Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ కవితకు సహజమైన ఈ స్థానిక వాడుక భాష అర్థం కాలేదా..?!

November 22, 2026 by M S R

.

ఎవరో పంపించారు ఓ వీడియో ఇంటర్వ్యూ… అది మన తొలివెలుగు చానెల్… ఇంటర్వ్యూ చేస్తున్నది రఘు అనే జర్నలిస్టు.., ఇంటర్వ్యూ ఇస్తున్నది కవిత… ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది, అతను ఏం అడిగాడు అనే అంశాల విశ్లేషణకు పోవడం లేదిక్కడ…

యూట్యూబ్ చానెళ్లు వచ్చాక జర్నలిజం ఎలా చెడిపోయింది, అసలు జర్నలిస్టులు ఎలా ఉండాలో కూడా ఆమె చాలా చెప్పుకొచ్చింది… రఘు మార్క్ జర్నలిజం పోకడల్నీ పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శించింది, దాన్నలాగే అతను ప్రసారం చేశాడు, గుడ్… తప్పులేదు, ఎడిట్ చేయకుండా యథాతథంగా ఉంచేయడమే మంచి ధోరణి…

Ads

ఇంటర్వ్యూ మొదట్లోనే ఆమె యూట్యూబ్ చానెళ్లలో వాడే భాషను విమర్శించసాగింది… నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ నువ్వు, వాడు, వీడు అని మాట్లాడలేదని చెప్పుకొచ్చింది… ఇంటర్వ్యూయర్ కూడా మరీ ఆవేశం, ఆవేదన కలిగిన సందర్భాల్లో ఎప్పుడైనా కాస్త పరుషంగా మాట్లాడతామేమో గానీ మేమెప్పుడూ అమర్యాద, అగౌరవ పదాల్ని వాడటం లేదని ఏదో వివరణ ఇచ్చుకున్నట్టు అనిపించింది…

ఇక్కడ ఓ ప్రధాన విషయం… కవిత అంగీకరించకపోవచ్చు, అంగీకరించాలనీ లేదు, అంగీకరించకపోయినా పర్లేదు… తెలంగాణ వ్యవహారిక భాష తీసుకుందాం… తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు బతుకమ్మ అనిపించుకునే కవితకు తెలియదా..? తెలంగాణలో ఏమని పిలుస్తామో, ఏమని సంబోధిస్తామో… కవిత తండ్రి కేసీయార్‌నైనా సరే, మరో పెద్ద దొర ఎవరైనా సరే, ఓ కూలీ కూడా నువ్వు అనే సంబోధిస్తాడు…

మీరు అనడు, అది తెలంగాణ సహజ, జీవ భాషలో లేదు… మీరు అంటే బహువచనం మాత్రమే, అది గౌరవ వచనం- సంబోధన కాదు… కావచ్చు, ప్రాంతాలవారీగా భాషలో తేడాలుండొచ్చు… చాలాచోట్ల అండీ, మీరు గౌరవం కోసం వాడతారు… కొన్నిచోట్ల నాన్నగారు, తాతగారు అంటారు… కానీ తెలంగాణలో అండీ, గారు, మీరు లేవు కదమ్మా కవితా..? ఇక్కడ కూడా నేను కవిత గారూ అనడం లేదు, అలాగని అమర్యాద కూడా కాదు…

తెలంగాణ కుటుంబంలో నాన్న నాన్నే, నాన్నగారు కాదు… మీరు చెప్పండి నాన్నగారూ అని కాదు… నాయ్నా నువ్వు చెప్పు… బాబాయ్ అంటే చిన్నాయన, కాకా, చిచ్చా… ఇదే తెలంగాణతనం… ఒకప్పుడు తెలుగు పత్రికల్లో కూడా ఓరకమైన పండిత భాష, గ్రాంథిక భాష ఉండేది… కానీ ఈనాడు వచ్చాక వేగంగా వ్యవహారంలోకి వచ్చింది… పేరుకు ముందు శ్రీ, పేరు తరువాత గారు రాయడం అనేదీ మాయమైంది.., కాకపోతే వచ్చారు, విమర్శించారు వంటి గౌరవ వాచకం అలాగే ఇంకా ఉండిపోయింది…

ఎంతటి నేరగాళ్లు, ఎంతటి అక్రమార్కుల గురించి రాసినా సరే ‘ఫలానా మనిషి అనేక అక్రమాలకు పాల్పడ్డారు, అనేక దురాగతాలు చేశారు’ అనే రాస్తున్నారు… దాన్ని యూట్యూబ్, వెబ్ జర్నలిజం వదిలేసింది… ఓ దావూద్ ఇబ్రహీం గురించి రాస్తే వాడు అనే రాస్తారు, తప్పేముంది..? వాడు జగమెరిగిన దేశద్రోహి… సో, వ్యక్తుల్ని బట్టి వాడే భాష మారితే అదేమీ జర్నలిజం గాకుండా పోదు, పోలేదు… అలాగని యూట్యూబుల్లో, వెబ్ జర్నలిజంలో బూతుల్ని, తిట్లను వాడితే మాత్రం ఖచ్చితంగా ఖండనీయం…

ఇదేసమయంలో మరో ప్రశ్న… హుందాగా వ్యవహరించాల్సిన సందర్భాల్లోనూ చిల్లర భాషను, బజారు భాషను వాడుతున్నది ఎవరు..? రాజకీయ నాయకులు కాదా..? పార్టీలకు చెందిన (ప్రత్యేకించి బీఆర్ఎస్) సోషల్ మీడియా స్పాన్సర్డ్ చానెళ్లు, సైట్లు ఎవరెవరినో కెమెరా ముందు పెట్టేసి, తిట్టించి, యథాతథంగా ప్రసారం చేస్తూ, దాన్నే జర్నలిజం అనడం లేదా..? నేనూ బాధితురాలినే అని కవితే బాధపడ్డ సందర్భాలు లేవా…?

ఆమె చెబుతోంది ఆ ఇంటర్వ్యూలో ‘అభిప్రాయం వెల్లడించే హక్కు రాజ్యాంగంలోని 19-1 ఆర్టికల్ చెబుతోంది, కానీ అదే సమయంలో ఆర్టికల్ 19-2 డీసెన్సీ, డెకోరం పరిధిలో హద్దులు, పరిమితులు దాటవద్దనీ చెబుతోంది’ అని చెప్పుకొచ్చింది… కరెక్ట్… వాడుక భాష నేరం కాదు, ఎవరికీ అగౌరవం కాదు… అలాగే పాపులారిటీ వేరు, డీసెన్సీ వేరు అనీ చెప్పింది, అదీ కరెక్టే…

(ఇంటర్వ్యూలోని మిగతా అంశాల ప్రస్తావన ఇక్కడ లేదు, కానీ భాష, సంబోధన అంశం డిబేటబుల్ కాబట్టి, ఆమె విమర్శగా చెబుతున్న పాయింట్లు ఆమె పదే పదే చెప్పుకునే తెలంగాణతనానికి భిన్నంగా వినిపించాయి కాబట్టి ఇదంతా ఓసారి చెప్పుకోవడం, అంతే…)

చివరగా… ఆమెను పరిచయం చేస్తున్నప్పుడు కేసీయార్ కూతురు అని చెప్పడాన్ని తప్పుపట్టింది, అంటే, నాకు కేసీయార్ కూతురిగా తప్ప వేరే ఐడెంటీటీ లేదా, జర్నలిస్టు పురుషాహంకారం కాదా అనడిగింది… అంటే, కేసీయార్ బిడ్డ అని చెప్పుకోవడాన్ని, ఎవరైనా అలా చెప్పడాన్ని ఆమె చిన్నతనంగా భావిస్తోందా..?! నిజమే కదా, కేసీయార్ బిడ్డగానే కదా తన ఐడెంటిటీ ఇన్నేళ్లూ… ఈరోజుకూ కల్వకుంట్ల అనే ఇంటిపేరునే వాడుకోవడం లేదా..? అలా చెబితే తప్పేముంది అందులో..?! అందులో పురుషాహంకారం ఏముంది..? ఓ మాట అడిగింది, కేటీయార్ పరిచయాన్ని కేసీయార్ కొడుకు అని చేస్తారా అని… తప్పేముంది..? తన ఐడెంటీటీ కూడా కేసీయార్ మాత్రమే…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ కవితకు సహజమైన ఈ స్థానిక వాడుక భాష అర్థం కాలేదా..?!
  • ముఖ్యమంత్రి కాదు… మఠాధిపతి కాదు… ఆ అమ్మకు మాత్రం కొడుకే!
  • అడ్డంకులు తొలిగాయి- రేవంత్ కొరడా ఝళిపించాలి ఇక…
  • అయ్యా, న్యాయమూర్తి గారూ… రాజీనామా చేస్తే నేరం రద్దయిపోదు..!!
  • క్రైస్తవ మతప్రచారకుల ఇంట హిందూ వైదిక పెళ్లి తంతు..?!
  • ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా… తెలంగాణ అభివృద్ధి ఆగలేదు, ఆగదు…
  • మోడీ భాయ్ … తమరు డౌన్ వర్డ్ స్పైరల్‌లో పడిపోయారు- జాగ్రత్త !!
  • జియో పాలిటిక్స్! ముందుగా ఇండియా కోణంలో స్టడీ చేయాలి రాహుల్..!!
  • బాలయ్యకు తెలుగు వర్శిటీ పురస్కారం- అసంబద్ధమేనా..?
  • హరీశ్, నీకో నిజం తెలుసా..? పాలిటిక్స్‌లో జో జీతా వోయీ సికిందర్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions