.
“మేం వేరే దేశంలో ఉన్నాం, ఏదైనా రాస్తాం, కూస్తాం, మనల్ని ఇండియన్ చట్టాలు ఏమీ చేయలేవు” – సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే చాలామందిలో ఉండే అపోహ ఇది. తాము కూర్చున్న కుర్చీకి వేల మైళ్ల దూరం ఉంటే, తాము చేస్తున్న అసభ్యకరమైన, దేశద్రోహకరమైన వ్యాఖ్యలు ఎవరికీ తెలియవని, తమను ఎవరూ పట్టుకోలేరని భ్రమపడతారు. కానీ, ఆధునిక భారత భద్రతా వ్యవస్థల పనితీరు, మలప్పురం జిల్లాకు చెందిన మొహమ్మద్ సనూఫ్ ఉదంతంతో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది.
భ్రమలో బతుకుతున్నవారికి ఒక హెచ్చరిక! సనూఫ్ వ్యవహారం కేవలం ఒక వ్యక్తి అరెస్టు కాదు, అదొక మేల్కొలుపు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను కించపరుస్తూ, ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేశాడు. అప్పుడు తను సౌదీ అరేబియాలో ఉన్నాడు… నాకు ఏమీ కాదు, నేను సౌదీ అరేబియాలో సురక్షితంగా ఉన్నానని అతను భావించి ఉండవచ్చు. కానీ, భారత నిఘా వర్గాలు, సైబర్ సెల్ అధికారులు మౌనంగానే తమ పని పూర్తి చేశాయి. అతను చేసిన ప్రతి పోస్టు, ప్రతి కామెంట్ డిజిటల్ సాక్ష్యాలుగా మారి అతని చుట్టూ ఉచ్చు బిగించాయి.
Ads
ఉగ్రదాడి బాధితులలో ఒకరు కొచ్చికి చెందిన ఓ వ్యక్తి… తన కుమార్తె చేసిన సోషల్ మీడియా పోస్ట్‌పై ఈ సనూఫ్ అభ్యంతరకరమైన, ఉగ్రదాడిని సమర్థించే విధంగా వ్యాఖ్యలు చేశాడు… ఇదీ కేసు…
సమయం చూసి.. అడ్డంగా! చట్టం తన పనిని ఎప్పుడూ హడావుడిగా చేయదు. కానీ, ఎప్పుడు, ఎక్కడ పట్టుకోవాలో దానికి స్పష్టమైన వ్యూహం ఉంటుంది. సనూఫ్ కోసం లుకౌట్ సర్క్యులర్ సిద్ధం చేసి, అతను సురక్షితంగా ఇండియాకు తిరిగి వస్తున్నాడనుకున్న క్షణాన, కరిపూర్ విమానాశ్రయంలోనే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోవడం, చట్టం చేతులు ఎంత పొడవైనవో నిరూపించింది. “మేం గమనిస్తూనే ఉన్నాం, నీవు ఎక్కడున్నా సరే, భారత భూభాగంలోకి అడుగుపెట్టే ఆ ఒక్క క్షణం చాలు” అని వ్యవస్థ చెప్పకనే చెప్పింది.
ఇది ఒక పాఠం! సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు వేదిక కావాలే తప్ప, ద్వేషాన్ని చిమ్మడానికి, ఉగ్రవాదాన్ని సమర్థించడానికి కాదు. భారత చట్టాలైన UAPA వంటి కఠినమైన నిబంధనలు కేవలం దేశం లోపల ఉన్నవారికి మాత్రమే వర్తించవు; డిజిటల్ వేదికల ద్వారా దేశ సమగ్రతకు, సామాజిక సామరస్యానికి భంగం కలిగించే ప్రతి ఒక్కరికీ ఈ చట్టాలు వర్తిస్తాయి.
నేడు సనూఫ్ ఉదంతం చూస్తుంటే ఒక్కటే అర్థమవుతోంది: “మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా… భారత దేశం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీరు చేసే ప్రతి తప్పుడు అడుగును రికార్డ్ చేస్తూనే ఉంటుంది. సమయం చూసి, చట్టం మిమ్మల్ని అడ్డంగా బుక్ చేసే రోజు ఎంతో దూరంలో లేదు…”
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారికి, తమకున్న డిజిటల్ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారికి, ఇదొక హెచ్చరిక. చట్టం కళ్ళు కప్పడం అసాధ్యం, ఒకవేళ కప్పినా అది ఎంతో కాలం నిలవదు. ఈ ఉదాహరణ విదేశాల్లో ఉండి, దేశం మీద, మతం మీద విషాన్ని కక్కే ప్రతి ఒక్కరికీ ఓ పాఠమే!! ప్రస్తుతం తనకు బెయిల్ కూడా దొరకడం లేదు!!
Share this Article