.
వేటూరి తనకు వచ్చిన జాతీయ అవార్డును ఎందుకు తిరస్కరించారు? ఇది చాన్నాళ్లుగా అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ప్రశ్న. సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ అవార్డు కోరుకుంటారు, వస్తే గర్విస్తారు. అదొక కీర్తిపతకం, పతాకం కూడా! మాతృదేవోభవ సినిమాలో తను రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకో’ పాటకు జాతీయ అవార్డు ప్రకటించారు…
కానీ తెలుగుకు ప్రాచీన హోదా విషయంలో కేంద్ర నిర్లక్ష్యానికి, వివక్షకు నిరసనగా అప్పట్లో (1993) ఆయన దాన్ని తిరస్కరించారు… తనకు దక్కే వ్యక్తిగత లాభాన్ని వదిలేసి, భాష మీద ప్రేమించిన ఉదాత్తత అది… భాషపైన గాఢమైన ప్రేమ అది… (2008లో కేంద్రం తెలుగు భాషకు ప్రాచీనహోదాను ప్రకటించింది…
Ads
అవనిగడ్డలో జరిగిన ఓ సభలో వేటూరి ఇలా అన్నారు… “నాకు, నా పాటకూ ఈరోజు ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం నా ‘తెలుగు భాష’… అసలు నా మాతృభాష అయిన తెలుగుకే సరైన గుర్తింపు, గౌరవం లేనప్పుడు… ఆ భాషలో రాసినందుకు నాకు ఇచ్చే ఈ జాతీయ అవార్డు నాకు అవసరం లేదు”…
“వేణువై వచ్చాను భువనానికి.. గాలినై పోతాను గగనానికి” అనే పాట కూడా క్లాసిక్‌గా నిలిచింది… జాతీయ అవార్డు వచ్చిన పాట కంటే ఈ “వేణువై వచ్చాను” పాటే తనకు పర్సనల్‌గా ఎంతో ఇష్టమైన పాటని వేటూరి గారు ఒక సందర్భంలో పేర్కొన్నారు…

సరే, రాలిపోయే పువ్వా పాటపై మిత్రులు Suresh Kolichala అప్పట్లో రాసిన ఓ విశ్లేషణను ఓసారి అవలోకిద్దాం…
రాలిపోయే పువ్వానీకు రాగాలెందుకే? ‘మాతృదేవోభవ’ విథి వక్రించిన ఒక మాతృమూర్తి గాథ. బ్లడ్‌క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ, తన భర్త చనిపోయినా ఆత్మస్తైర్యంతో తన పిల్లల జీవితాలను సరిదిద్ది తుది శ్వాస వదలడం – స్థూలంగా ఈ సినిమా కథ. ‘రాలిపోయే పువ్వా’ పాట భర్త కోల్పోయిన క్షణంలో ఆ స్త్రీ మనోవేదనకు భాషారూపం.
సన్నిహితుల మరణం కలిగించే హృదయ సంచలనాన్ని వర్ణించే పాటలెన్నో ఇదివరకు వచ్చాయి. ఈ పాటల్లో తరచూ వాడే కవితా సామాగ్రి ‘చితిమంటలు’ ‘వల్లకాడు’, ‘గుండేకోత’ మొదలైన పదాలు. ఆ పాటలన్నికీ భిన్నంగా విలక్షణమైన శిల్పంతో సున్నితమైన సరళమైన పదాలతో లలితంగా నియమం తప్పని మాత్రఛందస్సులతో సాగుతుంది ఈ పాట. ఈ పాట పాడిందీ, రాగాన్ని కూర్చిందీ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి.
యథాతథగా ఆ పాట…
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మ కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగా మనసు మాంగళ్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై
అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశము నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

ఈ చిన్ని పాటలో కవి తన కౌశల్యాన్ని, చాతుర్యాన్ని ఎలా ప్రదర్శించాడో గమనించండి. ఆమెకు తీరని జబ్బు. ఆమె రాలిపోయే పువ్వు; వాలిపోయే పొద్దు. పువ్వు తోటమాలి కోసం పూస్తే, పొద్దు పొడవటం లోకం కోసం.
