మేనరికం పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు దృష్టి! రాధికా ఆప్టే వివాదం నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు.. అసలు ప్రమాదం ఏమిటి?
మామ-మేనకోడలు, బావ-మరదళ్ల పెళ్లిళ్లు.. దక్షిణాదిలో తరతరాలుగా వస్తున్న ఆచారాలు. వీటిపై నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు, కీర్తి సురేశ్ ఇచ్చిన వివరణతో ఇటీవల ఈ అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. అయితే ఇది కేవలం ప్రాంతీయ సంస్కృతికి సంబంధించిన చర్చ మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన అంశం కూడా! ఇప్పుడు మేనరికం వివాహాల వల్ల తలెత్తే జన్యుపరమైన సమస్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టి సారించింది. అసలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లిందెవరు? ఎందుకు తీసుకెళ్లారు?
Ads
ఓ యువ న్యాయ విద్యార్థిని.. ఒక వ్యక్తిగత అనుభవం! బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో చదువుతున్న 20 ఏళ్ల న్యాయ విద్యార్థిని చార్వి ఎస్. సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఆమెకు 40 శాతం దృష్టి లోపం ఉంది. ఆమె తల్లిదండ్రులు దగ్గరి రక్త సంబంధీకులు. తమ రెడ్డి సామాజిక వర్గంలో తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఆమె తల్లిదండ్రులు మేనరికం వివాహం చేసుకున్నారు.

అయితే చార్వి పుట్టుకతోనే కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. కోన్ డిస్ట్రోఫీ (Cone Dystrophy) అనే జన్యుపరమైన కంటి వ్యాధితోపాటు, కళ్ల కదలికల్లో నియంత్రణ లేకపోవడం, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులు ఆమె రోజువారీ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. తల్లిదండ్రుల మధ్య రక్త సంబంధం వల్ల ఇలాంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలపై ఆమె వైద్య అధ్యయనాలను పరిశీలించింది.
తనకు ఎదురైన అనుభవం మరొకరికి ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో ఈ అంశాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లింది. మేనరికం వివాహాలను అనుమతించే చట్టంలోని నిబంధనలను పునఃపరిశీలించాలని, అవసరమైతే వాటిపై ఆంక్షలు విధించాలని, కనీసం ప్రజల్లో శాస్త్రీయ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
చట్టంలో ఏముంది? మేనరికం పెళ్లిళ్లకు ఎలా అనుమతి? 1955 నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5లో కొన్ని దగ్గరి రక్త సంబంధీకుల మధ్య వివాహాలను నిషేధించారు. అయితే ఆ చట్టంలోనే ఒక మినహాయింపు ఉంది. సంబంధిత కుటుంబాలు లేదా సామాజిక వర్గాల్లో దీర్ఘకాలంగా వస్తున్న ఆచారం అలాంటి వివాహాలను అనుమతిస్తే, ఆ మినహాయింపు వర్తిస్తుంది.
అంటే సాధారణంగా నిషేధిత సంబంధాలుగా పరిగణించే కొన్ని బంధుత్వాల్లోనూ సంప్రదాయాల ఆధారంగా పెళ్లిళ్లు చేసుకునేందుకు చట్టం అవకాశం కల్పిస్తోంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లోనూ ఇలాంటి మినహాయింపు ఉంది. ఈ నిబంధనలనే చార్వి సవాలు చేసింది. సంప్రదాయం పేరుతో జన్యుపరమైన ఆరోగ్య ప్రమాదాలను పట్టించుకోకుండా ఉండటం సరికాదని, భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వాదించింది.
సుప్రీంకోర్టు ఏమన్నది? ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది.
వివాహ ఆచారాలను నియంత్రించడం, వాటిపై కొత్త చట్టాలు తీసుకురావడం పార్లమెంటు పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ప్రభుత్వానికి చట్టం చేయాలని ఆదేశించలేమని తెలిపింది. అయితే ఈ అంశంలోని ఆరోగ్యపరమైన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పరిమిత ప్రయోజనంతో నోటీసులు జారీ చేసింది.
పాఠశాలలు, కళాశాలల పాఠ్యాంశాల్లో రక్త సంబంధీకుల మధ్య వివాహాల వల్ల కలిగే జన్యుపరమైన సమస్యలపై అవగాహన కల్పించాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీల ద్వారా ప్రచారం నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలించాలని పేర్కొంది.
జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమే అయినప్పటికీ, అందుకు సంబంధించిన ఆరోగ్యపరమైన పరిణామాలపై అవగాహనతో నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. సుప్రీంకోర్టు మేనరికం వివాహాలను నిషేధించలేదు. వాటిని నేరంగా ప్రకటించలేదు. కొత్త చట్టం తీసుకురావాలని కూడా ఆదేశించలేదు. ఈ అంశంపై కేంద్రం ఆలోచించాలని, ప్రజల్లో అవగాహన పెంచే మార్గాలను పరిశీలించాలని మాత్రమే సూచించింది.
