.
ఈ సినిమాకు దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్… నిజం… ఆయనెవరో తెలియదబ్బా అంటారా..? తరుణ్ భాస్కర్ పేరు విన్నారు కదా… నిజానికి ఈ సినిమాకు కర్త, ఖర్మ, క్రియ అన్నీ తనే అనుకుని సినిమా చూడాలి… మరి తనొక్కడే కదా తెలిసిన మొహం… సరే, నమ్మి థియేటర్ వెళ్తే ఏమిటీ అంటారా..? సూపర్, బంపర్, డూపర్, ఎహె, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కూడా దిగదుడుపు… అదేమిటి మొహాలు అలా పెట్టారు..? మరేమనుకున్నారు… తరుణ్ భాస్కర్ సినిమా..? మజాకానా..?
అసలు ఆ పేరు దగ్గర నుంచే మొదలవుతుంది అద్భుతమైన క్రియేటివిటీ… ఇంతకీ సింహం గాయపడటం ఏమిటీ అంటారా..? మన హీరో ట్రంపు అంక్షల కారణంగా అమెరికా నుంచి డిపోర్టయి వస్తాడు… అసలు తెలుగు హీరోల గొప్పతనాల గురించి ఆ ట్రంపు గాడికి ఏం తెలుసు..? మన హీరో గాడు ఏకంగా ట్రంపు మీదే ప్రతీకారానికి సిద్ధపడతాడు…
Ads
మరి తెలుగు సినిమా హీరో అంటే ఆమాత్రం లేకపోతే ఎలా..? నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇది, సినిమా టైటిల్ ట్యాగ్‌లైన్‌లో కూడా అదే చెప్పాడు దర్శకుడు… అదొక్కటే ఈ సినిమాలో నవ్వించిన అంశం… సరే, అసలే తెలుగు సినిమా, అందులోనూ కామెడీ సినిమా… లాజిక్కులు వెతుకుతారా ఎవరైనా..? వెతికితే ట్రంపు మీదొట్టు, ప్లీజ్ వదిలేయండి…
మన టాలీవుడ్‌లో ఓ చిత్రమైన కేరక్టర్ తగులుతూ ఉంటుంది అప్పుడప్పుడూ… పేరు జేడీ చక్రవర్తి… ఆ అతి భరించలేక అందరూ వదిలేశారు, ఆ అతికే అతి నేర్పగల ఆర్జీవీ కూడా వదిలేశాడు ఎప్పుడో… ఏదో ప్రమోషన్ మీడియా మీట్‌లో చెప్పాడు… ఇంత వేరియేషన్ ఉన్న పాత్ర కమలహాసన్‌కు కూడా దక్కలేదు, నేను లక్కీ, నాకు దక్కింది అని…
పొరపాటున కమలహాసన్ ఇది నమ్మి, సినిమా గనుక చూస్తే… ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే పాపం జేడీని, దర్శకుడిని నిందించకండి… అది కేవలం కమలహాసన్ పరిణతిలోపం అని సరిపెట్టుకొండి ప్లీజ్… ట్రంపు మీద ప్రతీకారం అనేది సిల్లీ పాయింట్ అనుకున్నారా..? నో, తెలుగు హీరోకు అన్నీ సీరియస్ అంశాలే… మొన్నామధ్య వైట్‌హౌజ్ రిపోర్టర్స్ మీట్‌లో ట్రంపు మీద కాల్పులు జరిపినోడికీ ఈ తెలుగు సినిమా హీరోకూ ఏదైనా సంబంధం ఉందేమోనని స్టిల్ ఏదో డౌటనుమానం… కాకపోతే ఈ కథలో ఇరికించలేదు, అంతే తేడా…
పాటలు, బీజీఎం అద్భుతం… వినసొంపుగా, పదికాలాలపాటు నిలబడి ఠారెత్తించగల మెలొడీ… కథకు అడ్డుతగులుతాయి అని ఎవడైనా అంటే వాడు పాపాత్ముడు అని లెక్క… కీడాకోలా తరహా పదాల గారడి, వాక్యాలను విరిచి హీరో ఫన్ చేయడం రొటీన్ అనిపిస్తే అదీ మీ తప్పే… మెదడు పేలిపోతున్నా సరే, మన తెలుగు సినిమాను మనం ఆదరించాలనే ఆదర్శాన్ని మీరు పాటించడం లేదని లెక్క… మీరే తెలుగు టీవీ ప్రోగ్రాముల స్థాయికి అప్‌డేట్ కావడం లేదని లెక్క…
ఫరియా అబ్దుల్లా ఉందంటే ఉంది అనకండి… ఆమె ఉండటమే గొప్ప విషయం… సేమ్, శుభలేఖ సుధాకర్, కృష్ణభగవాన్, హర్షవర్ధన్, విష్ణు… ఇలా చాలా మంది ఉన్నా ఎవరూ పెద్దగా గుర్తుండరు అనకండి… థియేటర్ వదిలేసి పారిపోయి వస్తున్నా సరే వెంటాడతారు… అతిథి పాత్రకు ఎక్కువ, రొటీన్ పాత్రకు తక్కువ శ్రీవిష్ణు… ఫాఫం, ఈమధ్య మరో సినిమాలోనూ ఇలాగే కనిపించినట్టు గుర్తు… ఐనా సరే, సూపర్, తను సినిమాకు కీలకం… భలే నటించాడు, జీవించాడు అని రాసుకుందాం…
పైగా ఈ కథలో మంత్రతంత్రాలు కూడా ఉన్నాయండోయ్… జీతెలుగు సీరియల్స్ తీసిన అనుభవం ఏమైనా ఉందేమో దర్శకుడికి… తెలియదు… పోనీ, త్రినయని సీరియల్ రెగ్యులర్‌గా చూసేవాడేమో బహుశా…
చివరగా… ట్రంపు వల్ల గాయపడిన సింహం ఊరకే ఉండదు… థియేటర్‌కు వచ్చే ప్రేక్షెకుడినీ గాయపరిచి గానీ వదలదు..!! అన్నట్టు… ఇది సినిమా రివ్యూ కాదు, థియేటర్ నుంచి పారిపోయి వచ్చిన ఓ బాధిత ప్రేక్షకుడి బాధ… అసలు మ్యాన్ మేడ్ విపత్తుల నుంచి రక్షించే బాధ్యతను ఈ ప్రభుత్వాలు ఎందుకు తీసుకోకూడదు..!!
ట్రంపు మీద, జేడీ వాన్స్ మీద, పుతిన్ మీద, నెతన్యాహు మీద, జిన్ పింగ్ మీద ఒట్టు... సినిమా చూశాక రాసిన రివ్యూయే ఇది...
Share this Article