Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…

May 8, 2026 by M S R

.

అది 90ల ప్రారంభ కాలం. కోల్‌కతాలో మా పారా (వాడ)లో ఒక విశ్రాంత ఉద్యోగి ఉండేవారు. ఆయనకు తన అభిప్రాయాలను వినే ఓపిక ఉన్నవాళ్లతోనూ, లేనివాళ్లతోనూ పంచుకోవడం అలవాటు. మేం ఆడుకునే క్రికెట్ బాల్ ఆయన ఇంటి తలుపుల దగ్గరకు వెళ్తే చాలు (ఆయన తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచేవారు), మమ్మల్ని గట్టిగా అరిచి తిట్టేవారు. అయితే అది సాధారణమే, పెద్దవాళ్లందరూ తిట్టేవాళ్లే.

కానీ ఆయనలో ఒక ప్రత్యేకత ఉండేది. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లో, రాజకీయాల గురించి బయటకు అంతగా చర్చించుకోని కాలంలోనే, ఆయన తన రాజకీయ అభిప్రాయాలను బాహాటంగా ప్రదర్శించేవారు. బెంగాల్‌లో ‘లెఫ్ట్ ఫ్రంట్’ జూలియస్ సీజర్ లాగా తిరుగులేని ఆధిపత్యంతో, కనుచూపు మేరలో శత్రువు అన్నవాడు లేని కాలంలో, ఆయన గట్టిగా అనేవారు— “బెంగాల్‌కు భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది” అని…

Ads

ఆయన వెనుక మేం జోకులు వేసుకునేవాళ్లం. ఆయనను అలా వదిలేస్తే, వెదురు బద్దలతో కంచె వేసిన ఆ ఫుట్‌పాత్ ప్యాచ్‌లోని “తోట”లో కూడా కమలం పూలను పూయిస్తారని నవ్వుకునేవాళ్లం. అది ఒక రకమైన ఆప్యాయతతో కూడిన అవహేళన. ఎందుకంటే ఆ రోజుల్లో సీపీఎం ఓడిపోతుందని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఊహించడం అంటే… మీ ఇంటి పైకప్పు మీద యూఎఫ్‌ఓ (UFO) దిగిందని, దానిపై రవీనా టాండన్, అక్షయ్ కుమార్ వర్షంలో డాన్స్ చేస్తున్నారని చెప్పడం ఎంత అసంభవమో, ఇదీ అంతే అసంభవం.

కానీ, నేడు ఎక్కడ ఉన్నాం..? 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. 294 స్థానాలకు గాను బీజేపీ 200 పైగా సీట్లు గెలుచుకుని మునుపెన్నడూ లేని భారీ తీర్పును అందుకుంది. జ్యోతి బసు ‘లెఫ్ట్ ఫ్రంట్’కు నిజమైన వారసురాలిగా నిలిచిన మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, ఐదేళ్ల క్రితం 215 సీట్లు సాధించి, ఇప్పుడు కేవలం 80 సీట్లకు పడిపోయింది. 34 ఏళ్ల పాటు అజేయంగా రాష్ట్రాన్ని ఏలిన సీపీఎం ఇప్పుడు సరిగ్గా ఒక్క సీటులో (అవును, కేవలం ఒకటి!). 35 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలన (మొదట ఒరిజినల్ బ్రాండ్, తర్వాత 15 ఏళ్ల నకలు బ్రాండ్) చివరకు ఆ కమలం వికాసంతో ముగిసింది. ఆ యూఎఫ్‌ఓ నిజంగానే ల్యాండ్ అయింది, అది కూడా “టిప్ టిప్ బర్సా” పాట పాడుతూ!

బెంగాల్‌లో ప్రభుత్వాలు ‘కాస్మిక్ టైమ్ స్కేల్’ (అనంత కాలం) మీద నడుస్తాయి. గెలాక్సీలు ఆరిపోయినా ఇక్కడి ప్రభుత్వాలు పడిపోవు. ఇది మార్క్సిస్ట్ ప్లేబుక్ లోని ఒక ప్రత్యేక విద్య. దీన్నే తృణమూల్ కాపీ కొట్టి ఇంకా మెరుగుపరిచింది. దీన్నే ‘ఇన్‌స్టిట్యూషనల్ క్యాప్చర్’ (వ్యవస్థాగత ఆక్రమణ) అంటారు. పార్టీ డీఎన్ఏను అన్ని సంస్థలతో కలిపేయడం. బ్యాంకులు, పోలీసులు, క్రీడా సంస్థలు, సినిమా ప్రొడక్షన్ హౌస్‌లు, కాలేజీలు, యూనియన్లు, పూజా కమిటీలు… అన్నీ పార్టీ విభాగాలే. పార్టీని గద్దె దించడం అంటే అసాధ్యమైన పనిగా మారిపోయింది.

