Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…

May 1, 2026 by M S R

.

మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … హెల్త్ ఇన్సూరెన్స్ కేసా? చెయ్ ఖాళీ లేదు…పక్కకు పోండి! ఈమధ్య కష్టాలు నాకు చెప్పే వస్తున్నాయి. చెప్పి వచ్చినా, చెప్పకుండా వచ్చినా పెద్ద తేడా ఏమీ ఉండట్లేదు కాబట్టి పట్టించుకోవడం మానేశాను. మరీ డొంకతిరుగుడుగా కాకుండా నేరుగా విషయంలోకి వస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ల మీద నాకు మొదటినుండి సకారణమైన ద్వేషం ఉంది. జీవిత బీమామీద లేదని కాదు. అది ప్రస్తుతానికి అనవసరం. క్రమాలంకారంలో ఒక్కో ఇన్సూరెన్స్ విషాద గాథను, అవమాన పర్వాన్ని, ఇన్సూరెన్స్ దోపిడీని చెప్తాను. వినండి.

మా మీడియా కంపెనీ కెమెరాలు, లైవ్ కవరేజ్, ఈవెంట్స్ షూటింగ్ వ్యాపారంలో ఉంది. ఇరవై ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చూశాము. నమ్మినవారు నిండా ముంచినప్పుడు ఏడ్చి మొహం కడుక్కుని…మళ్ళీ రెండో రోజు పనుల్లో పడ్డాము. ఆఫీసులో ఇరవై నాలుగుగంటలూ నమ్మకంగా ఉండి వెన్నుపోటు పొడిస్తే…వెన్నుపూసకు వెన్నపూస పూసి…మూడో రోజు ముక్కలైన గుండెకు ఫెవికాల్ అతికించుకుని బరువెక్కిన గుండెతో పనుల్లో పడ్డాము.

Ads

చెప్పుకుంటే సిగ్గు చేటయిన ఎన్నో అవమానాలు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళను దిగమింగుకుని రేపటిమీద ఆశతో మమ్మల్ను మేము నిలదొక్కుకుంటూ వస్తున్నాం. ఒక్క ఇన్సూరెన్స్ అవమానాలను రాయడానికి మాత్రం నేను చదివిన మూడు పిజి ల చదువు, జర్నలిజం అనుభవం చాలడం లేదు.

నల్గొండ జిల్లాలో ఒక పబ్లిక్ మీటింగ్. ప్రభుత్వం తరపున లైవ్ కవరేజ్ చేయడానికి ఒక టెంపో, ఒక ఇన్నోవా, ఒక డిసిఎం మూడు వాహనాల్లో దాదాపు ఇరవై మందిమి వెళ్ళాము. ఉద్యమకారులకు మాలో ప్రభుత్వం కనపడింది. మా ఇన్నోవాను రాళ్లతో కొట్టి, పచ్చడి చేసి, మమ్మల్ను ప్రాణాలతో వదిలేశారు. నిజానికి సిబ్బందిలో ఎవరికీ ఏమీ కానందుకు ఊపిరి పీల్చుకున్నాము. పోలీసులకు ఫిర్యాదు, వెహికిల్ ఇన్సూరెన్స్ వారికి సమాచారం ఇచ్చాము.

రెండ్రోజులు ఆ బండిని అక్కడే ఉంచాలన్నారు. సర్వేయర్ వచ్చి సాగర సంగమంలో పిల్ల ఫోటోగ్రాఫర్ లా వివిధ భంగిమల్లో ఫోటోలు తీసుకున్నాడు. ఆరు లక్షల రిపేర్ అయితే గానీ బండి రోడ్డు మీద నడవదు. అతి కష్టం మీద, అడుక్కోగా అడుక్కోగా ఒకటిన్నర లక్ష ముష్టి విదిల్చారు. మిగతాది చేతినుండి పెట్టుకుని…ఆ ఇన్సూరెన్స్ ను కాదని మరో ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకున్నాను.

మళ్ళీ ఇంకో ప్రమాదంలో ముందు అద్దం పగిలిపోయింది. సర్వీస్ సెంటర్ కు పంపండి. ఇన్సూరెన్స్ వస్తుంది. కొత్త గ్లాసు వేయించుకోవచ్చు- అంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్లు నమ్మి పంపాను. తీరా గ్లాసు మార్చాక ఇన్సూరెన్స్ రాదన్నాడు. ఎందుకు రాదో లీగల్ గా, టిక్నికల్ గా, లిటరల్ గా, లాజికల్ గా చక్కటి తెలుగు, ఇంగ్లిష్, హిందీలో వివరించాడు. వాడిని, వాడి కంపెనీని శపించి…మళ్ళీ ఇంకో కంపెనీ పాలసీ తీసుకున్నా.

కోటా అన్నట్లు నేమ్స్ చేంజ్డ్. అనుభవం సేమ్. రిపీటింగ్. ఇదో అంతులేని కథ. భారతీయ రవాణా చట్టాల ప్రకారం వెహికిల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాబట్టి తీసుకోవడమే కానీ…ఆపదలో అది ఆదుకున్నది లేదు. ఏటా కనీసం పది, పన్నెండు వాహనాలు. వాటి ప్రీమియంలు లక్షల్లో కడుతుంటాం. క్లెయిమ్ చేయబోతే కట్టిన ప్రీమియం అంత కూడా రావట్లేదు. పైగా అడుగడుగునా అవమానం.

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. హెల్త్ ఇన్సూరెన్స్. నాకు, నా భార్యకు, మా అబ్బాయికి దాదాపుగా ఇరవై ఏళ్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఎంత ఖర్చయినా క్లెయిమ్ చేసుకొదగ్గవి అని కట్టినప్పుడు అనుకున్నాం- పాలసీ అమ్మిన ఏజెంటు మాటలను బట్టి. అవన్నీ నీటిమూటలే అని వరుసగా రుజువయ్యాయి.

కిడ్నీలో రాయి అవమానం … మా అబ్బాయి లండన్ లో చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. అతిశీతల ప్రాంతం కావడంతో నీళ్ళు తక్కువ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు పడ్డాయి. ఇంటి దగ్గరే ఒక పేరు మోసిన ఆసుపత్రిలో సర్జరీ చేయించాము. రెండు లక్షల బిల్లు. అనేక సంప్రదింపులు, అడుక్కోవడాల తరువాత లక్ష విదిల్చారు. అయితే ఈలోపు అంతులేని జ్ఞాన వైరాగ్యాలు కలిగించారు. మాములుగా కౌంటర్లో బిల్లు కడితే గంటలో డిస్ ఛార్జ్ అవుతాము. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఒకరోజు పడుతుందని అప్పుడే తెలిసింది. ఈ కంపెనీ బాగాలేదని మరో ఇన్సూరెన్స్ కంపెనీకి మారాను.

చెవిటి అవమానం … నా కుడి చెవి వినపడ్డం మానేసింది. ఇంకా పేరుమోసిన ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ కథ మళ్ళీ సేమ్ టు సేమ్. ఆసుపత్రివాడు మొదటి ఎస్టిమేషన్లో లేనిది చేర్చాడని ఇన్సూరెన్స్ వాడు…ఇన్సూరెన్స్ వాడు మొత్తం ఒప్పుకుని ఇప్పుడు ఇంతే ఇచ్చాడని ఆసుపత్రివాడు కాసేపు సుహృద్భావ వాతావరణంలో ఈ మెయిల్స్ లో పరస్పరం నిందించుకున్నారు. మరికాసేపు అక్కడే ఉంటే నా ఎడమ చెవి కూడా వినపడదని గ్రహించినవాడైన మా అబ్బాయి మిగతా బిల్లు చేతినుండి కట్టి వెనక్కు తిరిగిచూడకుండా వచ్చేశాము.

వెన్నుపోటు అవమానం … నా భార్య వెన్నెముకకు ఏదో ప్రమాదం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీ అప్రూవల్ తో ఆసుపత్రికి వెళ్ళాము. సర్జరీ జరిగింది. మళ్ళీ సేమ్ టు సేమ్ స్టోరీ. ఈసారి ఇంకా ఘోరమైన అవమానం. హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా సర్జరీలు చేయించుకుంటున్నవారిని, బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నవారిని అక్కడ కౌంటర్లో అంటరానివాళ్ళలాగా చూస్తున్నారు. కనీసం కన్నెత్తి చూడరు. కూర్చోమనరు. కాగితాలు ముందు పడేసి కనుసైగలతో ఛీదరించుకుంటున్నారు.

