ఓ పెద్ద సంకల్పాన్ని తీసుకున్నప్పుడు… దాన్ని సంపూర్ణం చేయడానికి… మంచి ప్రణాళిక కావాలి, సమర్థులైన టీం కావాలి, సరైన పర్యవేక్షణ కావాలి, సరిపోయే నిధులు కావాలి, లక్ష్యం ఏమిటనే స్పష్టత కావాలి, భావి అవసరాల మీద మంచి అంచనాలు కావాలి… అవేవీ లేకపోతే… దాన్నే యాదాద్రి పునర్నిర్మాణం అంటారు… ఈ నిర్మాణంలోని లోటుపాట్లు, ప్రణాళికారాహిత్యం కేసీయార్‌కే పరువుగండం అయిపోతోంది రాను రాను… అదుగో వచ్చే నెల సుదర్శనయాగం, ప్రారంభోత్సవం అంటారు, ఏమీ ఉండదు… కాదు, కాదు, ఫలానా నెలలో నరసింహయజ్ఞం, ప్రారంభోత్సవం అంటారు, అదేమీ జరగదు… అయిదేళ్లయింది… ముఖ్యమంత్రి అసాధారణ రీతిలో 15 సార్లు సందర్శించాడు… పాతవి మాఫ్ అంటాడు, కొత్త ప్లాన్లు చెబుతాడు, మార్పుచేర్పులు సాగుతూనే ఉంటయ్… కడుతారు, కూల్చేస్తారు, మళ్లీ కడతారు… ఏం కడుతున్నామో, ఏం చేస్తున్నామో అక్కడ ఎవరికీ క్లారిటీ లేదు… చివరకు ముగ్గుపోసిన చినజియ్యరుడే పెద్ద శిరోభారంగా భావించి ఆ గుడివైపు వెళ్లడానికే ఠారెత్తిపోతున్నాడు… అదీ యాదాద్రి కథ…
వందల కోట్లు పోస్తూనే ఉన్నారు… అదెప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు, కేసీయార్ ఇంకెన్నిసార్లు అక్కడికి చక్కర్లు కొట్టాలో కూడా తెలియదు… అసలు ఆయన ఎవరికి బాధ్యతలు అప్పగించాడు, వాళ్ల అనుభవం ఏంటి, వాళ్లు ఏం చేస్తున్నారు..? అంతా అయోమయం, గందరగోళం… పదీపదిహేను రోజులకు ఒకసారి నాలుగు ఫోటోలు, పత్రికల వాళ్లకు వస్తాయి… వాళ్లు వెంటనే కళ్లకద్దుకుని…. ‘‘శిలలపై శిల్పాలు చెక్కినారూ, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారూ’’ అనే కథనాలు కుమ్మేస్తారు… ఆహా, ఓహో… వర్షం వస్తే గుళ్లోకి నీళ్లెందుకు వస్తున్నయ్, ఎక్కడుంది లోపం అని మాత్రం రాయరు… పుష్కరిణికి (గుండం) మూడుసార్లు ఎందుకు మార్పులు చేశారో రాయరు…
Ads
వెలుగు పత్రికలో ఓ ఇంట్రస్టింగు కథనం కనిపించింది… ఇతర పత్రికల్లా భజన గాకుండా అక్కడేం జరుగుతున్నదో ప్రొఫెషనల్‌గా రిపోర్ట్ చేసినట్టు అనిపించింది… ముఖ్యాంశాలు… రథమండపం రెండుసార్లు మార్చారు… దాదాపు 4 కోట్లు వృథా ఖర్చు… వేలాది మంది సత్యనారాయణ వ్రతం చేసుకునేందుకు కాంప్లెక్స్ కట్టారు… నరసింహస్వామి దగ్గర సత్యనారాయణ వ్రతాలకు ప్రాధాన్యమేమిటి అనడక్కండి… దాన్ని మళ్లీ క్యూ కాంప్లెక్స్ చేశారు, ఇప్పుడు దాని పొడవు తగ్గిస్తారట… కొంత తీసేశారు, ఇంకొంత మళ్లీ కడుతున్నారు… శివాలయం ఆవరణలో రామాలయం కట్టారు మొదట్లో… మళ్లీ తీసేశారు, శివాలయం ఎలివేషన్ సరిగ్గా లేదని ప్రహరీ తీసేశారు… గుడి చుట్టూ రెండుసార్లు ఫ్లోరింగు, కారణం, సాయిల్ టెస్టింగు చేయకపోవడం… పాత ఘాట్ రోడ్డుపై హాల్టింగ్ షెల్టర్ మొదలుపెట్టారు, తరువాత ఆపేశారు… ఇప్పుడు రోడ్డే మూసేశారు… కొండ కింద తులసివనంలో ఓ సరస్సు, బోటింగుకు 2 కోట్లు పెట్టారు… అర్రెర్రె, ఫ్లై ఓవర్ కట్టాలి కదాని నాలుక కర్చుకుని, బోటింగ్ నిలిపేసి, పిల్లర్లు వేస్తున్నారు…
మొత్తం ఇలాగే… ఓ శృతి లేదు, సమన్వయం లేదు, సరైన ప్లానింగ్ లేదు… ప్రజాధనం అపరిమితంగా వృథా చేసేస్తున్నారు… గిరి ప్రదక్షిణ పేరిట గండి చెరువు వైపు కొండను తొలిచారు… ఇప్పుడు దాన్ని వదిలేసి రింగ్ రోడ్డు కడతాం అంటున్నారు… రింగ్ రోడ్డు లోపల వైపు, కొండ మీదకు వెళ్లే ఫ్లైఓవర్ కోసం పిల్లర్లు వేశారు, తీసేశారు, ఇప్పుడు మళ్లీ వేస్తున్నారు… వాస్తుకు విరుద్ధంగా ఉందని కొండ మీద సబ్‌స్టేషన్ తీసేశారు, అదెక్కడ కడతారో ఇప్పటికీ క్లారిటీ లేదు… గుండం ఓ చిత్రమైన వ్యథ… మొత్తం కొత్తగా నిర్మిస్తున్నాం కదా, పాత పుష్కరిణి ఎందుకులే అని మొత్తం తీసేశారు, కొత్తగా కట్టారు, అక్కడే స్నానాలు చేయాలి కదా భక్తులు… నో, నో, కొండ కింద మాత్రమే స్నానాలు అని నిర్ణయించారు, సగం కూల్చి మళ్లీ కడుతున్నారు… స్నానాలు వద్దని చెప్పి, అక్కడ బాత్రూంలు ఎందుకు కడుతున్నారో ఎవరికీ తెలియదు… రాస్తూ పోతే ఇంకా చాలాచాలా ఉన్నయ్… అసలు స్థంభాల మీద టీఆర్ఎస్ సర్కారు పథకాల ప్రచారం, కేసీయార్ బొమ్మలు పెట్టినప్పుడే గుడి ప్రతిష్ఠను, పవిత్రతను బాగా దెబ్బతీశారు… ఇప్పుడు ఈ లోపాలతో సర్కారు పరువు మరింత మసకబారుతోంది… ఏమో, ఏ నరసింహుడు ఓసారి కోరలు సవరించుకుంటే తప్ప ఇది గాడినపడేట్టు లేదు… లేదు…!!
Share this Article