.
ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ … హుస్సేన్‌సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం (FTL) పరిధిలో నిర్మిస్తున్న హైరైజ్ బిల్డింగులు ఇప్పుడు వివాదంలో చిక్కుకోవడమే కాదు, జన్వాడ ఫామ్‌హౌజుకూ ఈ అక్రమ నిర్మాణాలకూ నడుమ లింకులపైనా పొలిటికల్, బ్యూరోక్రాట్, జర్నలిస్టు, రియల్ ఎస్టేట్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది… కాంగ్రెస్ పార్టీకి మరో అస్త్రం దొరికినట్టేనా కేటీయార్‌పై!!
విషయం ఏమిటంటే..? నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్‌ను ఆనుకుని, రెండెకరాల్లో సదరు సంస్థ నిర్మిస్తున్న 17 అంతస్తుల నివాస సముదాయానికి (బ్లిస్ ప్రాజెక్టు- 153 ఫ్లాట్స్) మంజూరు చేసిన నిర్మాణ అనుమతులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది… అంతేకాదు, ఇరిగేషన్ శాఖ కూడా తమ అనుమతులు తీసుకోలేదని ఫిర్యాదు చేయడంతో సోమవారం ‘హైడ్రా’ కమిషనర్ ఏ.వి. రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సంయుక్తంగా ఈ ప్రాజెక్టును తనిఖీ చేశారు… (ఆ సంస్థ అధినేత ప్రదీప్ రెడ్డి బద్వేలు…)
Ads
జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 450 ప్రకారం నిర్మాణ అనుమతులను రద్దు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ దరఖాస్తును సైతం జీహెచ్ఎంసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేని పక్షంలో భవనాన్ని వినియోగించడం చట్టవిరుద్ధం కావడమే కాకుండా, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి కనీస వసతులు లభించవు. ఇది కలకలం క్రియేట్ చేయడానికి నేపథ్యంలోకి వెళ్దాం…

ఎందుకు ఇప్పుడు కీలక చర్చల్లోకి వస్తోంది..? ఈ భవనాలకు 2018 డిసెంబరు 14న తొలి భవన నిర్మాణ అనుమతి ఇచ్చారు… 2020 జనవరి 2న సవరించిన అనుమతులు జారీ చేశారు… కీలక శాఖల అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ రావడం వెనుక అప్పటి మున్సిపల్ శాఖలో ఎవరు చక్రం తిప్పారనేది ప్రశ్న… అంటే అది కేసీయార్ పాలనకాలం…
జన్వాడ ఫామ్‌హౌస్ కు, సోమాజిగూడలో హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన భారీ ప్రాజెక్టుకు లింక్ ఉందా… క్విట్ ప్రోకో యవ్వారం ఏమైనా ముడిపడి ఉందా అనే అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే, జన్వాడలోని ఫామ్‌హౌస్ ఆస్తి తనదేనని ప్రదీప్‌రెడ్డి గతంలో కోర్టుకు తెలిపారు. అదే ప్రదీప్‌రెడ్డికి చెందిన నిర్మాణ సంస్థకు హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో రెండు భారీ టవర్ల నిర్మాణానికి అనుమతులు ఎలా వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి…
ఇంతకీ ప్రదీప్ రెడ్డి ఎవరు…? జన్వాడ, మిర్జాగూడ గ్రామాల పరిధిలోని సర్వే నంబర్లు 301 నుంచి 313 వరకు ఉన్న భూముల్లో నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నమోదైంది. తానే ఆ ఆస్తికి యజమానినని ప్రదీప్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. సర్వే నంబర్ 311లో 3.30 ఎకరాల భూమితో పాటు 1,210 చదరపు గజాల్లో నిర్మించిన ఫామ్‌హౌస్‌ను రిజిస్టర్డ్ సేల్‌డీడ్ల ద్వారా కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆస్తి ఆయన పేరునే ఉన్నట్లు కోర్టు ఉత్తర్వుల్లో నమోదైంది.
ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్‌హౌస్ భూమి, సోమాజిగూడ ప్రాజెక్టు అనుమతుల మధ్య ఏదైనా పరస్పర ప్రయోజన ఒప్పందం (క్విడ్ ప్రో కో) జరిగిందా అనేవి అనుమానాలు… జన్వాడలో ఫామ్‌హౌస్ భూమికి సహకరించినందుకు ప్రతిఫలంగా హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో బహుళ అంతస్తుల ప్రాజెక్టుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారా..? ఈ ప్రశ్నలకు జవాబుల్ని ఉన్నతాధికారగణం సీరియస్‌గానే తవ్వుతోంది… కేటీయార్‌కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారే సూచనలున్నాయా..?

అసలు ఈ భవనాలు నిర్మిస్తున్న ప్రాంతంలో… నిర్మాణానికి అనువైన జాగా ఒక్క మీటరు కూడా లేదని అధికారుల పరిశీలనలో తేలినట్టు చెబుతున్నారు… ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టు విస్తీర్ణం 7,640 చదరపు మీటర్లు. హైడ్రా, సాగునీటి శాఖ అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీలో 7,355 చదరపు మీటర్లు హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో ఉన్నట్లు గుర్తించారని సమాచారం…
మిగిలిన 285 చదరపు మీటర్లు 30 మీటర్ల బఫర్‌జోన్‌లో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు. దీంతో ప్రాజెక్టు స్థలంలో నిర్మాణానికి అనువైన భూమి ఒక్క చదరపు మీటరు కూడా లేదని తేలినట్టే కదా… అయినా రెండు సెల్లార్లు, స్టిల్ట్, 17 అంతస్తులతో రెండు టవర్లు, క్లబ్‌హౌస్ నిర్మాణానికి అనుమతులు ఎలా, ఎవరు ఇచ్చారు… ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్న స్థలంలో ఇంత భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఎవరు ఇప్పించారు? ఏ స్థాయిలో ఒత్తిడి వచ్చింది? నిబంధనలను ఎందుకు పక్కనపెట్టారు? అనే ప్రశ్నలు అధికార వర్గాల్లో చర్చకు వస్తున్నాయి…

సంబంధిత భూమిని టౌన్ సర్వే రికార్డుల్లో ‘ఖాళీ భూమి–చెరువులో మునిగిన ప్రాంతంగా నమోదు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈ భూమికి ఎలాంటి ఎన్‌వోసీ ఇవ్వలేదు. సాగునీటి శాఖ అనుమతి కూడా తీసుకోలేదని అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి.
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో ప్రైవేటు నిర్మాణ సంస్థకు భారీ ప్రాజెక్టు అనుమతులు రావడం సాధారణ పరిపాలన నిర్ణయం కాదు… తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎఫ్‌టీఎల్‌లో మరే ప్రైవేటు సంస్థకు ఇలాంటి అనుమతులు ఇవ్వలేదు… మరి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌కు మాత్రమే అసాధారణ రీతిలో అనుమతులు ఎలా ఇవ్వబడ్డాయి?
అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు హయాంలో ఈ అనుమతులు జారీ కావడంతో రాజకీయ విమర్శలు మరింత పెరిగాయి… నిజానిజాలు తేలాలంటే జన్వాడ భూ లావాదేవీలు, సోమాజిగూడ ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియ, అధికారుల ఫైల్ నోటింగ్స్, మంత్రిత్వ శాఖ స్థాయి ఆదేశాలపై సమగ్ర విచారణ చేపడితే తప్ప సాధ్యం కాదు…!!
తాజాగా రెరా కూడా రంగంలోకి దిగింది… ఈ ప్రకటన జారీ చేసింది…

Share this Article