Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!

May 16, 2026 by M S R

.

 

  • Subramanyam Dogiparthi …. ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రం . ముఖ్యంగా 50 సంవత్సరాల వయసొచ్చిన వారందరూ చూడాలి . కధలు చెప్పి , మోసం చేసే నీచ సంతానం బారిన పడకుండా జాగ్రత్తగా ఉండేందుకు . అలాగే నీచ సంతానం కూడా . తామెలా అమాయక తల్లిదండ్రులను మోసం చేసారో తెలుసుకోవటానికి . దాని వలన వయసుడిగిన తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవటానికి .

పూర్వ జన్మలను నమ్మేవారికి . గత జన్మలో మనం ఎవరికయినా అన్యాయం చేస్తే వాళ్ళు పగ తీర్చుకోవటానికి ఈ జన్మలో సంతానంగా పుట్టి చస్తారు . ఇలాంటి వారిని శత్రు సంతానం అంటారు . మరో కేటగిరీ రుణానుబంధ సంతానం . గత జన్మలో మనం ఎవరికయినా బాకీ ఉండి ఉంటే దానిని వసూలు చేసుకోవటానికి ఈ జన్మలో రుణానుబంధ సంతానంగా తగలడతారు . బాకీ తీరే దాకా తల్లిదండ్రుల సంపాదనను ఆరగిస్తారు . బాకీ వసూలు కాగానే జంపవుతారు .

Ads

చాలా గొప్ప కుటుంబ కధా చిత్రం . ఇలాంటి సినిమాలను తీయడంలో విసు నిష్ణాతుడు . చాలా సినిమాలు తీసాడు . అన్నీ సక్సెస్ అయ్యాయి . 1992 సెప్టెంబరులో విడుదలయిన ఈ డబ్బు భలే జబ్బు సినిమాకు మాతృక తమిళంలోని వరవు నల్ల ఉరవు . విసుయే దర్శకుడు . తమిళంలో కూడా అన్నపూర్ణమ్మ నటించింది . ఆమెతో పాటు విసు , రేఖ , విద్యాశ్రీ తదితరులు నటించారు .

తమిళ సినిమా కూడా ఇంగ్లీషులోని Make way for tomorrow అనే సినిమా ఆధారంగా నేయబడింది . ఆ సినిమా కూడా అదే టైటిలుతో ఉన్న నవల ఆధారంగా తీయబడింది .

మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే అని ప్రగాఢంగా నమ్మి ప్రతి దానికీ వెల కట్టే ఎమోషన్స్ లేని వ్యక్తి రావు గోపాలరావు . అతని స్నేహితుడు గొల్లపూడి మారుతీరావు దానికి పూర్తిగా భిన్నమైన భావజాలం కలవాడు . డబ్బు ముఖ్యం కాదు ; ఎమోషన్సే ముఖ్యం అని మొహం పగలకొట్టించుకునే పాత్ర గొల్లపూడి మారుతీరావుది .

తన రిటైర్మెంట్ డబ్బును , ఉన్న ఇంటిని మొత్తం ఇద్దరు కొడుకుల , అల్లుడి చేతిలో పోసి పాపర్ అవుతాడు గొల్లపూడి . ఇద్దరు కొడుకులని , ఎవరినీ నమ్మని రావు గోపాలరావు కోడలు సుమలత మంచితనంతో ఎమోషన్సుకు గౌరవం ఇచ్చే మనిషి అవుతాడు . సినిమా చివర్లో నీచ సంతానానికి కనువిప్పై తల్లిదండ్రుల కాళ్ళ మీద పడటంతో సినిమా శుభాంతం అవుతుంది .

అద్భుతమైన స్క్రీన్ ప్లేని , తదనుగుణంగా దర్శకత్వాన్ని వహించిన కె యస్ రాజేంద్రకు అభినందనలు . ప్రతీ పాత్రను చక్కగా మలిచారు . ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పాత్ర . అద్భుతంగా నటించింది . ఇలాంటి పాత్రల్లో పండిపోయింది . ఈ సినిమాలో ఆమె నటనకు ప్రత్యేక జ్యూరీ నంది అవార్డు కూడా పొందింది .

ఆమె తర్వాత తాంబూలం సుమలతదే . సహనంతో కరుకు హృదయుడిగా తయారయిన మామను గెలుచుకునే కోడలిగా చాలా బాగా నటించింది . ఆ ఇద్దరి తర్వాత గొల్లపూడి , రావు గోపాలరావులనే అభినందించాలి . వాళ్ళూ పండిపోయిన సీనియర్లే కదా !

ఇతర ప్రధాన పాత్రల్లో రాజా , రాజ్ కుమార్ , సుమలత , హరిత, మహర్షి రాఘవ , అచ్యుత్ , విజయవర్ధన్ , సుధారాణి , వరలక్ష్మి , శిల్ప , అల్లు రామలింగయ్య , బ్రహ్మానందం  తదితరులు నటించారు .

అల్లు ఆర్ట్స్ బేనరుపై అల్లు రామలింగయ్య నిర్మించిన ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డు వచ్చింది . దర్శకుడు కె యస్ రాజేంద్ర . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది సంగీత దర్శకుడు గంగై అమరన్ గురించి . ఈయన ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు . బేక్ గ్రౌండ్ స్కోరుని అద్భుతంగా అందించారు .

వెన్నెలకంటి , సిరివెన్నెలలు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , మనోలు శ్రావ్యంగా పాడారు . చక్కదనాల మహారాజును తెస్తానురా అంటూ సాగే ఫేమిలీ సాంగ్ బాగుంటుంది . సుమలత పాడే వినవా కనవా వింత కధలు చాలా శ్రావ్యంగా ఉంటుంది . నీ దారి నీదే , ఏ మాయో ఉన్నట్టుంది మతిపోయింది అంటూ మరో రెండు పాటలు ఉన్నాయి .

It’s an excellent message oriented movie . ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడతగ్గ సినిమా . ముఖ్యంగా సంతానాన్ని నమ్మి ఉన్నదంతా వాళ్ళకు ఇంకా ఊడ్చకుండా ఉన్న వాళ్ళు మరీ మరీ తప్పకుండా . యూట్యూబులో ఉంది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!
  • దిల్ రాజూ భయ్యా… సింగిల్ స్క్రీన్లను గాలికి వదిలేద్దామంటావా..?!
  • మన సోషల్ మీడియాలోనే కాదు… అమెరికా సెనేటర్లలోనూ ‘అజ్ఞానులు’…
  • SRH vs RCB … భారీ పూనకాలు లోడింగ్… ఇదేం క్రేజురా బాబోయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions