.
లీగల్ ‘నోటీస్’ వర్సెస్ పొలిటికల్ ‘ట్విస్ట్’… మీనాక్షి నామినేషన్ రద్దు వెనుక అసలు కథ ఓ మిస్టరీ..?– తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ, మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
దీనికి తోడు, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ చేసిన ఒక సంచలన వ్యాఖ్య ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించింది. “మాకు తెలంగాణ నుండి కాంగ్రెస్ నాయకులే ఈ కేసు పత్రాలను పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఏ స్థితిలో ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు”–
Ads
నిజంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఈ వివరాలు ఇచ్చారా..? లేక బీజేపీ తెలివిగా దీన్ని తెలంగాణ కాంగ్రెస్ మీదకు నెట్టేసి, భేదోపాయం ప్రయోగిస్తోందా..? పరిణామాలను, రాజకీయ వ్యవహారాలను జాగ్రత్తగా పరిశీలిస్తే… ఇదంతా మధ్యప్రదేశ్ బీజేపీ ప్లాన్‌లాగే కనిపిస్తోంది… ఆమె నామినేషన్ పత్రాల తిరస్కరణ కూడా ప్రస్తుతం న్యాయపరమైన ఓ చిక్కు ప్రశ్నలా, జటిలమైన ముడిలా కనిపిస్తోంది… ఎందుకంటే..?
- మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి పోలీసు ఎఫ్‌ఐఆర్ (FIR) లేదు. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఒక మహిళ దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్ (Private Petition) లో ఆమెకు కేవలం కోర్టు నోటీసు మాత్రమే వచ్చింది. న్యాయశాస్త్రం ప్రకారం, ప్రైవేట్ పిటిషన్‌లో నోటీసు రావడం అంటే కోర్టు ఇంకా ఆ నేరాన్ని పరిగణనలోకి (Cognizance) తీసుకున్నట్టు కాదు. అది ప్రాథమిక దశ మాత్రమే.
న్యాయపరమైన చిక్కుముడి …. బిజెపి అభ్యర్థి మహేష్ కేవత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమె కోర్టు కేసు వివరాలను దాచారని రిటర్నింగ్ అధికారి (RO) కి ఫిర్యాదు చేశాడు… సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఫారమ్-26 అఫిడవిట్‌లో పూర్తి సమాచారం ఇవ్వాలి కాబట్టి, సమాచారాన్ని దాచడం (Concealment of facts) కిందకు వస్తుందని భావించి ఆర్‌ఓ ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు.
ఇక్కడ తలెత్తే చిక్కు ప్రశ్న … ఎఫ్‌ఐఆర్ నమోదు కాని, చార్జ్‌షీట్ పడని, కేవలం ఒక ప్రైవేట్ నోటీసు పరిధిలో ఉన్న విషయాన్ని “క్రిమినల్ కేసు”గా పరిగణించి నామినేషన్ రద్దు చేయడం చట్టరీత్యా ఎంతవరకు సమంజసం? దీనిపై కాంగ్రెస్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా వాదిస్తూ, ఇది కేవలం రూ.10 కోట్ల నష్టపరిహారానికి సంబంధించిన సివిల్ స్వభావం గల నోటీసు మాత్రమేనని, దీనిని క్రిమినల్ రికార్డుగా చూపించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు.
పరిమళ్ నత్వానీకి ఒక న్యాయం.. మీనాక్షికి మరో న్యాయమా? ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల నిర్వహణ వ్యవస్థల నిష్పాక్షికతను ప్రశ్నిస్తున్న ప్రధానాంశం — జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి (బిజెపి మద్దతుదారు) పరిమళ్ నత్వానీ కేసు. పరిమళ్ నత్వానీ నామినేషన్ పత్రాల్లో పేర్ల మార్పులు, కొన్ని కాలమ్స్ ఖాళీగా వదిలేయడం వంటి తీవ్రమైన సాంకేతిక లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు… అక్కడి రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను హోల్డ్‌లో పెట్టి, తప్పులు సరిదిద్దుకోవడానికి లేదా వివరణ ఇచ్చుకోవడానికి 24 గంటల సమయం ఇచ్చారు.
ఒకరికి తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చి, మరొకరికి కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నామినేషన్ రద్దు చేయడం ఖచ్చితంగా వ్యవస్థల “సెలెక్టివ్ అప్రోచ్”ను సూచిస్తోందని న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. క్లరికల్ లోపానికి, సమాచారం దాచడానికి మధ్య ఉన్న లీగల్ లైన్‌ను అధికారులు తమకు నచ్చినట్టు వాడుకుంటున్నారనే విమర్శలకు ఇది బలం చేకూరుస్తోంది.
‘ఓటు చోరీ’ నుండి ‘సీటు చోరీ’ దాకా…. రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులు స్పందించి… గతంలో బిజెపి ‘ఓట్ల చోరీ’కి పాల్పడేదని, ఇప్పుడు ఏకంగా ‘సీట్ల చోరీ’ (Seat Chori) కి తెరలేపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు అవసరమైన సంఖ్యాబలం (61 మంది ఎమ్మెల్యేలు) ఉన్నా సరే, మూడో అభ్యర్థిని నిలబెట్టి, కావాలనే ఈ టెక్నికల్, లీగల్ అస్త్రాన్ని ఉపయోగించి, సీటు కాజేశారనేది ఆ విమర్శల సారాంశం…
- ఆర్‌ఓ తీసుకున్న తక్షణ నిర్ణయం దేశంలో ఎన్నికల నిష్పాక్షికతను పెద్ద చిక్కుముడిలో పడేసింది… కేవలం కోర్టు నోటీసుల ఆధారంగా నామినేషన్లు రద్దు చేసుకుంటూ పోతే, భవిష్యత్తులో ప్రత్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకోవడానికి ఇదొక ప్రమాదకరమైన ఆయుధంగా మారుతుందనడంలో సందేహం లేదు… ఈ చిక్కు ప్రశ్నకు ఇప్పుడు ఉన్నత న్యాయస్థానమే (High Court / Supreme Court) తుది తీర్పు ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది…
Share this Article