.
( రమణ కొంటికర్ల ) … పునర్జన్మలుంటాయా…? ఇదో పెద్ద చర్చ! ప్రశ్న..? ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివే అయినప్పటికీ ఓ ఓల్డ్ స్టోరీ గురించి కాస్త చెప్పుకోవాలి. గత జన్మను గుర్తుపెట్టుకున్న బాలిక!
1930లలో ఢిల్లీలో శాంతిదేవి అనే ఓ చిన్నారి తన కుటుంబ సభ్యులతో ఆశ్చర్యకర విషయాలు షేర్ చేసుకుంది. 1926లో జన్మించిన శాంతిదేవి.. అసలు ఢిల్లీ తన నివాస స్థలమే కాదంటూ తల్లిదండ్రులను ఒకింత ఆందోళనకు గురిచేసింది. నాల్గేళ్ల వయస్సు నుంచే తనకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని చెప్పింది. ఢిల్లీకి సరిగ్గా 145 కిలోమీటర్ల దూరంలోని మథుర తన స్వస్థలమని పేర్కొంది.
Ads
మథురవాసైన లుగ్డీదేవి మరణించిన 1925, సెప్టెంబర్ 25 నాటినుంచి.. ఏడాదిపైన పదినెలలు.. అంటే సుమారు రెండేళ్లనంతరమే… డిసెంబర్ 11, 1926లో ఢిల్లీవాసైన బాబూ రంగ్ బహదూర్ కు శాంతిదేవి జన్మించడంతో.. లుగ్డీదేవి పునర్జన్మ కథ తెరపైకొచ్చింది.
వివరాల్లో స్పష్టతతో ఆసక్తి రేపిన చిన్నారి మాటలు! తనకు గత జన్మలో ఓ భర్త, ఓ బిడ్డ ఉన్నారని… తన పేరు లుగ్దీదేవి అని వెల్లడించింది. ప్రసవం అనంతరం కొద్దికాలానికే తాను మరణించానని చెప్పింది. మొదట్లో శాంతిదేవి తల్లిదండ్రులు అవన్నీ ఊహగానాలో, కల్పితాలో.. లేక, అమ్మాయి మానసిక స్థితి బాగాలేదనో భావించారు.
కానీ, కాలం గడుస్తున్నా ఆమె మాటల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వ్యక్తులు, ప్రదేశాలు, బంధువులు, తనకు గత జన్మలో జరిగిన ఘటనలు ఇలా అన్నీ స్పష్టంగా చెబుతున్నా.. తల్లిదండ్రులు మాత్రం పెద్దగా పట్టించుకోనట్టే వ్యవహరించారు.
పునర్జన్మలను మూఢనమ్మకాలుగా భావించే రోజుల్లో… శాంతిదేవిని ఆమె తల్లిదండ్రులు తన పునర్జన్మ జ్ఞాపకాల నుంచి మర్చిపోయేందుకే విశ్వయత్నం చేశారు. కానీ దాన్ని మాత్రమే మర్చిపోలేని స్థితిలో శాంతిదేవి.. సరిగ్గా ఆరేళ్లకు ఇంటినుంచి కూడా పారిపోయింది.
ఆమె చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం అవన్నీ పేపర్ పై పెట్టి నమోదు చేశారు!
శాంతిదేవి చెబుతున్న విషయాలు నిజమా, కాదా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఓ ఉపాధ్యాయుడికి కల్గింది. మథురలో నివసించే కేదార్ నాథ్ చౌబే అనే వ్యక్తికి ఆ ఉపాధ్యాయుడు ఓ లేఖ రాశాడు. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు ఏకంగా మథురకు వెళ్లాడు. శాంతిదేవి అనే చిన్నారి చెప్పిన గత జన్మ లుగ్డీదేవీ భర్తే కేదార్ నాథ్ చౌబే. ఏ వివరాలనైతే శాంతిదేవి చెబుతూ వస్తుందో.. అవే వివరాలతో సరిపోలేలా కేదార్ నాథ్ చౌబే నుంచి తిరిగి సమాధానం రావడంతో శాంతిదేవి పునర్జన్మ కథ మరింత ఆసక్తిగా మారింది.
ఆ తర్వాత ఢిల్లీలో భేటీ ఏర్పాటు!
ఆ భేటీకి కేదార్ నాథ్ చౌబే తన గుర్తింపును ఏ మాత్రం బయటపడకుండా దాచిపెట్టి వచ్చినా శాంతిదేవి అతడిని గుర్తు పట్టడంతోనే.. కేదార్ నాథ్ చౌబేతో సహా అంతా అవాక్కయ్యారు. ఆయన కుమారుణ్ని కూడా గుర్తించి.. వారి కుటుంబానికి మాత్రమే చెందిన పలు విషయాలను శాంతి ప్రస్తావించడంతో కేదార్ నాథ్ కన్విన్స్ అయ్యాడు. కానీ, మిగిలినవారిలో మాత్రం ఇంకా అయోమయం మాయమవ్వలేదు..
ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన శాంతిదేవి పునర్జన్మ ఘట్టం!
ఏకంగా మహాత్మాగాంధీనే ఆ ఘటనపై విచారణ జరపాలని సూచించారు. పరిశీలకుల బృందం శాంతిదేవితో కలిసి మథురకు వెళ్లింది. ఆమె చెప్పిన పలు విషయాలను పరిశీలించింది. ఆ తర్వాత ఆ బృందం ఇచ్చిన నివేదికతో పాటు.. పలు నివేదికలు శాంతిదేవి పునర్జన్మ గురించి వెలుగు చూశాయి.
1936లో రూపొందించిన ఒక నివేదికలో మాత్రం శాంతిదేవి చెబుతున్న ఘటనకు సులభరీతిలో వివరణ ఇవ్వడం కష్టమని పేర్కొన్నారు. అదే సమయంలో మరికొందరు పరిశోధకులు మాత్రం నిర్ధారించడానికి తగిన శాస్త్రీయ ఆధారాల్లేవనీ అభిప్రాయపడ్డారు.
విస్తృత చర్చకు దారితీసిన వింత కేసు!
లుగ్డీదేవిగా మరణశయ్యపై ఉన్న సమయంలో తన భర్త కేదార్ నాథ్ తనకిచ్చి విస్మరించిన అనేక వాగ్ధానాలనూ ఆ సందర్భంగా పూసగుచ్చింది శాంతి. ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కమిషన్… 1936లో శాంతిదేవి లుగ్జీదేవీ పునర్జన్మనేనని నిర్ధారిస్తూ ఓ నివేదికనిచ్చింది.
మనో విజ్ఞాన నిపుణులు, ఇతర పరిశోధకులు బాల్య జ్ఞాపకాలు, మానవ జ్ఞాపకశక్తి, గుర్తింపు వంటి అంశాలపైన ఇంకా విస్తృతమైన అధ్యయనాలు చేశారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం శాంతిదేవి వంటి పునర్జన్మ ఘటనలు అరుదుగా జరుగుతాయ్నది వారి వాదన. కానీ, వాటిని కచ్చితంగా నిర్ధారణ చేయడం కష్టమనీ కొందరు అభిప్రాయపడ్డారు.
అయితే మహాత్మాగాంధీ సూచనతో ఏర్పాటైన కమిషన్ ఇచ్చిన నివేదికపై… లుగ్డీదేవే శాంతిదేవిగా పునర్జన్మించడంపై మరిన్ని నివేదికలూ బయటకొచ్చాయి. బాల్ చంద్ నహతా ‘పునర్జన్మ కీ పర్యలోచన’ పేరుతో తన నివేదికను ఇదే అంశంపై ఓ హిందీ బుక్‌లెట్‌గా ప్రచురించారు.
పెద్దయ్యాక కూడా గుర్తు పెట్టుకున్న పునర్జన్మ జ్ఞాపకాలు!
శాంతిదేవి పెద్దయ్యాక కూడా గుర్తు పెట్టుకున్న అనుభవాల గురించి చెప్పడంతో ఈ స్టడీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అయితే, అదే సమయంలో శాంతిదేవి కేస్ స్టడీని పునర్జన్మకు తుది సాక్ష్యమన్నట్టుగా కూడా ఎక్కడా ఏ పరిశోధకులు నిర్ధారించలేదు. కానీ, లోతుగా, విస్తృతంగా పరిశీలించబడిన గతజన్మ జ్ఞాపకాల కేసుల్లో ఒక ప్రధానమైన కేస్ స్టడీగా మాత్రం గుర్తింపు పొందింది.
తనది పునర్జన్మ అని నమ్మి.. గతకాలపు యాదితోనే మళ్ళీ జీవితాంతం బతికిన శాంతిదేవి పెళ్లి చేసుకోలేదు. 1950ల చివరలో మళ్లీ తన కథను మరోసారి కూడా గుర్తు చేసింది శాంతీదేవి.
1986లో ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఇయాన్ స్టీవెన్‌సన్, కే.ఎస్. రావత్ కూ లుగ్డీదేవీగా తన మరణానికి సమీప అనుభవాలను, జ్ఙాపకాల్ని కూడా జోడించి చెప్పడంతో… కె.ఎస్. రావత్ తన పరిశోధనలను 1987లో కూడా ఆమెపై కొనసాగించాడు. మరణానికి నాలుగు రోజుల ముందు కూడా… 1987, డిసెంబర్ 27న ఆమె తన పునర్జన్మకు సంబంధించిన చివరి ఇంటర్వ్యూ ఇచ్చారు.
స్వీడిష్ అవార్డ్ విన్నింగ్ రచయిత Sture Lonnerstrand శాంతిదేవి పునర్జన్మ కథపై చాలాకాలం పరిశోధన చేసి.. 1994లో ఒక పుస్తకాన్ని రాశారు. 1998లో అది ఆంగ్లంలో రిలీజైంది. మొత్తంగా ఈ శాంతిదేవి చరిత్ర ఓసారి చెప్పుకుంటుంటే…. కేవలం రెండేళ్ల కాల వ్యవధిలోనే ఆమె మరణం తర్వాత పునర్జన్మించడమంటే… అచ్చూ శ్యాంసింగరాయ్ సినిమాను పోలి ఉన్నట్టనిపించడంలేదూ..?!
అందుకే, ఈరోజుకూ పూర్వ జన్మ జ్ఞాపకాలు, పునర్జన్మ వంటి అంశాలపై చర్చ జరిగినప్పుడల్లా ఇప్పటికీ శాంతిదేవి కేస్ స్టడీ ప్రపంచవ్యాప్తంగా తెరపైకొస్తూ ఉంటుంది.
Share this Article