అసలు జన్యుపరమైన సమస్యలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దగ్గరి రక్త సంబంధీకుల మధ్య వివాహం జరిగితే పుట్టే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?
మనిషి శరీరంలోని ప్రతి కణంలోనూ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జన్యువులు ఉంటాయి. వీటిలో కొన్ని వ్యాధులకు కారణమయ్యే లోపభూయిష్ట జన్యువులు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఒక వ్యక్తిలో అలాంటి జన్యువు ఉన్నప్పటికీ, మరో ఆరోగ్యకరమైన జన్యువు దాని ప్రభావాన్ని బయటపడకుండా చేయవచ్చు.
కానీ దగ్గరి రక్త సంబంధీకులైన భార్యాభర్తల్లో ఒకే రకమైన లోపభూయిష్ట జన్యువు ఉండే అవకాశం ఎక్కువ. ఇద్దరిలోనూ ఒకే లోపభూయిష్ట జన్యువు ఉంటే, వారి పిల్లలకు ఆ రెండు జన్యువులూ సంక్రమించి వ్యాధి బయటపడే ప్రమాదం పెరుగుతుంది.
దీనినే వైద్య పరిభాషలో రిసెసివ్ జన్యుపరమైన వ్యాధుల ప్రమాదం అంటారు. పుట్టుకతో వచ్చే కొన్ని కంటి వ్యాధులు, వినికిడి లోపాలు, ఇతర వారసత్వ వ్యాధులు, కొన్ని అభివృద్ధి సంబంధిత సమస్యలు ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది.
వైద్య అధ్యయనాల ప్రకారం, దగ్గరి బంధువులు కాని దంపతులతో పోలిస్తే మొదటి వరుస కజిన్స్ (First Cousins) మధ్య వివాహం చేసుకున్న దంపతులకు పుట్టే పిల్లల్లో కొన్ని పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం దాదాపు రెట్టింపు కావచ్చు. అయితే ప్రతి మేనరికం వివాహంలోనూ తప్పనిసరిగా సమస్యలు వస్తాయని కాదు. అలాగే ప్రతి జన్యుపరమైన వ్యాధికీ మేనరికమే కారణమని చెప్పలేం. కుటుంబ జన్యు చరిత్ర, వ్యాధి స్వభావం, ఇతర అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
దేశంలో 11 శాతం.. దక్షిణాదిలో 28 శాతం వరకు! చార్వి తన పిటిషన్‌లో పేర్కొన్న గణాంకాలు కూడా ఈ అంశం తీవ్రతను తెలియజేస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) ఆధారంగా దేశవ్యాప్తంగా సుమారు 11 శాతం వివాహాలు రక్త సంబంధీకుల మధ్య జరుగుతున్నాయని పేర్కొంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్య 23 నుంచి 28 శాతం వరకు ఉందని వివిధ అధ్యయనాలను ఉటంకించింది.
మామ-మేనకోడలు, మేనమామ కూతురు, మేనత్త కొడుకు వంటి సంబంధాల్లో వివాహాలు కొన్ని సామాజిక వర్గాల్లో తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఇవి కేవలం కుటుంబాల మధ్య బంధుత్వాలకే పరిమితం కాకుండా, ఆస్తి, కుటుంబ అనుబంధాలు, సామాజిక ఆచారాలతోనూ ముడిపడి ఉంటాయి.
అందుకే ఈ అంశాన్ని కేవలం ఆచారం మంచిదా, చెడ్డదా అనే కోణంలో చూడలేం. అదే సమయంలో ఆచారం పేరుతో వైద్యపరమైన వాస్తవాలను విస్మరించలేం.
సంప్రదాయమా? ఆరోగ్యమా? నిర్ణయం ఎవరిది? ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఒక్కసారిగా తప్పుబట్టడం ఎంతవరకు సమంజసం? అదే సమయంలో ఆ ఆచారం వల్ల భవిష్యత్తులో పిల్లలకు జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటే, ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది?
మేనరికం వివాహాలను నిషేధించడం ఒక పరిష్కారమా? లేక పెళ్లికి ముందే జన్యుపరమైన కౌన్సెలింగ్, అవసరమైన వైద్య పరీక్షలు, కుటుంబంలో ఉన్న వ్యాధుల చరిత్రపై అవగాహన కల్పించడం మరింత ఆచరణాత్మకమైన మార్గమా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల వివాహ నిర్ణయం మాత్రమే కాదు. వారి నుంచి పుట్టబోయే పిల్లలు ప్లస్ జాతి ఆరోగ్యానికి సంబంధించిన అంశం కూడా..!!
Share this Article