.
బీఆర్ఎస్ పార్టీది ఓ విచిత్రమైన పొలిటికల్ స్ట్రాటజీ… ప్రతిదీ మా కేసీయార్ మాత్రమే చేశాడు, తనదే ఘనత, జాతిపిత, తను లేకపోతే ఈ ఘనత లేదు, అసలు ప్రపంచంలోనే నెంబర్ వన్, ఇదుగో స్వర్ణ తెలంగాణ ఎట్సెట్రా బోలెడు విశేషణాలతో ఊదరగొట్టుకోవడం, అంటే జబ్బలు చరుచుకోవడం బాగా అలవాటైంది…
అదే సమయంలో పనిలోపనిగా రేవంత్ రెడ్డిని ఆక్షేపించడం! నిజంగా సొసైటీకి ఏదైనా మంచి జరిగితే దాని తాలూకు శుభాన్ని ఆనందించడం, క్రెడిట్ తీసుకోవడంలో తప్పేమీ లేదు… కాకపోతే ప్రతిదీ అదే ధోరణి… అదో తరహా ధోరణి… తాజా ఉదాహరణలు కావాలా..?
Ads
పాలమూరు జిల్లాలో, అమర్‌రాజా గిగా కారిడార్‌లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ వచ్చింది… గుడ్, తెలంగాణకు ఓ మంచి పెట్టుబడి, తెలుగువాడిది… కానీ అదెలా వచ్చింది..? కులమో, ధనమో, పార్టీయో… కారణం ఏదైతేనేం… అమరరాజా ఏపీ నుంచి బయటపడాలని భావించింది… భవిష్యత్తు ప్రాజెక్టులే కాదు, ఉన్నవీ తరలించుకోవాలనీ, ఎప్పుడైనా ఇక జగన్ నుంచి ఇబ్బందే అని తలచింది… అలా తెలంగాణకు వచ్చింది…

అదేమీ తెలంగాణ మీద ప్రేమ కాదు… దాన్ని ప్రారంభిస్తున్నవేళ కేటీయార్ పెద్ద క్రెడిట్ తీసుకున్నాడు… దీన్ని నిజంగా కేసీయార్ ఘనత జాబితాలో చేర్చాలా..? సేమ్, గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసే స్కీమ్… దేవాదుల… నిన్న కేసీయార్ మౌత్ పీస్ నమస్తే తెలంగాణ పత్రికలో ఓ అతి భారీ ఆర్టికల్… ఏమనీ..?
అదీ కేసీయార్ దూరదర్శనం, మార్గదర్శనమే అన్నంతగా… ఇదీ కేసీయార్ రీఇంజినీరింగ్ ఫలితమేనట… స్వరాష్ట్ర ఉద్యమానికి జడిసి చేపట్టారట, కానీ కేసీయారే దాన్ని ఉద్దరించాడట, ఇప్పుడు రేవంత్ రెడ్డి రెండేళ్లుగా పఢావు పెట్టాడట… విషయం ఏమిటంటే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు దేవాదుల పంపులన్నీ నడిపిస్తూ నీటిని ఎత్తిపోస్తోంది… ఈ ఎల్‌నినో దుర్దినాల్లో ఇది పెద్ద ఊరట… ఆ క్రెడిట్ కొట్టేయడానికి నానా భ్రష్టకథనాలు… (దేవాదుల గురించి ఏమైనా చెప్పుకోవాలంటే పొన్నాల లక్ష్మయ్య, కడియం శ్రీహరిలకు అర్హత ఉంది)…

నిజం ఏమిటంటే..? దేవాదులకు 2001లో శంకుస్థాపన జరిగింది… ఈ సమయంలో ఇదే కేసీయార్ అదే బాబు గారి శిష్యరత్నం, రవాణా మంత్రి… బాబు సిట్ అంటే సిట్, అప్ అంటే అప్… అప్పటికి తెలంగాణ ఉద్యమాల అలికిడి లేదు, దొరవారిలో ఆ వాసనలే లేవు… ఆ కొలువులోనే ఒద్దికగా ఉండేవాడు… మరి అంత ప్రేమ ఉన్నవాడు, తన పదేళ్ల పాలనలో మళ్లీ దేవాదులను ఎందుకు పట్టించుకోలేదు..? ఎందుకు పూర్తిచేయలేదు..? ఈరోజుకూ అది ఓ అసంపూర్ణ ప్రాజెక్టు… నిర్మాణవ్యయం రెట్టింపు, ఇంకా 2 వేల ఎకరాలు సేకరించాలి, వందల కోట్లు కావాలి..? మరి ఏం చెప్పుకోవడానికి ఈ బాజాకథనాలు..?

పైగా కాళేశ్వరం నుంచి నీళ్లను చంద్రబాబు కోసమే గురుదక్షిణగా వదిలేస్తున్నాడని రేవంత్‌ను నిందిస్తున్నాడు కదా కేటీయార్, హరీష్ రావు… నిజంగా అలా చేసేపక్షంలో మరి దేవాదుల నీటిని ఎందుకు ఎత్తిపోస్తున్నాడో చెప్పాలి కదా… దేవాదుల నుంచి లిఫ్ట్ చేసేది కూడా గోదావరి నీళ్లు కాదా..?

సేమ్, నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ… సేమ్, ఉద్యోగ నియామక పత్రాల జారీ… నువ్వు నియామకపత్రాలు ఇస్తావా..? నువ్వు ఆయిల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తావా అని హరీష్ రావు అడ్డదిడ్డం విమర్శలు… అంటే, ఇవన్నీ కేసీయార్ జేబులో నుంచో, తను సంపాదించిన సొత్తు నుంచో ఖర్చు పెట్టినవా..? తెలంగాణ సమాజం ఆస్తులు అవి… కేసీయార్‌కు పేరొస్తుందనే భేషజంతో రేవంత్ రెడ్డి పఢావుపడేయలేదు… ప్రాణహిత- చేవెళ్లను కేసీయార్ పండబెట్టినట్టు గాకుండా..!!

సేమ్, ఈమధ్య పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో నార్లాపూర్ పంపు నడిపిస్తూ నీటిని లిఫ్ట్ చేస్తున్నారు… అదీ మా ఘనతే అంటూ వెంటనే బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటోంది… కేవలం కమీషన్ల కాళేశ్వరంపైనే కాన్సంట్రేట్ చేసి దక్షిణ తెలంగాణ, కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం వల్ల కదా, ఈరోజు ఆ ప్రాజెక్టుల నీటివాటాల కోసం రేవంత్ రెడ్డి నానాతిప్పలూ పడుతున్నది, ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులకు సిద్దపడింది…

నిజాలు ఇవీ… కృష్ణా ప్రాజెక్టుల్ని సకాలంలో కేసీయార్ పూర్తి చేసి ఉంటే… ఆటోమేటిక్‌గా మనకు వాటిపై నీటిహక్కులు వచ్చి ఉండేవి… పూర్తయిన ప్రాజెక్టులకు ఏ బ్రజేష్ ట్రిబ్యునలూ నీటి హక్కును నిరాకరించదు… చెబుతూ పోతే ఇలాంటివి బోలెడు… యూరియా యాప్ రద్దు చేస్తాం, ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం వంటి విమర్శలకూ అభ్యంతరకరమే…
హరీష్ రావుకు తెలుసో లేదో... ప్రభుత్వం అంటే ఓ కంటిన్యుయస్ ప్రాసెస్..!! వ్యక్తులు అప్రస్తుతాలు, వ్యవస్థలే అంతిమం!! అది గుర్తుంచుకోవడమే రాజకీయ విజ్ఞత!!
Share this Article