.
కథా నేపథ్యం …. 90వ దశకం, గోదావరి జిల్లాల పల్లెటూరి వాతావరణం. ప్రతాప్ (తిరువీర్) , సత్య (పాయల్ రాధాకృష్ణ) చిన్నప్పటి నుంచి ప్రేమించుకుని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకున్న సమయంలో, మూడు రోజుల శోభనం ముచ్చట ముగిశాక, సత్య అకస్మాత్తుగా ఊరి పంచాయితీ పెడుతుంది…
“నేను నా భర్తతో కలిసి ఉండలేను” అని పుట్టింటికి వెళ్ళిపోతుంది… అసలు ప్రతాప్ సమస్య ఏంటి? అది అంత పెద్ద సమస్యనా? సత్య ఎందుకు అంత మొండిగా వ్యవహరించింది? అనేదే మిగతా కథ…. అసలు అది విషమ సమస్యేనా…? ఎవడ్రా ఈ కథ రాసింది, తీసింది అని ప్రేక్షకుడు అనుకుని, కోపంగా థియేటర్ బయటికొస్తాడు… అదీ అసలు కథ…
Ads
ఎక్కడ తప్పింది?
1. బలహీనమైన పాయింట్ – సాగతీత స్క్రీన్ ప్లే…: పేపర్ మీద రాసుకున్నప్పుడు “స్లీపింగ్ డిజాస్టర్” (నిద్రలో వింత ప్రవర్తన) అనే పాయింట్ కొత్తగా అనిపించవచ్చు… కానీ, దానిని రెండున్నర గంటల సినిమాగా మలచడంలో దర్శకుడు దుర్గా నరేష్ తడబడ్డాడు… తారు రోడ్డు మీద ఎద్దుల బండి వెళ్ళినట్టు సినిమా నడక చాలా నెమ్మదిగా సాగుతుంది…
2. ఎస్టాబ్లిష్‌మెంట్‌లో లోపం…: హీరోయిన్ అంత పెద్ద రభస చేసి వెళ్ళిపోయినప్పుడు, ప్రేక్షకులు ఆ సమస్యలో తీవ్రతను వెతకడం సహజం… కానీ ఇంటర్వెల్‌లో రివీల్ అయ్యే ఆ సమస్య, “దీనికేనా ఇంత రచ్చ?” అనిపించేలా ఉంది… పరిష్కరించుకోగలిగే చిన్న లోపాన్ని భూతద్దంలో చూపించడం వల్ల ప్రేక్షకులు కథతో కనెక్ట్ కాలేకపోయారు…
3. పాత్రల ఎంపిక – మిస్ మ్యాచ్…: తన పాత్రకి న్యాయం చేశాడు… అమాయకత్వంతో కూడిన భర్తగా, సమస్యతో సతమతమయ్యే వ్యక్తిగా తిరువీర్ నటన బాగుంది… కాదు, బాగానే ఉంది, పర్లేదు…
-
రాశి & అజయ్ ఘోష్…: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశికి, అజయ్ ఘోష్ జోడీగా ఉండటం “మటన్ కర్రీలో పాయసం” కలిపిన చందంగా ఉంది… నిజానికి ఏదో ప్రెస్‌మీట్‌లో రాశి చెప్పినట్టు.. ఆమె కూడా “అజయ్ అంటే ఆ పొడుగు అజయ్ (విలన్ అజయ్) అనుకున్నదట, తీరా సెట్స్‌కి వెళ్తే అజయ్ ఘోష్ అని తెలిసి షాక్ అయ్యిందట”… ప్రేక్షకులకు కూడా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది… అజయ్ ఘోష్ నటన బాగున్నా, ఆ పాత్రకు ఆయన ‘రాంగ్ ఛాయిస్’ అనిపిస్తాడు… సాయి కుమార్ లాంటి నటులు ఉంటే ఆ తండ్రి పాత్రకు మరింత హుందాతనం వచ్చేదేమో…
-
పాయల్ రాధాకృష్ణ…: టీచర్ పాత్రలో ఉండి కూడా అంత అపరిపక్వంగా (Immature) ప్రవర్తించడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది… ఆమె పాత్రలో ఎమోషన్ కన్నా ‘నస’ ఎక్కువగా అనిపిస్తుంది…
-
గోపరాజు రమణ…: ఒక గౌరవప్రదమైన నటుడిని షకీలా ఫ్యాన్‌గా చూపించడం వింతగా, ఇబ్బందికరంగా ఉంది… దర్శకుడా, నీకో దండంరా బాబూ…
చివరి మాట: ‘పాపం ప్రతాప్’ కోసం హీరో తిరువీర్ పడ్డ కష్టం ప్రమోషన్లలో కనిపించింది కానీ, అదే శ్రద్ధ స్క్రిప్ట్ మీద పెట్టి ఉంటే ఫలితం వేరేలా ఉండేది… సినిమా చూశాక “పాపం ప్రతాప్” కన్నా “పాపం చూసిన ప్రేక్షకులు” అని ఎక్కువ మంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది… మీకు చాలా ఓపిక, బోలెడంత తీరిక ఉంటేనే ఈ గోదావరి ప్రయాణానికి సిద్ధపడండి!
Share this Article