.
Bhavanarayana Thota.... పత్రికమీద సంపాదించిందంతా కేసులకే (నక్కీరన్ గోపాల్ –పార్ట్ 2) ….. వీరప్పన్ గురించి ప్రపంచానికి ఎంతో ఆసక్తికరమైన సమాచారమిచ్చిన నక్కీరన్ గోపాల్ మీద డీఎంకే ప్రభుత్వం మొదటిసారిగా 1997 లో ఒక బాధ్యత పెట్టింది. వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఎనిమిది మంది ఫారెస్ట్ గార్డులను విడిపించాల్సిందిగా కోరింది. గోపాల్ ఒప్పుకున్నా, అతడి అనుమానాలు అతడికున్నాయి. దారిలో తనను అనుసరించి రహస్యంగా పోలీసులు ఆ దారి కనిపెడితే వీరప్పన్ తనను అనుమానించే ప్రమాదముందని నేరుగా ముఖ్యమంత్రికే చెప్పేశాడు.
ఆ పరిసరాల్లో పోలీసుల కదలికలు ఉండబోవని హామీ వచ్చాకే ముందుకు కదిలాడు. ప్రతి చోటా ఆగి, పోలీసులెవరూ ఆ ప్రాంతంలో లేరని నిర్థారించుకున్న మీదటే ముందడుగు వేసేవాడు. మొత్తానికి ఆ ఎనిమిది మంది ఫారెస్ట్ గార్డులను కాపాడటంలో గోపాల్ విజయం సాధించాడు.
Ads
ఆ తరువాత మూడేళ్ళకు 2000 సంవత్సరంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కిడ్నాప్ జరిగింది. అది కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు సవాలుగా మారింది. కిడ్నాప్ జరిగింది కర్ణాటక సరిహద్దుల్లోనే అయినా, వీరప్పన్ ఉన్నది తమిళనాడు సరిహద్దుల్లో కావటంతో తమిళనాడు ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత పడింది. అప్పటికే వీరప్పన్ ను కలుసుకునే మార్గం తెలిసిన గోపాల్ మీద కరుణానిధి ప్రభుత్వం ఈ బాధ్యత మోపింది.
తనకూ, తన మనుషులకూ తగిన రక్షణ కావాలని, దారిలో పోలీసుల కదలికలు కనబడితే మాత్రం అక్కడి నుంచే వెనుదిరుగుతానని చెప్పి మరీ దౌత్యానికి సిద్ధమయ్యాడు. కానీ ఒకటీ రెండు సార్లు కాదు.. నాలుగు సార్లు పోవటం, రావటం.. ప్రభుత్వంతో మంతనాలు, మళ్లీ బయలుదేరటం వరుసగా సాగుతూ వచ్చాయి.
ఏం జరుగుతున్నదో ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సమాచారం లేదు. సున్నితమైన విషయాలు బైటపెడితే దౌత్యానికి ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. వెళ్ళిన ప్రతిసారీ డబ్బు సంచులు ఇచ్చి తాత్కాలికంగా వీరప్పన్ ను సంతృప్తిపరచి చర్చలు కొనసాగిస్తున్నారని పత్రికలు ఊహాగానాలు రాయటం మొదలుపెట్టాయి. అసలేం జరుగుతున్నదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది.
దీంతో మీడియావాళ్ళు నేరుగా గోపాల్ నే అడిగారు. “రాయబారి కావటానికి ముందు ఒక జర్నలిస్టువని మరచిపోకు, మీడియాకు సమాచారం ఇవ్వు” అని గట్టిగా అడిగాక ఒకరోజు చెన్నై ప్రెస్ క్లబ్ లో ‘మీట్ ది ప్రెస్’ ఏర్పాటైంది.
గోపాల్ మీద ప్రశ్నల వర్షం మొదలైంది. కొన్ని విషయాలు ప్రస్తుతానికి చెప్పలేనన్నాడు. ప్రభుత్వం మాట వీరప్పన్ కు చేరవేయటం, వీరప్పన్ మాట ప్రభుత్వానికి చెప్పటం మాత్రమే అప్పటిదాకా జరుగుతూ వస్తోందన్నాడు. ఆ విధంగా తనది కేవలం పోస్ట్ మన్ డ్యూటీ మాత్రమేనని చెప్పాడు.
- అప్పుడు ‘తుగ్లక్’ పత్రిక సంపాదకుడు చో రామస్వామి ( కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కూడా నటించారు. బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపింది. ఆయన అస్వస్థుడైనప్పుడు జయలలిత స్వయంగా వెళ్ళి పరామర్శించారు. ఆయన చనిపోయాక ఆ పత్రికను ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, చార్టర్డ్ అకౌంటెంట్ గురుమూర్తి నడుపుతున్నారు) సెటైర్ వేశారు.
(చో రామస్వామి , ఆయనను పరామర్శిస్తున్న జయలలిత, నెడుమారన్)
- “నువ్వు మామూలు పోస్ట్ మన్ వి కాదు, మనియార్డర్ పోస్ట్ మన్ వి కదా?” అన్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంగణం నవ్వులతో దద్దరిల్లింది. షాక్ అయిన గోపాల్ కూడా నవ్వేశాడు. కానీ అందులో జీవం లేదు. మొహం పాలిపోయింది. మరునాడు పత్రికలన్నీ మనియార్డర్ పోస్ట్ మన్ అనే రాశాయి.
రాజ్ కుమార్ విడుదల కోసం మొదట్లో గోపాల్ బాగానే ప్రయత్నించినా ఒక కొలిక్కి రాలేదు. రెండున్నర నెలల తరువాత పళ నెడుమారన్ ను పంపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ నిర్ణయించారు. (నెడుమారన్ ఒకప్పుడు .. అంటే కామరాజ్ కాలంలో కాంగ్రెస్ నాయకుడే గాని ఆ తరువాత దూరమయ్యారు. శ్రీలంక తమిళుల స్వేచ్చ పేరుతో ఎల్టీటీఈకి పరోక్షంగా దగ్గరయ్యారు. రాజకీయాల సంగతెలా ఉన్నా, మంచి రచయిత. ఆ తరువాత కాలంలో వాళ్ళ కొడుకు అంతర్జాతీయ జర్నలిజంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘పులిట్జర్ ప్రైజ్’ గెలుచుకున్నట్టు చదివిన జ్ఞాపకం).
వీరప్పన్ తో చర్చలు కొలిక్కిరావటానికి నెడుమారన్ బాగానే పనిచేశారు. ఇంకోసారి కర్ణాటక అధికారులను బందీలుగా తీసుకున్నప్పుడు గోపాల్ బృందం వీరప్పన్ లొంగుబాటుకు సిద్ధం చేస్తానని చెప్పింది. వీరప్పన్ కు నమ్మకంపోయింది. ఆ తరువాత ‘నెట్రిక్కణ్’ మణి ని నమ్ముతున్నట్టు చెప్పాడు.
‘నెట్రిక్కణ్’ (త్రినేత్రం – మూడో కన్ను అని అర్థం) కు, నక్కీరన్ కూ మూలం ఒకే కథ కావటం విశేషం. అయితే, నక్కీరన్ గోపాల్ కు బదులు మణిని ఎంపిక చేసుకోవటానికి కారణం అతను కూడా వీరప్పన్ కులస్తుడు (వన్నియర్) కావటం కారణమై ఉండవచ్చునని కూడా చెప్పుకున్నారు. తన లొంగుబాటుకు ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చటంలో గోపాల్ విఫలమయ్యాడన్న కోపం వీరప్పన్ లో పెరుగుతూ వచ్చింది. మొత్తానికి వీరప్పన్ కూ, గోపాల్ కూ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
తమిళనాడులో మళ్ళీ జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక గోపాల్ కు వేధింపులు తప్పలేదు. వీరప్పన్ అనుచరులు ఒక పోలీస్ ఇన్ఫార్మర్ ను చంపితే POTA కింద గోపాల్ ను అరెస్ట్ చేశారు. ఎనిమిది నెలలు జైల్లో గడపాల్సి వచ్చింది. మద్రాస్ హైకోర్టు బెయిల్ ఇవ్వటంతోబాటు ఎలాంటి ఆధారాలూ లేకుండా POTA కేసు పెట్టటాన్ని తప్పుబట్టింది. అలా బెయిల్ రావటం జయలలిత నిరంకుశ పాలనమీద తన తొలి విజయమని గోపాల్ చెప్పుకున్నాడు.
ఒక మహిళా ప్రొఫెసర్ లైంగిక కుంభకోణం మీద తమిళనాడు గవర్నర్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే కథనాలను ప్రచురించిన ఆరోపణలమీద 2018 లో గోపాల్ మరోసారి అరెస్టయ్యాడు. అప్పుడు ఫిర్యాదు చేసింది అప్పటి గవర్నల్ భన్వరి లాల్ పురోహిత్ కార్యాలయం. అయితే, రిమాండ్ చేయాలన్న పోలీసుల కోరికను మేజిస్ట్రేట్ త్రోసిపుచ్చారు. హైకోర్టు కూడా సమర్థించింది. ఇలా ఎప్పటికప్పుడు కేసులు నమోదవుతూ ఉండటం, వాటిని ఎదుర్కోవటం గోపాల్ కి అలవాటైపోయింది.