ఒక ప్రభుత్వం మారాలంటే ఒక ‘నంబర్ లాక్’ లోని అన్ని చక్రాలు (tumblers) ఒకేసారి సరైన స్థానంలో పడాలి. ఒక్కటి తప్పినా “సిస్టమ్ లాక్డ్, నాలుగేళ్ల తర్వాత ప్రయత్నించండి” అనే సందేశం వస్తుంది. 2026లో బీజేపీకి ఆ చక్రాలన్నీ సరిగ్గా కుదిరాయి. కేవలం పైపైన కనిపించే విషయాలే కాదు, అన్నీ!

రాజకీయ మార్పు అనేది కేవలం సంక్షేమ పథకాల వల్ల రాదు. తృణమూల్ రూ.1,500 ఇస్తే, బీజేపీ రూ.3,000 ఇస్తామంటుంది. కానీ ఓటరు వెర్రివాడు కాదు. ప్రభుత్వం మారాలంటే రెండు కథనాలు (narratives) ఏకకాలంలో ఉండాలి:

  1. “నేను ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అసహ్యించుకుంటున్నాను?”

  2. “నేను ప్రత్యామ్నాయాన్ని ఎందుకు ఎంచుకోవాలి?”

ప్రత్యామ్నాయం లేకపోతే ప్రజలు ఎంతటి దుర్మార్గాన్నైనా భరిస్తారు. సింగూర్, నందిగ్రామ్ ఘటనల తర్వాత మమతా బెనర్జీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించడం వల్లే లెఫ్ట్ ఫ్రంట్ పతనం సాధ్యమైంది. ఇప్పుడు అదే పరిస్థితి మమతకు ఎదురైంది.

మమతా బెనర్జీ ఒకప్పుడు ఒక ఆశకు చిహ్నం. ఒకప్పుడు నేను కూడా ఆమెకు ఓటు వేశాను. అప్పట్లో ఆమెను ఎవరూ కొనలేరని, బెదిరించలేరని నమ్మేవాళ్లం. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా ఉండే గుణాలు (నిరసనలు, నిబంధనలను ధిక్కరించడం), అధికారంలో ఉన్నప్పుడు శాపాలుగా మారతాయి. ఆమె నిజానికి  ఎప్పటికీ ఒక ప్రతిపక్ష నాయకురాలిగానే ఉండిపోయారు. పరిపాలన వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఎప్పుడూ ఏదో ఒక నిరసన, వెనిజులా నుండి వచ్చిన మావోయిస్టులని, తనను పడగొట్టే కేంద్ర కుట్రలని… ఇలా లేని శత్రువులతో యుద్ధం చేస్తూనే ఉన్నారు.

ఇక అవినీతి. సీపీఎం కాలంలో అవినీతి ఉండేది, కానీ అది పద్ధతిగా క్యాడర్ స్థాయిలో పంచబడేది. కానీ తృణమూల్ ఒక ‘ఐడియాలజికల్ వాక్యూమ్’ (సిద్ధాంతం లేని శూన్యం). ఇది కేవలం మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల వ్యక్తిత్వ ఆరాధన మీద నడుస్తోంది. ఇక్కడ అందరూ దోచుకోవడానికి వచ్చిన వాళ్లే.

బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ (SSC) ఒక గొడ్డలి పెట్టు. 26,000 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారు. మంత్రి పార్థా ఛటర్జీ అనుచరురాలి ఇంట్లో రూ.50 కోట్ల నగదు బయటపడింది. ఇక్కడ బాధితులు మధ్యతరగతి ప్రజలు. ఇది కాకుండా ప్రతి ఇసుక లారీకి, ప్రతి సిమెంట్ బస్తాకు, ప్రతి చేపల లోడుకు టీఎంసీ ‘తోలా’ (Extortion) వసూలు చేసింది. చివరకు బెంగాల్ ప్రజలందరినీ వేటాడే స్థాయికి ఈ వ్యవస్థ చేరుకుంది. అదే భయంతో, వేసవి ఎండలో మూడు గంటల పాటు క్యూలో నిలబడి ప్రజలు ఆమెను ఓడించారు.

బెంగాల్‌లో ప్రభుత్వం మారడం అంటే పురాణాల్లో ‘ఇంద్రపతనం’ లాంటిది. ఇంద్రుడు అనేది ఒక పదవి, అది గర్వంతో కూలిపోతుంది. మమత తనను తాను ఒక గొప్ప కవిగా, పెయింటర్ గా, గాయనిగా మార్చుకున్నారు. ఆమెను ఎగతాళి చేస్తే పోలీసులు గుమ్మం ముందు నిలబడే పరిస్థితి. ఇక ఆమె వారసుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లలో తిరుగుతూ, అధికార గర్వంతో ప్రజలను, పాత తరం నేతలను అవమానించారు. సందేశ్‌ఖాలీ లాంటి చోట్ల షేక్ షాజహాన్ లాంటి వాళ్లు రాజ్యమేలారు.

