.
( – మానేటి ప్రతాపరెడ్డి ) … రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే కాకుండా, సేవలను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో సంపూర్ణంగా ‘డిజిటల్ గవర్నెన్స్ – టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్’ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం, కాగిత రహిత (పేపర్‌లెస్) పాలనను ప్రోత్సహించడం, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ భారీ డిజిటల్ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జులై 10 నాడు జీవో నెం. 87 విడుదల చేశారు.
Ads
డిజిటల్ గవర్నెన్స్ ప్రధానాంశాలు ఇవే…
ఈ కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వ శాఖలన్నింటినీ అనుసంధానిస్తూ ప్రధానంగా రెండు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను తీసుకురానున్నారు.
1.ఈ-హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్ (e-HRMS): ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, సర్వీస్ రిజిస్టర్లు, బదిలీలు, పదోన్నతులు, సెలవుల నిర్వహణ, పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్, వేతనాలు, పెన్షన్లు, ఆధార్ అథెంటికేషన్ మరియు రిటైర్మెంట్ ప్రయోజనాల వరకు.. ఉద్యోగి సర్వీస్ కాలానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిజిటలైజ్ చేస్తారు.
2.ఈ-ఆఫీస్ / ఈ-ఫైల్ సిస్టమ్: కార్యాలయాల్లో కాగితపు ఫైళ్ల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రానిక్ ఫైల్ మూవ్‌మెంట్, డిజిటల్ నోటింగ్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్, డిజిటల్ సంతకాలతో కూడిన పేపర్‌లెస్ విధానాన్ని అమలు చేస్తారు.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు: ఈ డిజిటల్ గవర్నెన్స్, ‘ఈ-హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్’ ప్రాజెక్టును నిర్దేశిత కాలపరిమితిలోగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ సభ్యుల వివరాలు:
చైర్మన్: బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, IAS (స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సాధారణ పరిపాలన శాఖ)
కన్వీనర్: సిక్తా పట్నాయక్, IAS (స్పెషల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ)
సభ్యులు:
అనుదీప్ దురిశెట్టి, IAS (జాయింట్ సెక్రటరీ, ఐటీ శాఖ)
పి.వి.రమణారావు (డైరెక్టర్ ఐటీ, ఆర్థిక శాఖ)
పద్మావతి (జాయింట్ సెక్రటరీ, జీఏడీ)
సుధారాణి (జాయింట్ సెక్రటరీ, జీఏడీ)
పార్వతి (డైరెక్టర్, ట్రెజరీస్ & అకౌంట్స్)
ఇ.వి.వి.నాగేశ్వరరావు (జాయింట్ సెక్రటరీ, ఆర్థిక శాఖ-HRM)
కమిటీ బాధ్యతలు:ఈ కమిటీ అన్ని ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ విప్లవం సజావుగా సాగేలా పర్యవేక్షించనుంది. ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు సంధానం, లీవ్ మేనేజ్‌మెంట్, ఏపీఏఆర్ (APAR) వార్షిక పనితీరు నివేదికలు, క్రమశిక్షణా చర్యల పర్యవేక్షణ, ట్రెజరీ, ఐఎఫ్ఎంఐఎస్ (IFMIS) వ్యవస్థలతో అనుసంధానం వంటి మొత్తం 24 రకాల అంశాలను ఈ కమిటీ నిరంతరం సమీక్షిస్తుంది. మాన్యువల్ విధానం నుంచి పేపర్‌లెస్ ఆఫీస్ వైపు శాఖలు మారేలా Roadmap రూపొందిస్తుంది.
ఈ డిజిటల్ పరివర్తనకు అన్ని సచివాలయ పరిపాలనా విభాగాలు, శాఖాధిపతులు పూర్తి సమాచారాన్ని, సహకారాన్ని అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సాధించిన ప్రగతిని సమీక్షించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తుందని జీవోలో పేర్కొన్నారు… (సంజయ్ జాబు డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, సర్వీసెస్‌పై బాగా ఆసక్తిఉన్నవారే. మీ-సేవకు ఆద్యుడు తనే… కేంద్ర సర్వీసులో ఉన్నప్పుడు కూడా ఈ కోణంలో బాగా వర్క్ చేసినట్టు చెబుతారు…)
Share this Article