2004 లో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరప్పన్ చనిపోయినప్పుడు కూడా ఇండియా టుడే, నక్కీరన్ మధ్య ఒక వివాదం నడిచింది. ఈసారి కూడా ఫోటోల మీదనే అయినా, ఏవి నిజమైన ఫోటోలన్నది ఈ వివాదానికి మూలం. వీరప్పన్ చనిపోయినప్పుడు పోలీసుల నుంచి మీడియావాళ్ళు కొన్ని ఫోటోలు సంపాదించారు. అప్పుడు ఇండియా టుడే కొన్ని ఫోటోలు, నక్కీరన్ మరికొన్ని ఫోటోలు ప్రచురించాయి. అటు ఇండియా టుడే, ఇటు నక్కీరన్ తమవే ఒరిజినల్ ఫోటోలు అని చెప్పుకున్నాయి.
ఈ వివాదానికి కారణమేంటంటే వీరప్పన్ దేహం మీద గాయాలు ఈ రెండు సెట్ల ఫోటోలలో వేరుగా ఉన్నాయి. ఇండియా టుడే ఫొటోల్లో వీరప్పన్ నుదుటి మీద తుపాకి కాల్చిన గాయం ఉంది. నక్కీరన్ ఫోటోల్లో అది లేదు. తమ దగ్గర ఉన్నవి వీరప్పన్ చనిపోయిన వెంటనే తీసినవని నక్కీరన్ చెప్పుకుంది. వీరప్పన్ మృతదేహాన్ని తీసుకువచ్చాక తీసిన ఫోటోలని ఇండియాటుడే చెప్పుకుంది.
- దీంతో కొంతకాలంపాటు ఇరుపక్షాలూ ఒకరినొకరు నిందించుకుంటూ వచ్చారు. చివరికి ఆ ఫోటోలకు ఫోరెన్సిక్ పరీక్షలు చేయిస్తే ఇండియా టుడే పబ్లిష్ చేసిన ఫోటోలే కరెక్ట్ అని తేలింది. ఒకసారి పేరొచ్చింది కదా అని సరి చూసుకోకుండానే ఫోటోలు వేయటం సరైన పద్ధతి కాదు అంటూ తమిళ పత్రికలు కూడా నక్కీరన్ గోపాల్ మీద విరుచుకు పడ్డాయి.
అయితే, అతని మీద అక్కసుతోనే అయిగా స్పందించారని మరికొందరు గోపాల్ పక్షాన నిలబడ్డారు. ఒకప్పుడు శివసుబ్రహ్మణ్యం నుంచి ఫోటోలు కొన్నందుకు ప్రెస్ కౌన్సిల్ నుంచి చీవాట్లు తిన్న ఇండియా టుడే .. వీరప్పన్ చావు ఫోటోల విషయంలో నక్కీరన్ మీద పైచేయి సాధించినందుకు ఊరట పొందింది.
2000 సంవత్సరంలో తమిళంలో గోపాల్ రాసిన పుస్తకం ‘యుద్ధం’ ఇప్పటికీ కొత్త తరాలలో స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల పాత్రికేయ వృత్తి జీవితంలో ఆయన మీద 261 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిలో 213 పరువు నష్టం కేసులు. ఆయన తన పత్రికమీద సంపాదించిందంతా కేసుల మీదనే ఖర్చు చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇప్పటికీ జర్నలిజం కాలేజ్ విద్యార్థులు ఆయనను గెస్ట్ గా పిలిచి, జర్నలిస్టులు ఎలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో అడుగుతూ ఉంటారు.
ఇప్పుడు గోపాల్ వయసు 67 సంవత్సరాలు. గోపాల్ అడవికెళ్ళినా, జైల్లో ఉన్నా ముప్పయ్యేళ్ళుగా ఆ పత్రికకు జాయింట్ ఎడిటర్ గా ఉన్న కామరాజ్ నక్కీరన్ పత్రిక ఆత్మను కాపాడుతూ వస్తున్నాడు. వాళ్ళిద్దరి బంధం, కామరాజ్ కు గోపాల్ ఇచ్చిన స్వేచ్ఛ గురించి తమిళ జర్నలిస్టులు తరచూ మాట్లాడుకుంటూనే ఉంటారు. – తోట భావనారాయణ
Share this Article