ఇదేమి మర్యాద అని నిలదీస్తే…ఈరోజు డిస్ ఛార్జ్ కుదరదు…సిఈఓ ను కలిసి రండి అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. మిగతా డబ్బు చేతినుండి కడతాము అంటున్నా…ఇన్సూరెన్స్ వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాల్సిన విహిత ధర్మమేదో వారిమీద ఉన్నట్లుగా ఈసడించుకుంటూ కౌంటర్లో నుండి లేచి వెళ్లిపోయారు.

వాడి మొహం మీద తెలుగు భాషలో, మాండలికంలో ఉన్న తిట్లన్నీ తిట్టలేకపోయానే అన్న ఒక్క బాధ, అవమానం, నిరాశ, నిర్వేదం తప్ప హెల్త్ ఇన్సూరెన్స్ అనుభవం మరోలా ఉంటుందని నేనైతే అనుకోలేదు. నాకిలా వరుసగా జరిగిందని లోకంలో అందరికీ ఇలాగే జరిగి ఉంటుందని నేననుకోవడం లేదు. జరగాలని కోరుకోవడం లేదు కూడా.

రోగం రాకూడదు. వచ్చినా కార్పొరేట్ పెద్దాసుపత్రులకు వెళ్ళకూడదు. వెళ్ళినా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పకూడదు. తెలుగులో తొలి జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణగారు వేయిపడగల్లో ఒక మాటంటారు:-
“చేయి చాచి యాచించే వేళ విశ్వరూపుడైనా…వామనుడు కావాల్సిందే”
అని.

ఆసుపత్రులు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విచిత్ర కస్టమర్ ఎనిమీ ప్రవర్తన ద్వారా చెప్పదలుచుకున్న నీతి ఏమిటంటే-
“మీ ధైర్యం కోసం హెల్త్ పాలసీలు తీసుకోండి…కానీ…ప్రాణం పోయేలా ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ జోలికి వెళ్లకుండా…కౌంటర్లో వెంటనే క్యాష్ కట్టి బతికితే బతకండి”-అని.

వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉంది. క్లారిటీ రావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నవాళ్లకే.

అన్నట్లు-
ఇన్సూరెన్స్ కంపెనీల మోసాల మీద ఫిర్యాదు చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది; ఆసుపత్రుల అక్రమాల మీద ఫిర్యాదు చేయడానికి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళ నంబర్లు కావాలని అడుగుతోంది డిస్ ఛార్జ్ అయి కుంటుతూ నడుస్తున్న నా భార్య ఉక్రోషంతో. ఎవరికైనా తెలిస్తే ఇచ్చి పుణ్యం కట్టుకోగలరు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మైండ్ యువర్ ఇన్సూరెన్స్ … ఏ బీమా చూసినా ఏమున్నది, మోసం తప్ప…
  • ఇండిగో ఫ్లయిట్‌లో ఏసీ ఆపేసినట్టు… థియేటర్‌లో కూడా సఫకేషన్…
  • గాయపడిన సింహం ఊరుకుంటుందా..? ప్రేక్షకుడినీ గాయపరుస్తుంది…!!
  • పాకిస్థాన్‌కు దుబయ్ నుంచి మొదలైంది అసలు ‘వ్యతిరేకత’..!
  • భేష్ లోకేష్… కార్పొరేట్ దోపిడీ బడులను దాటి… నిల‘బడి’…
  • సో, మంగ్లీ తమ్ముడికీ మైక్రో ఫైనాన్స్‌ లావాదేవీలతో లింక్స్..!
  • కత్తి మీ చేతుల్లోనే ఉంది కిషన్ సాబ్… యుద్ధమే మీకు ఇష్టం లేదు…
  • బెంగాల్ రిజల్ట్..! యాక్సిస్‌తోపాటు సట్టాబజార్ కూడా హేండ్సప్..!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • సుడిగాలి సుధీర్… తనను రేయ్, రా, థూ అనడం సమంజసమేనా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions