తన కుటుంబమే… బోలెడు మంది హీరోలు ఉండాలి… డిస్ట్రిబ్యూషన్ తన సిండికేటే… నిర్మాతల్లో పెద్ద మనిషి… డిజిటల్ దందాలో తనే… త్వరలో ఓ స్టూడియో… పైగా ఆహా అనే నవతరం ఓటీటీ… అంటే, తెలుగు సినిమాకు సంబంధించి అంతా తనే కావాలనే తాపత్రయం, ఆశ, ఆకాంక్ష, ప్రయత్నం… అప్పట్లో బావ పార్టీ పెడితే టికెట్ల అమ్మకం, సారీ, పంపిణీ దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాలన్నీ తనవే… మంచిదే… ఈరోజుల్లో ఇవేమీ తప్పేమీ కావు… కానీ చివరకు ఏటీటీలో కూడా తనదే పెత్తనం ఉండాలి అంటున్నాడు అల్లు అరవిందుడు ప్లస్ ఆయన బ్యాచ్… ఇదే ఇప్పుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది కృష్ణానగర్ అయిపోయింది… విషయం ఏమిటంటే..?
థియేటర్ల పని అయిపోయింది… అది అందరికీ తెలుసు… అసలే గాలిలో దీపంలా ఉన్న థియేటర్ ఎగ్జిబిషన్ కరోనా దెబ్బకు కుదేలైపోయింది… హైదరాబాదులోనే ఆరేడు థియేటర్లు షట్టర్లు ఇక క్లోజ్ చేసినట్టే అంటున్నారు… ఇష్టారాజ్యం రేట్లు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ రేట్లు… నిండా దోపిడీ… ఈ స్థితిలో డిజిటల్ ఎగ్జిబిషనే శరణ్యం… ఒకటి ఓటీటీ… కానీ ఆహా అని ఒక ఓటీటీ స్టార్ట్ చేసినా… పెట్టేది ఎక్కువ, దక్కేది తక్కువ… అల్లు వంటి రియల్ వ్యాపారి దాంతో ఎలా ఊరుకోగలడు…
Ads
తన కన్ను ఏటీటీపై పడింది… అంటే పే అండ్ వాచ్ పద్ధతి… ఫలానా సినిమా కావాలంటే, వాళ్లు చెప్పిన రేటు డిజిటల్ పద్ధతిలో పే చేసేసి, సినిమా చూసేయడమే… మనం చూశాం కదా శ్రేయాస్ ఏటీటీ వాళ్లు రాంగోపాల్ వర్మ సినిమాల్ని ఎలా ప్రమోట్ చేశారో… ఇప్పుడు అదీ నాకే కావాలీ అంటున్నాడు అల్లు… అంటే అదీ తమరికే కావాలా అల్లు వారూ….
ఇంకా నయం, అన్ని రకాల క్రాఫ్ట్స్‌లో కూడా అల్లు కంపెనీ అని స్టార్ట్ చేసి, వాటిల్లోనూ వేళ్లు కాళ్లు పెట్టలేదు సంతోషం… కానీ సినిమా డిస్ట్రిబ్యూషన్ అనే కోణంలో తనే అల్టిమేట్ కావాలనుకోవడంలోనే వస్తోంది సమస్య… తాజా ఇండస్ట్రీ టాక్ ఏమిటంటే..? అల్లు వారు శ్రేయాస్ వాళ్లనూ వదలడం లేదు అని… అడ్డికి పావుశేరు అనే పదం విన్నారు కదా… అంటే అయిదుకోట్ల షేర్లను ఏ యాభై లక్షలకో అడగడం… అలాగే అడిగారుట, వాళ్లు షాక్ తిని, తరువాత మర్యాదగా తిరస్కరించారట… కాస్త ఎక్కువ మర్యాదగానే…
దాంతో అలిగిన అల్లు… తన బ్యాచ్‌తో ఫ్రైడే మూవీస్ అని సేమ్ శ్రేయాస్ తరహాలోనే ఒక ఏటీటీ స్టార్ట్ చేయనున్నట్టు ప్రచారంలోకి తీసుకొచ్చాడుట… అల్లు బ్యాచ్ అంటే తెలుసు కదా… డైరెక్టర్లు మారుతి, త్రివిక్రమ్, నిర్మాత వంటి కేరక్టర్ బన్నీ వాసు తదితరులు అన్నమాట… ఫ్రైడే మూవీస్ అలియాస్ ఎఫ్ఎం అని మస్తు ప్రచారంలోకి తీసుకొచ్చారు… చివరకు సుకుమార్ కూడా ఇందులో భాగస్వామి అనే ప్రచారం వ్యాపించింది…
ఈ దెబ్బతో షాక్ తిన్న శ్రేయాస్ వాళ్లు, వామ్మో, అల్లు మార్క్ దోస్తానా ఇలా ఉంటుందా అనుకుని రియలైైజ్ అయిపోయి, అరెరె, పొరపాటున ట్రేడ్ సీక్రెట్స్ అన్నీ వాళ్లతో షేర్ చేసుకున్నామే అని నాలుక కర్చుకుని, ఇక కాస్త తమ ఏటీటీలోనే కొత్త డిజిటల్ మార్పులు చేసుకుని, పోటీకి మేం కూడా రెడీ అనే సందేశం ఇచ్చారట,.. ఇక్కడ ప్రశ్న… అల్లు మార్క్ ట్రేడింగ్ సరళి కాదు, ఏటీటీల పోటీ కాదు… అసలు అల్లు అరవింద్ తెలుగు సినిమాకు సంబంధించి ఏదీ వదిలిపెట్టడా..? మొత్తం తన గుప్పిట్లోనే ఉండాలా..? పోనీ, అదే కావాలనుకుంటే… ఫెయిర్ గేమ్ ఆడొచ్చుగా…!!
Share this Article