బెంగాలీలు పుట్టుకతోనే ఉదారవాదులు, సెక్యులర్ వాదులు అనుకోవడం ఒక భ్రమ. బెంగాల్ లోనూ లోతైన మతపరమైన చీలికలు ఉన్నాయి. కమ్యూనిస్టులు భాషను అడ్డుపెట్టి మతాన్ని అణిచిపెట్టారు. కానీ మదర్సాల విద్యావిధానం వేరుగా ఉండేది. మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకు కోసం అక్రమ వలసలను ప్రోత్సహించి, మైనారిటీ బుజ్జగింపును పరాకాష్టకు తీసుకెళ్లారు. ఇది హిందూ ఓట్ల ఏకీకరణకు దారితీసింది.

అయినా బీజేపీకి ఒక సమస్య ఉండేది— ‘ఆహారం’. బెంగాలీ హిందువులకు చేపలు, మాంసం సంస్కృతిలో భాగం. బీజేపీ శాఖాహార సిద్ధాంతం బెంగాలీలకు నచ్చేది కాదు. కానీ ఈసారి బీజేపీ ఆ పొరపాటును దిద్దుకుంది. వాళ్లు ఇంటింటికీ వెళ్లి చేపలతో ప్రచారం చేశారు. కేంద్ర మంత్రులు చేపల పులుసు తింటూ కనిపించారు. “మేము మీ ఆహారపు అలవాట్లను మార్చము” అనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. బంగ్లాదేశ్ హింస (ఆగస్టు 2024) చూశాక, భాష కంటే మతమే రక్షణ అనే భావం ప్రజల్లో బలపడింది.

చివరగా, బీజేపీ సెలబ్రిటీల వెనక పడకుండా, అణచివేతకు గురైన సామాన్య ప్రజలకు టికెట్లు ఇచ్చింది. నంబర్ లాక్ లోని అన్ని చక్రాలు ఒకేసారి సరిగ్గా కుదిరాయి. ఆ రిటైర్డ్ పెద్దాయన చెప్పినట్టే… కోల్‌కతా వీధుల్లో, బెంగాల్ పొలాల్లో ఇప్పుడు కమలం వికసించింది… ఇప్పుడు టిప్ టిప్ బర్సా పానీ… కమలం రేకల మీద…!!



  • This Excellent piece written by Arnab Ray on X … Author of “Sultan of Delhi” on Hotstar/Hulu and “Mahabharat Murders” on Hoichoi… Thanks Arnab Ray… (ఆర్నబ్ రే ఎక్స్ ఖాతా సౌజన్యంతో…)

చాలా సుదీర్ఘమైన విశ్లేషణ ఇది… అక్రమ వలసదారులకు పౌరసత్వాలు, అవినీతి, రౌడీ రాజ్యంతో సీపీఎం ఎలా పతనమైందో… అదే బాటులో మరింత దురుసుగా, నాటుగా వెళ్లిన మమత ఎందుకు పతనమైందో కూడా చదవాలనుకునేవాళ్లు… ఇంగ్లిషు పర్లేదు అనుకునేవాళ్ల కోసం ఆ లింక్స్… ఇవిగో…



https://t.co/fKjBxzllIt

— Arnab Ray (@greatbong) May 5, 2026



https://t.co/FCRzKN4aZn

— Arnab Ray (@greatbong) May 6, 2026

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…
  • డ్రగ్స్ తంబాకు కాంబో… కరీంనగర్‌లో సైడ్ ఎఫెక్ట్స్… కేటీయార్‌కు తల్నొప్పి…
  • ఆనందప్రకాష్… ఓ రాక్షసుడితో 19 ఏళ్ల అలుపెరుగని పోరాటం…
  • ప్రతిష్టంభన..! తగ్గని గవర్నర్…! తలైవా కథ సుప్రీం కోర్టు వైపు..?
  • ‘‘తమిళ గవర్నర్ తప్పు లేదు… స్పష్టత కోరడం న్యాయసమ్మతమే’’
  • సీఎం సాబ్, నీ కడుపు సల్లంగుండ..! మెచ్చుకునే నిర్ణయం చెప్పావు..!!
  • విజయ్ వెనుక మాస్టర్ బుర్ర…! పళనిస్వామిపై పగ తీర్చుకున్నాడు..!!
  • మగవాదం..! ‘‘సుమతీ శతకం’’పై ఓ సైకలాజికల్ అనాలిసిస్…!!
  • ఐ-ప్యాకప్…! సోషల్ మాఫియాపై పార్టీల భ్రమలు ఎగిరిపోయాయ్…!!
  • ఎన్నో ఆత్రేయ పాటల్లో- పదాల్లో ఉర్దూ గజల్ స్థాయి అభివ్యక్తి..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions