ఉన్నవే 800 వోట్లు… అందులో సగం మంది ఆ కార్యవర్గం ఎన్నికలకే రారు… మిగిలినవాళ్లు ఎక్కువగా రిటైర్డ్ ఆర్టిస్టులు, చిన్నాచితకా ఆర్టిస్టులు… ఎక్కువగా సంక్షేమం తప్ప మిగతా ఏ పెత్తనమూ ఆర్టిస్టుల మీద చేతకాని ఓ నటదద్దమ్మ సంఘం అది… హార్ష్‌గా ఉంది కదా… నిజం మాత్రం అదే… పేరుకే అది తెలుగు నటీనటుల సంఘం… అలియాస్ మా… అనగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్… పేద, వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వడం తప్ప పెద్ద వేరే పనేమీ ఉండదు… ఐనాసరే, ఎన్నికలు అనగానే తెలుగు ఇండస్ట్రీ గ్రూపులు రంగప్రవేశం చేస్తాయి… సెలబ్రిటీలు కదా, మీడియాకు భలే సోకు ఈ వార్తలు కవర్ చేయడం… సరే, ఎవడి బాధ వాడిది… వీళ్లు తన్నుకుంటూ ఉంటారు, వాళ్లు రచ్చ రచ్చ చేస్తూ బజారులో నిలబెడుతూ ఉంటారు…
నిజానికి ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించి వేర్వేరు సంఘాలు ఉన్నయ్… ఎవరూ బజారున పడి కొట్టుకోరు… ఎటొచ్చీ ఈ యాక్టర్ల సంఘమే పెద్ద కంట్రవర్సీ… ఆభిజాత్యం, ఆధిపత్య ప్రదర్శన అనేవి కాస్త మంచి పదాలు… కులగజ్జితో ఎన్నికల్లో వర్గాలుగా చీలి కొట్టుకుంటారు అనేది కరెక్టు… గతంలో ఏమో గానీ, ఇప్పుడు కమ్మ-కాపు కులపంచాయితీ… కాదు, కాదు, మెగా ఫ్యామిలీ ఆధిపత్య ప్రదర్శన అంతర్లీనంగా ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తోంది… నిజానికి స్టార్ హీరోలు, టాప్ క్లాస్ కాదు కదా, సెకండ్ గ్రేడ్ హీరోలు కూడా ఈ సంఘం మొహం చూడరు, వోట్లు వేయరు, నిజంగా తమకు అవసరమైన సందర్భాల్లో ఈ సంఘం పీకేదేమీ లేదని వాళ్లకూ తెలుసు…
Ads
కానీ ఎన్నికలు అనగానే వర్గాలు, పెత్తనాలు, ఆభిజాత్య ప్రదర్శనలూ వచ్చేస్తయ్… ఇప్పుడూ అంతే… ఇప్పుడున్నది తెలంగాణ ఇండస్ట్రీ కాదు, ఏపీ ఇండస్ట్రీ కాదు… తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆర్టిస్టుల సంఘం… సహజంగానే తెలంగాణ వాళ్లు ఉన్నా లేనట్టే… కొందరు అప్రముఖులు ఉన్నా అన్నీ మూసుకునేవాళ్లే… ఇంకా చాలారోజులుంది మా ఎన్నికల గడువు… అప్పుడే ఎన్నికల వేడి తగుల్కుంది దానికి… తిట్టేసుకుంటున్నారు… ప్రకాష్‌రాజ్ పుణ్యమాని లోకల్- నాన్‌లోకల్ ఇష్యూ కూడా వచ్చేసింది… అసలు ఎవడూ పట్టించుకునేవాడు కాదు, కానీ ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ… (చివరకు బ్లేడ్ గణేష్ వంటి కేఏపాల్ తరహా కేరక్టర్లు సహా…) తన వెంట నిలబడిందో వేడి రాజుకుంది… వర్గాలుగా చీలిపోయింది… డిష్యూం డిష్యూం… ఇప్పుడు మా అధ్యక్ష పదవికి పోటీపడుతున్నవారెవరో చూద్దాం… కన్నడిగుడైన ప్రకాష్‌రాజ్ (గతంలో కొన్ని పరాభవాలూ ఉన్నట్టున్నయ్)… మోహన్‌బాబు కొడుకు మంచు విష్ణు, ఒకప్పటి కేరక్టర్ ఆర్టిస్టు హేమ, జీవిత…
తెలుగు ఇండస్ట్రీలోని ప్రతి అంగుళం మీద తమదైన పెత్తనం కావాలని కోరుకునే కేరక్టర్ అల్లు అరవింద్… డిస్ట్రిబ్యూషన్, ఓటీటీ, హీరోయిజం, ప్రొడక్షన్… వాట్ నాట్..? తెలుగు ఇండస్ట్రీ అంటే నాది అన్నట్టుంటాడు… ఆయన చెప్పినట్టు నడిచే చిరంజీవి… అయితే ఇక్కడ కొన్ని అంశాలున్నయ్… కమ్మ-కాపు డిష్యూం డిష్యూం తరువాత… ప్రస్తుతం చిరంజీవికి అందరివాడు అనిపించుకోవాలనీ, గతంలో దాసరిలాగా తను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ‘ఎర్ర తువ్వాలు’ మార్క్ పెదరాయుడు కావాలని అభిలాష… ఇటు తెలంగాణ, అటు ఏపీ సర్కారుతో బాగుండాలి… మరి ఇలాంటప్పుడు ఈ కులతగాదా మంచిది కాదు కదా… సో, రాజీప్రయత్నాలు, ఏకగ్రీవ ఎన్నిక ప్రయత్నాలు సాగుతయ్… మళ్లీ ఎటొచ్చీ చిరంజీవి గుప్పిట్లో ఉండాలి, అంటే అల్లు అరవిందుడి చేతిలో ఉండాలి… అయితే ఎవరు..? హేమ… ఆమె స్ట్రేచర్ సరిపోదేమో… మా సంఘానికి ఓ పెద్దమనిషి తరహా పెద్దరికం అప్పగించాలంటే కాస్త వయస్సు, అనుభవం, రేంజ్ అవసరం… హేమను వదిలేస్తే మంచు విష్ణు కూడా అంతే… తన వయస్సు, తన రేంజ్, తన మెచ్యూరిటీ ఇప్పుడప్పుడే సరిపోవు… ;పుట్టింటి కమ్మ- కాపు, అత్తింటి రెడ్డి అనే అడ్వాంటేజెస్ ఉన్నా సరే…!
జీవిత, రాజశేఖర్ అంటే చిరంజీవి వర్గానికి పడదు, కారణాలు బోలెడు… పైపైకి నవ్వుతూ కౌగిలించుకున్నా సరే, కడుపుల్లో కత్తులు కొట్లాడుతూ ఉంటాయి… చిరంజీవి కూడా బయటికి కనిపించి, బయటికి మాట్లాడేంత సాఫ్ట్ కేరక్టర్ ఏమీ కాదు… ఇక మిగిలింది ప్రకాష్ రాజ్, తనకు మెగా సపోర్ట్ దక్కితే, చిరంజీవికి మిగతా వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉంది… దీనికితోడు సీవీఎల్ నరసింహారావు తెలంగాణ వాదాన్ని తెర మీదకు తెచ్చాడు… ఇది మరో మలుపు… ఇగ్నోర్ చేయలేరు, లోలోపల కోపం రగులుతున్నా సరే, ఆంధ్రా వర్గాలు ఏదో ఒకటి మాట్లాడక తప్పదు, కాంప్రమైజ్ ఫార్ములాకు దిగకా తప్పదు… పైగా చిరంజీవికి ఆంధ్రా, తెలంగాణ రెండూ కావాలి… నరేష్ తెలివిగా మహిళా ఏకగ్రీవ అధ్యక్షురాలు అనే కాన్సెప్టును తీసుకొస్తున్నాడు… అవును, ఓ మహిళ ఎందుకు అధ్యక్షురాలు కాకూడదు… కానీ చిరంజీవి కాదనలేని, వివాదరహిత, సకల కుల ఆమోదిత కేరక్టర్ ఎవరు..? జయసుధ..!! ఆమేనా..?!
గతంలో ఓసారి పోటీచేసి ఓడిపోయింది… కానీ ఇప్పుడు..? ఒకవేళ లేడీ, ఏకగ్రీవం ప్రతిపాదనకు బలం చేకూరితే… తనకు ప్రస్తుతం అందరూ కావాలి అని చిరంజీవి గనుక భావిస్తే… జయసుధకు కృష్ణ సపోర్ట్ ప్రకటిస్తే… కథ వేరే ఉంటుంది… ఆమె కృష్ణకు బంధువు… గతంలో వైసీపీ, కాంగ్రెస్ అయినా, ఇప్పుడేమిటో ఆమెకే తెలియదు బహుశా… కానీ ఓ స్ట్రేచర్ పరంగా వోకే… క్రిస్టియన్… పెద్దగా వివాదాల్లోకి రాదు… నిజంగానే నరేష్ ఆమెను తెర మీదకు తీసుకొచ్చి… మహిళా ఏకగ్రీవ అధ్యక్షురాలు అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే చిరంజీవి అండ్ హిజ్ బావమరిది ఆలోచనల్లో పడకతప్పదు… నరేష్ వర్గం కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉంది… మధ్యలో బకరా అయ్యేది ప్రకాష్ రాజేనా..? చూడాలి…!!
Share this Article