.
సమస్య ఏమిటంటే..? తాము అధికారంలో ఉన్నప్పుడు కేసీయార్ చేసిన పనిని, తెలంగాణ సమాజం కోసమే రేవంత్ రెడ్డి చేస్తే మాత్రం అక్రమం, అన్యాయం అని శోకాలు అందుకుంటారు… అప్పుడు పాజిటివ్ కాస్తా ఇప్పుడు నెగెటివ్‌గా కనిపిస్తుంది… గాయిగత్తర చేయాలనిపిస్తుంది… చాలా విషయాల్లో… ఉదాహరణకు ‘వరి సాగు’…
గతంలో కేసీయార్ ఏమన్నాడు..? (ప్రత్యేకించి 2021-22 యాసంగి సీజన్‌లో ‘వరి వేస్తే ఉరివేసుకున్నట్టే’ అన్నాడు… ఎందుకు..? ఆరుతడి లేదా ప్రత్యామ్నాయ పంటలు మాత్రమే వేసుకోవాలన్నాడు ఎందుకు..? 1) కేంద్ర ప్రభుత్వం, FCI వైఖరి (ఉప్పుడు బియ్యం కొనుగోలు నిరాకరణ) 2) మిగులు ఉత్పత్తి (Surplus Production) వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగింది… మిగులు దిగుబడిని ఎక్కడ నిల్వ చేయాలో, ఎవరికి అమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది… 3) 3. పంటల మార్పిడి (Crop Diversification). మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పత్తి, వేరుశనగ, కంది, మిరప వంటి లాభసాటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం సూచించింది…
Ads
ఇప్పుడూ అదే కదా స్థితి..? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటల వైపు మళ్లాలని చెబుతోంది… అవసరం కూడా… రాష్ట్ర వ్యవసాయ చిత్రపటం మారాల్సిన అవసరం ఇప్పుడే బాగా ఉంది… కానీ బీఆర్ఎస్ ఏం చేస్తోంది..? ‘కొనేదాకా కొట్లాడుడే’ అంటూ ఓ ఆర్టిఫిషియల్ ఉద్యమం కోసం విఫల ప్రయత్నం, ప్రచారం చేసి, ఇప్పుడు ‘వరి వద్దట, మరి ఏం వేయాలట’ అనే వెటకారపు వ్యాఖ్యలకు దిగింది… (నమస్తే తెలంగాణ చెబితే కేసీయార్ నోటి వెంట మాటే కదా,.. ఈరోజు బ్యానర్ అది)…
నిజానికి రైతులు వరి నుంచి మళ్లాల్సిన అవసరం ఇప్పుడే ఎక్కువ… పైన చెప్పినట్టు మూడు కారణాలతోపాటు ఈసారి ఎల్‌నినో నెగెటివ్ ప్రభావం బాగా ఉండబోతోంది… వరి వేస్తే నష్టపోయే ప్రమాదం… కేంద్రం సరిపడా కొనేట్టు లేదు… దానికీ సమస్య ఉంది, గోదాములు ఫుల్… వేరే దేశాలకు ఎగుమతుల్లేవు, ఎక్కడా బాయిల్డ్ రైస్ కొనుగోళ్లు లేవు… మరి రైతులు పండించే దొడ్డు బియ్యాన్ని ఏం చేయాలి..?
ఈ సమస్యకు పరిష్కారంగా రేవంత్ రెడ్డి సన్నరకాలకు బోనస్ ప్రకటించాడు… అదొక ప్రోత్సాహకం, ఆ ధాన్యం మిల్లింగ్ చేయించి, ప్రజలందరికీ రేషన్ సన్నబియ్యం అందిస్తున్నాడు… ఉభయతారకం… కానీ తక్కువ పంటకాలం, ఎక్కువ దిగుబడి, తెగుళ్లు తట్టుకుంటాయనే పేరిట రైతులు దొడ్డురకాలే ఎక్కువగా వేస్తున్నారు… అదీ సమస్య… అందుకే పంటలు మార్చండి అంటోంది ప్రభుత్వం…
నిజం, ఈమధ్య మోడీ చెప్పిందీ ఇదే, నూనెల వాడకం తగ్గించండీ అన్నది ఎందుకంటే..? ఆ దిగుమతులకు మన విదేశీమారక ద్రవ్యం ఎడాపెడా ఖర్చయిపోతోంది… సో, వరి వంటి పంటల నుంచి నూనె గింజల సాగు మొదలుపెట్టాలని, అటు వైపు రైతుల్ని మరల్చాలని ఎన్నేళ్లుగా రాష్ట్రాల్ని కోరుతోంది… దాంతోపాటు అపరాల కొరత ఉంది దేశంలో… ఈ రెంటికీ మంచి ధర ఉంది, ప్రభుత్వాలు నష్టాలకోర్చి కొనాల్సిన అవసరం లేదు, మార్కెట్ గిట్టుబాటు ధర ఇస్తోంది… రైతు ఎవరినీ బతిమిలాడాల్సిన పనిలేదు…
మరి తెలంగాణ సమాజానికి ఉపయుక్తమైన ఈ పంటల మార్పిడికి బీఆర్ఎస్ ఓ బాధ్యత కలిగిన పార్టీగా సహకరించాలి కదా… లేదు, ప్రభుత్వం మీద రైతుల్ని ఎగదోస్తోంది… ఈసారి 70 లక్షల టన్నుల్ని ప్రభుత్వం కొంటే, అందులో 56.5 లక్షల టన్నులు దొడ్డురకాలే… గతంలో కేరళ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బాయిల్డ్ రైస్ తినేవాళ్లు, ఇప్పుడు వాటిల్లోనూ గిరాకీ లేదు, అక్కడా రా రైస్ తింటున్నారు…
గతంలో ఇతర దేశాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతయ్యేది… తూర్పు దేశాల్లో బియ్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగి, మన రైస్‌కు గిరాకీ తగ్గిపోయింది… గత రెండేళ్లలో కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ను మించి రేవంత్ రెడ్డి ఈ రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోలు చేసింది, రైతులు నష్టపోవద్దని..! దాదాపు 16 వేల కోట్ల భారం ఖజానాపై… ఇప్పుడు ఈ మిగులు బియ్యం ఏం చేయాలి..? పెద్ద ప్రశ్న..!! ఎక్కడపడితే అక్కడ నిల్వ చేసిన ఈ గుట్టల కొద్దీ దొడ్డు బియ్యానికి విముక్తి ఎలా..? చిక్కు ప్రశ్న..!!
Share this Article