.
Subramanyam Dogiparthi …. చిరంజీవి , కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఆఖరి సినిమా ఈ ముఠామేస్త్రి . వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 23 సినిమాలు వచ్చాయి . 1993 జనవరిలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది . చిరంజీవి , మీనా కాంబినేషన్లో మొదటి సినిమా . జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెడుతుంది . అలాగే కధంటూ ఉంటే దాని చుట్టూ బిర్రయిన స్క్రీన్ ప్లేని అమరిస్తే సినిమా దానంతట అదే హిట్టవుతుంది .
భూపతిరాజా కధకు పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే , డైలాగులు బ్రహ్మాండంగా అమర్చారు . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఎక్కడా బోరించకుండా స్పీడ్ స్పీడుగా సాగిపోతుంది . రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ వీర హిట్ . కోదండరామిరెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు . చిరంజీవి సినిమా అనగానే ప్రేక్షకులు ఆశించే పాటలు , ఫైట్లను బ్రహ్మాండంగా ఆవిష్కరించారు .
Ads
ప్రముఖంగా చెప్పవలసింది పరుచూరి బ్రదర్స్ డైలాగులు . చిరంజీవి లెవెల్లో ఉంటాయి . ప్రేక్షకులను ఉత్తేజపరిచే విధంగా వ్రాసారు . చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే సీన్లలో డైలాగులు , చివర్లో తానొచ్చిన పని అయిపోయింది మరలా ప్రజాస్వామ్యం ఎప్పుడయినా ఆపదలో పడినప్పుడు మరలా వస్తా అనే డైలాగులు చిరంజీవి అభిమానుల చేత ఈలలు వేయిస్తాయి .
కూరగాయల మార్కెట్లో ముఠామేస్త్రి గాంధేయవాది అయిన అల్లు రామలింగయ్య శిష్యరికంలో అపర గాంధీలాగా సత్యాగ్రహం చేసి ముఖ్యమంత్రి గారి కళ్ళల్లో పడి MLA అయి మంత్రి కూడా అయిపోతాడు .
మంత్రిగా నగరంలో మోతుబరి అయిన ఆత్మ పాత్రలో శరత్ సక్సేనా , ఆయన కొడుకు శ్రీహరి ఆగడాలను ఎదిరించి క్లైమాక్సులో వారిద్దరిని చంపేయటంతో సినిమా ముగుస్తుంది .
సినిమాలో కోర్ట్ సీన్ ఒకటి బాగా పేలింది . శ్రీహరిని రక్షిస్తానికి ఎలిబీ సృష్టిస్తాడు శరత్ సక్సేనా . అందులో టైంని నమాజ్ ద్వారా బయటపెట్టి ఉరిశిక్ష వేయించే సీన్ బాగా వచ్చింది . అలా చాలా సీన్లు బాగా పండాయి సినిమాలో .
చిరంజీవికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . అదరగొట్టేసాడు . ఆయన పక్కన హీరోయిన్లుగా మీనా , రోజా గ్లామర్ స్పేసుని అద్భుతంగా ఫిల్ చేయటమే కాకుండా పాటల్లో చిరంజీవికి ధీటుగా డాన్సులు వేసారు . డాన్సుల్ని బ్రహ్మాండంగా కంపోజ్ చేసిన ప్రభుదేవా , సుచిత్రలను ; అంతే గొప్పగా చిత్రీకరించిన కోదండరామిరెడ్డిని తప్పక అభినందించాలి .
సినిమా ఎత్తుకోవటం ఎత్తుకోవటమే సిల్క్ స్మిత , చిరంజీవిల డాన్స్ . ఆ ఊపు ఊపు అలా చివరిదాకా కొనసాగుతుంది . ఓయిరప్పా ఓయిరప్పా ఓయిరప్పా హోయ్ ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిట పెన్నిధి హాల్లో ప్రేక్షకుల్ని కూడా డాన్స్ చేపిస్తాయి . అలాంటిదే మరో పాట అంజనీ పుత్రుడా వీరాధివీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా . మీనా , చిరంజీవిల మీద సాగుతుంది . చిరంజీవి తల్లి పేరు అంజనాదేవి అనేది గమనార్హం .
వీరిద్దరి మీద మరో రెండు పాటలు ఉన్నాయి . ఒకటి చికి చికి చాం చిచాంకు చాం చికుచం పిల్లా పందెం కట్టో అనే పాట . ఇంకొకటి జోరుగున్నాది గులాబి గుంటిది చంటిది ఒంటరిగా అనే పాట . రోజా , చిరంజీవి మీద సాగే రెండు పాటల్లో ఒకటి batman dance . చాలా వెరైటీగా చిత్రీకరించారు కోదండరామిరెడ్డి . ప్రభుదేవాని మరోసారి మెచ్చుకోవాలి .
ఇంకో డ్యూయెట్ ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా ఏటవాలు చూపులో మౌనగీతమా . వేటూరి , భువనచంద్రలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర చాలా బాగా పాడారు . ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , అల్లు రామలింగయ్య , శ్రీహరి , శరత్ సక్సేనా , బ్రహ్మానందం , బాబూమోహన్ , జె వి సోమయాజులు , పరుచూరి గోపాలకృష్ణ , ఆలీ , నర్సింగ్ యాదవ్ , మన్సూర్ ఆలీ ఖాన్ , జయలలిత తదితరులు నటించారు . మా నరసరావుపేట వారు అక్కిరాజు సుందర రామకృష్ణ గవర్నరుగా కాసేపు తళుక్కుమంటారు .
కె సి శేఖర్ రెడ్డి , డి శివప్రసాద్ రెడ్డి నిర్మాతలు . తెలుగులో హిట్టయిన ఈ సినిమా తమిళంలోకి కూడా డబ్ అయింది . చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిలింపేర్ , Cinema Express అవార్డులు వచ్చాయి . బహుశా ఈ సినిమా చూడని సినీ ప్రేమికులు ఉండరేమో ! ఒకరూ అరా ఉంటే చూసేయండి . యూట్యూబులో ఉంది .
Share this Article