్రప్రదేశ్ ~19.8 లక్షలు
తమిళనాడు ~18.5 లక్షలు
కేరళ ~16.7 లక్షలు


  • విస్తీర్ణం పరంగా… లడఖ్ అతిపెద్ద నియోజకవర్గం కాగా, ఢిల్లీలోని చాందీ చౌక్ అతిచిన్న నియోజకవర్గం… డీలిమిటేషన్‌లో ఆర్థిక వృద్ధిని ప్రాతిపదికగా తీసుకోవాలంటే ఆర్టికల్ 81, 82లకు భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది…

డీలిమిటేషన్

  • ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… సగటున ఒక సీటుకు ఇంత జనాభా ఉండాలనే ఓ నిర్ణీత ప్రాతిపదిక ఎలాగూ లేదు… సో, ప్రొరేటా ప్రకారం 50 శాతం పెంచినా ఈ ‘సమతూక రాహిత్యం’ కొనసాగించడమే అవుతుంది కదా…

ప్రస్తుత పరిస్థితుల్లో పదీఇరవై సీట్లు కూడా కేంద్ర ప్రభుత్వ మనుగడను ప్రభావితం చేస్తున్నాయి… ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ మనుగడ టీడీపీ, జేడీయూ మీద ఆధారపడిన తీరే ఉదాహరణ… అలాంటప్పుడు ఇప్పటికే నార్తరన్ స్టేట్స్ సీట్లు ఎక్కువ… 50 శాతం పెరిగితే… సౌత్‌తో తేడా అంతే పెరిగి, సంఖ్యాపరంగా నార్త్ డామినేషన్ మరింత పెరిగే ప్రమాదం ఉంది కదా…

  • అందుకని రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన అవసరం… మరిన్ని ప్రతిపాదనలు కూడా స్వీకరించి, తన డీలిమిటేషన్ ప్రాతిపదకల్ని మార్చుకుంటే అది దేశానికే హితం..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వైభవ్..! ఈ పేరంటేనే ఓ సంచలనం..! నడిసంద్రంలో కూడా..!!
  • శాంతి ఒప్పందం- యుద్ధవిరమణ… నో, మూడు దేశాల దోబూచులాట…
  • దివాళా అంచున దేశం… ఆ దిక్కుతోచని సర్కారు ఏం చేసింది…
  • మన పెట్రో బిల్లును ఎథనాల్ తగ్గించగలదా..? ఏమేం ప్రయోజనాలు..?!
  • రాజా రమేష్… సినిమా కథగా ఓ నిజ జీవిత థ్రిల్లర్… కానీ..?
  • పునర్జన్మ… మీరు నమ్మరా… పోనీ, ఈ రియల్ స్టోరీ ఓసారి చదవండి…
  • ఆకలి కడుపులకు అన్నపూర్ణ..! నచ్చిన రేవంత్ మరో పథకం..!!
  • CM Ramesh … అద్భుత వశీకరణ శక్తిమంతుడు… జై పాతాళ భైరవీ…
  • NCPI … త్రిపురలోని ఓ విఫల పార్టీ హఠాత్తుగా జాతీయ తెరపై… ‘షా’లిటిక్స్..!!
  • ఎవరి ఊహకూ అందలేదు ..! బెంగాల్ రాజకీయాల్లో ‘మోటా భాయ్’ మాస్టర్ స్ట్రోక్ ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions