.
Mohan Goteti …. మరువలేని అభినయ సౌందర్యం!
1992 అనుకుంటాను.. ఆ రోజు ‘మనవరాలి పెళ్లి’ షూటింగ్ జరుగుతోందని తెలిసి, ‘సితార’ కోసం కవరేజీకి వెళ్లాను.
లొకేషన్ కి వెళ్లగానే ఆ సినిమా దర్శకుడు, మా మిత్రుడు పి.ఎన్.రామచంద్రరావు ఎదురొచ్చారు.
“రండి మోహన్.. మా కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తాను” అన్నారు.
అటు వెళ్లగానే పరికిణి, ఓణీలో మెరిసిపోతున్న ఇరవై ఏళ్ల అందమైన అమ్మాయి నవ్వుతూ కనిపించింది.
చూడగానే మన ఇంట్లో అమ్మాయిలానో.. మన పక్కింటి అమ్మాయిలానో అనిపించింది.
ఒక హీరోయిన్ లా అస్సలు అనిపించలేదు!
Ads
ముందుగా నాగురించి చెప్పి .. తర్వాత ఆమెను పరిచయం చేస్తూ..”ఈ అమ్మాయి అసలు పేరు సౌమ్య.. సినిమాల కోసం సౌందర్యగా మార్చుకుంది. కన్నడ అమ్మాయి” అన్నారు పి.ఎన్.ఆర్.
ఈ అమ్మాయి భవిష్యత్తులో మంచి నటి అవుతుందని.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళుతుందని.. ఆక్షణంలో నాకు అస్సలు అనిపించలేదు!
“కన్నడలో ఎన్ని సినిమాలు చేశావు?” అంటే, రెండు మూడు చేశానని ముక్తసరిగా చెప్పింది. తర్వాత మరో మాట కూడా చెప్పింది.. సినిమాలంటే తనకు ఇష్టం లేదని!
“నాకు చదువుకోవాలని వుందండి.. ఏమో.. చెప్పలేను… మధ్యలో సినిమాలు వదిలేసి వెళ్లిపోతానేమో!” అంది నవ్వుతూ.
నాకు ఆశ్చర్యమేసింది.. సినిమాలంటే ఇంట్రస్ట్ లేదని చెప్పిన మొదటి కథానాయిక తనే!
ఎందుకంటే, పెద్ద హీరోయిన్ అవ్వాలనే అందరూ ఇక్కడికి వస్తారు. అదే మాట కూడా మాకు చెబుతుంటారు.
ఇంతలో వాళ్ల నాన్నగారు సత్యనారాయణ గారు వచ్చారు. కన్నడలో ఆయన రచయిత, నిర్మాత కూడా!
ఆయనకి కూతుర్ని పెద్ద హీరోయిన్ గా చూడాలన్నది కోరిక..
అందుకే ఆమెను అంటిపెట్టుకుని ఉంటూ.. మంచి సినిమాల కోసం దర్శక నిర్మాతలని కలుస్తుండేవారు.
ఆ తర్వాత కొద్దికాలానికే సౌందర్య లక్కీగా ఎస్వీ కృష్ణా రెడ్డి గారి చేతిలో పడింది!
‘రాజేంద్రుడు- గజేంద్రుడు’, ‘మాయలోడు’, ‘నెంబర్ వన్’ చిత్రాలు చేసేసింది వరుసగా..
కథానాయికని ఎంతో పొందికగా ఆయన చూపించే తీరు ఆమెకు నచ్చింది.. ఆయనంటే గౌరవం ఏర్పడింది.
అందుకే, బాబూమోహన్ తో డ్యూయెట్ అనగానే.. చాలామంది చేయద్దని వారించినా.. నమ్మకంతో చేసేసింది.
అప్పటికే ఆమెకు బాగా చేస్తోందనే పేరొచ్చేసింది.
ఆ పేరుతో పాటే మరో పేరు కూడా వచ్చేసింది..
అదేంటంటే.. ఇతర హీరోయిన్లలా సౌందర్య ఎక్స్ పోజింగ్ చేయదట.. డ్రెస్సింగ్ విషయంలో కచ్చితంగా ఉంటుందట.. అనేదే ఆ పేరు!
ఇది ఇండస్ట్రీలో అప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది.
అప్పటికే ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లు పోటీపడి మరీ ఎక్స్ పోజింగ్ చేసేస్తున్నారు..
ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ మారుమాటాడకుండా వేసేసుకుంటున్నారు.. సౌందర్య మాత్రం రూల్స్ పెడుతోంది!
‘ఇలా అయితే ఈ అమ్మాయి ఇక్కడ సక్సెస్ కావడం కష్టం’ అన్నారంతా..
‘ఈ రూల్స్ పెట్టే అమ్మాయిని ఎవరు భరిస్తారు?’ అంటూ కామెంట్లు కూడా వినిపించాయి.
అదే ఓసారి ఆమె వద్ద ప్రస్తావించి.. “మీ మీద బయట ఇలాంటి ప్రచారం జరుగుతోంది.. ఎలా నెగ్గుకొస్తారు?”అని అడిగా.
నవ్వి ఊరుకుంది.. ‘మీరే చూస్తారుగా’ అన్నట్టు!
‘ఆమె అంతే.. తన లిమిట్స్ దాటదు’ అన్న విషయం అందరికీ అర్థమైపోయింది.
అయితే, ఆ సౌందర్యాన్ని ఎవరూ వదులుకోవడానికి సిద్ధపడలేదు .. ఆమెకు తగ్గట్టుగానే క్యారెక్టర్లు క్రియేట్ చేశారు.
‘హలో బ్రదర్’ వంటి సినిమాలలో నటించినా గ్లామరస్ గా కనిపించింది తప్పితే.. తన పరిధి మాత్రం తాను దాటలేదు.
మంచి సత్తా వున్న క్యారెక్టర్ల కోసం ఎదురుచూసింది..
ఆ సమయ్మలోనే అదృష్టం ఆమె తలుపుతట్టింది.. ‘అమ్మోరు’ రూపంలో ఆమెకు సూపర్ హిట్ పడింది!

ఇంకేముంది.. అంతవరకూ ‘ఈ అమ్మాయి లాభం లేదంటూ పెదవి విరిచిన వాళ్లే.. ఆమె అభినయాన్ని పొగడడం మొదలెట్టారు.
ఆహా.. ఓహో.. మరో సావిత్రి అంటూ కీర్తించారు.
‘పవిత్రబంధం’ వంటి సినిమాలలో తన సత్తా చాటి.. ఎక్స్ పోజింగ్ చేయకుండానే కేవలం అభినయంతోనే అగ్ర స్థానాన్ని చేరుకోవచ్చని నిరూపించింది.
‘అంతఃపురం’ సినిమాలో అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఉత్తమ నటిగా నంది అవార్డులు.. కర్ణాటక ప్రభుత్వ అవార్డులు లెక్కలేనన్ని ఫిలిం ఫేర్ అవార్డులు అందుకుని అభినయానికి కొత్త చిరునామా అయింది!
బయట కూడా తను సాదాసీదాగానే వుంటుంది.. షూటింగులో వున్నా.. ఎక్కడున్నా హోమ్లీగానే వుంటుంది.
హైదరాబాదులో మిగతా హీరోయిన్లంతా స్టార్ హోటల్స్ లో వుంటే.. తను మాత్రం హోటల్స్ లో వుండేది కాదు. బంజారాహిల్స్ లోని కార్వీ ఆఫీసు పక్కనున్న ‘ప్రశాంత్ కుటీర్’ గెస్ట్ హౌస్ లో బస చేసేది.
1993లో తొలిసారిగా ఆ గెస్ట్ హౌస్ లో దిగింది..
ఇక అప్పటి నుంచీ చివరి వరకు అక్కడే వుంది.
ఆ గెస్ట్ హౌస్ లోని సూట్ రూమ్ ‘నెంబర్ 10’ అంటే ఆమెకు ఎంతో ఇష్టం.
ఒక విధంగా ఆ రూమ్ ని సెంటిమెంట్ గా భావించేది. ఆమె కోసం ఆ రూమ్ ని గెస్ట్ హౌస్ నిర్వాహకులు ఎప్పుడూ రిజర్వ్ చేసి వుంచేవారు.
తమ దగ్గరి భోజనాన్నే ఆమె ప్రిఫర్ చేసేవారనీ, ఆమె ప్యూర్ వెజిటేరియన్ అనీ, ఆమెకు భేల్ పురి అంటే చాలా ఇష్టమనీ, ఎప్పుడైనా సాయంకాలం సమయాల్లో భేల్ పురి తెప్పించమని అడిగేవారనీ ఆ గెస్ట్ హౌస్ మేనేజర్ శంకర్ ఇప్పటికీ చెబుతుంటారు.

ఆ గెస్ట్ హౌస్ లోనే ఆమెను నేను చాలాసార్లు మా ‘సితార’, ‘ఈనాడు’ పత్రికలతో పాటు ఈటీవీకి కూడా ఇంటర్వ్యూ చేశాను.
సినిమాలో తాను పోషించిన క్యారెక్టర్లలానే.. వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె చాలా హుందాగా వుండేది.
షూటింగుల్లో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, ఒట్టినే వాళ్లతోనూ.. వీళ్లతోనూ బాతాఖానీ కొట్టడం కానీ చేసేది కాదు. షాట్ గ్యాప్ లో అలా దూరంగా వెళ్లి కూర్చుని ఏవైనా బుక్స్ చదువుకునేది..
లేకపోతే తదుపరి సీన్ కి సంబంధించిన డైలాగ్స్ ప్రిపేర్ అయ్యేది.
మామూలుగా ఇద్దరు హీరోయిన్లు ఒక సినిమాలో వుంటే కనుక ఆ సినిమా హీరోకి, మిగతా వాళ్లకీ కూడా కాస్త ఇబ్బందే.
ఎవరితో ఎక్కువ మాట్లాడినా మరొకరు ఫీలైపోతూ వుంటారు. షూటింగుల్లో ఇది మా జర్నలిస్టులకి కూడా అప్పుడప్పుడు ఎదురవుతుంటుంది.
అయితే, సౌందర్య మాత్రం ఇలాంటి వాటికి దూరం.. ఎవరు ఎవరితో మాట్లాడుకున్నా ఆమె పట్టించుకునేదికాదు.
తన పనేదో తనదే అన్నట్టు వుండేది.. ఎవరైనా తన దగ్గరకి వస్తే మాత్రం నిండుగా మాట్లాడేది.. అంతే!

చిరంజీవి గారి ‘రిక్షావోడు’ సినిమాలో నగ్మా, సౌందర్య ఇద్దరూ కలిసి నటించారు. ఈ కాంబినేషన్లో సీన్స్ జరుగుతున్నప్పుడు రెండు మూడుసార్లు నేను కూడా వెళ్లడం జరిగింది. ఇద్దరూ నాకు బాగా పరిచయమే.. ముందుగా నగ్మాతో మాట్లాడి.. ఆ తర్వాత సౌందర్యని విష్ చేసినప్పటికీ.. ఏమీ ఫీలయ్యేది కాదు.. నవ్వుతూ పలకరించి, మాట్లాడేదే కానీ, ఎటువంటి భేషజం చూపించేది కాదు.
అది సౌందర్య సంస్కారం.. అది ఆమె నేచర్!
టాప్ హీరోయిన్ గాఎదిగాక కూడా ఆమెలో ఎటువంటి మార్పూ కనపడలేదు..
మొదటి సినిమా సమయంలో ఎలా వుందో అలాగే వుండేది..
అదే చిర్నవ్వు.. అదే నిరాడంబరత.. అదే అణకువ! మొదట్లో సినిమాలంటే ఆసక్తి లేదన్న సౌందర్య.. ఆఖరికి సినిమాలలోనే సెటిల్ అయి.. తెలుగు, తమిళ అగ్ర హీరోలతో సినిమాలు చేసి, హిందీలో అమితాబ్ బచ్చన్ తో కూడా నటించింది.
ఒకప్పుడు సినిమాలంటే ఇష్టం లేదని చెప్పిన అమ్మాయి.. తర్వాతి కాలంలో టాప్ హీరోయిన్ గా రాణించడమే ఒక విశేషం అనుకుంటే..
‘నేను ఎక్స్ పోజింగ్ చేయను’ అని చెప్పి.. చివరి వరకు అదే మాట మీద నిలబడి సక్సెస్ అవ్వడం మరో విశేషం!
2004లో ఒకరోజు మధ్యాహ్నం అప్పుడే లంచ్ చేసి.. అక్కడి హాలులో కూర్చున్నాను ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ..
ఈ లోగా సౌందర్య మెట్ల మీద నుంచి దిగివస్తోంది.. మెరుపులా అలా వెళ్లిపోయింది..
నన్ను చూడలేదనుకున్నాను..
అంతలోనే విచిత్రంగా మరోక్షణంలో వెనక్కి వచ్చి.. ”మోహన్ గారూ బాగున్నారా?” అంటూ నవ్వుతూ విష్ చేసింది..
కాసేపు మాట్లాడుకున్నాం.. తర్వాత తను వెళ్లిపోయింది.
ఇరవై రోజుల తర్వాత నేను మా ఈనాడు ఆఫీసులో వుండగా.. హాస్య నటుడు ఏవీఎస్ నుంచి ఫోన్.. “సార్.. సౌందర్య పోయిందట.. విమాన ప్రమాదమట” అంటూ ఆ విషాద వార్త చెప్పారు.
ఆఫీసులో అంతా షాక్..
మొదట ఎవరూ నమ్మలేదు..
ఎలా నమ్మగలం అలాంటి వార్తని?
అన్యమనస్కంగా సినిమాలలోకి వచ్చి.. తను గీసుకున్న గిరి దాటకుండా.. విలువలకు కట్టుబడి.. పలు విజయవంతమైన చిత్రాలు చేసి.. తనదైన బ్రాండ్ వేసిన గొప్ప నటి.. అలా అతి చిన్న వయసులోనే కనుమరుగవడం ఎవరికైనా షాకే కదా?
-మోహన్ గోటేటి
(జులై 18 ఆమె జయంతి సందర్భంగా పాత జ్ఞాపకాలు)
Share this Article