తోటమాలి లేదనడం ఆమె భర్త మరణానికీ, లోకమెన్నడో చీకటవటం ఆమె నైరాశ్యతకి చిహ్నం. రాలిపోయే పువ్వుకూ, వాలిపోయే పొద్దుకూ రంగులెందుకూ అంటూ ఆమె హృదయంలో ప్రాపంచిక విషయాలపై నిరాసక్తతనూ, విరక్తినీ తెలుపుతూనే నీకిది తెలవారని రేయమ్మా అంటూ మనసులోని నిర్వేదాన్ని, నైరాశ్యాన్ని మన కళ్ళముందు స్పష్టంగా నిలుపుతాడు.
భర్త మరణిస్తే రంగురంగుల అలంకారాలు, నుదుట బొట్టు తొలగించి తెల్లచీర కట్టడం సాంప్రదాయం. పువ్వుకు రాగాలెందుకు, పొద్దుకు వర్ణాలెందుకు అని ప్రశ్నించడంలోనూ, సింధూర వర్ణాలు తెల్లారాయి అనడంలో ఉన్న భావానికి ఈ సంప్రదాయాన్ని అన్వయిస్తే రచయిత భావనలోని లోతు సుస్పష్టం అవుతుంది.
రాగం అన్న పదానికి ఉన్న అనేకార్థాల్లో రంగు అనే అర్థం కూడా ఉంది. సంధ్యారాగం, పుష్యరాగం అనే పదబంధాలలో ‘రాగం’ రంగు అన్న అర్థంలోనే వాడబడుతున్నది. అలాగే సింధూరవర్ణాలు తెల్లబడి చల్లారడంలో ఇంకో శ్లేషార్థం: చితిమంటలు ఆరిపోయి వెలిబూడిద మిగలడం.
తోడు లేకపోవడంతో గూడు గాలిగా చెదరింది. మాంగల్యంతో పాటు మనసూ (దిగ)జారింది. భర్త మరణానంతర శోకం ఈ గీతంలో ప్రధానాంశం. అయినా, ఆ విషయాన్ని ‘తనవాడు తారల్లో చేరగా’ అని ఒక్క వాక్యంలో అతిసున్నితంగా ప్రస్తావిస్తాడు కవి.
ఆ దుఃఖ సమయంలో ఆమె పిల్లలు ‘కన్నీటి దీపాలు’. వారికోసం ఆమె ‘తిరిగే భూమాత’. అయినా ఆరోగ్య రీత్యా ఆమె ‘వేకువజాము వెన్నెల’, ‘కరిగే కర్పూరం’. ఆమె నిజంగా ఆశల హారతి. చిన్న చిన్న మాటలు చాలు ఈ రచయితకు ఈ పాత్ర మనోభావాలు మనకు తెలుపడానికి.
రక్తం రంగు మారినా ఆమె ఋణానుబంధం తీర్చుకోకతప్పదు. అందుకే అనుబంధం అప్పువంటిది. కానీ ఈ బంధాలన్ని కరిగి ఆమె హేమంతంలో చేమంతిలాగా వాడిపోక తప్పదు. ఆమె పరిస్థితిని వ్యక్తం చేసే ఒక్కొక్క వాక్యం, ఒక్కో రసగుళిక. జాబిలికి ఆకాశం ఆధారం. ఆకాశమే పగిలిపోతే జారిపడే జాబిలిగా, తీగ తెగిన వీణియగా, ఆ వీణ మిగిల్చిన ఆలాపనగా ఆమెను పోల్చడం వేటూరి కవితాపటిమకు, భావవైచిత్రికి మచ్చుతునకలు.
ఏ భాషా పటాటోపం లేకుండా, అందరికి అర్థమయ్యే సామాన్యపదాలతో అసామాన్యమైన భావాలను తెల్పుతూ గుండెలను స్పృశించడం ఈ పాట గొప్పతనం. ఇలాటి పాట రాయడం వేటూరికి ఇది మొదటిసారి కాదు. పంతులమ్మ చిత్రంలో ‘ఎడారిలో కోయిలా, తెల్లారనీ రేయిలా’ దాదాపు ఇటువంటి సన్నివేశానికి రాసిన పాటే…
Share this Article