Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఐనవాళ్లు ఉన్నా… అనాథ ప్రేతాలే !! ముసలితనమే ఓ ‘ఒంటరిశాపం’…!!

August 7, 2026 by M S R

.

నిన్న సోషల్ మీడియాలో కనిపించింది ఓ పోస్టు… దాని సారాంశం ఇదుగో ఇలా… “తమ కడుపు మాడ్చుకుని మన కడుపు నింపిన వారు.. తమ కోరికలను త్యాగం చేసి మన కలలను నిజం చేసిన వారు..” కానీ, నేడు అదే తల్లిదండ్రుల జీవిత చరమాంకం అభాగ్యుల అడుగుల చప్పుళ్ల మధ్య, వృద్ధాశ్రమాల నాలుగు గోడల మధ్య ముగిసిపోతోంది.

  • హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త ఉదంతం ఇందుకు హృదయవిదారకమైన ప్రత్యక్ష నిదర్శనం. ఆస్తులు, అంతస్తులు సంపాదించి పిల్లలను ప్రయోజకులను చేసిన ఆ తండ్రి, చివరి రోజుల్లో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలోనే తుదిశ్వాస విడిచారు.

కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపునకు కుమార్తెలు రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్‌లో వీడియో కాల్‌ ద్వారా వీక్షించి సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందని భావించారు. ముగ్గురు కుమార్తెలూ అంతే…

Ads

జ్ఞాపకాల బరువు.. ఒంటరితనం ముగింపు …. కొడుకులు విదేశాల్లో ఉన్నారని, కూతుళ్లు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారని గొప్పలు చెప్పుకునే సమాజమే.. చివరికి ఆ తల్లిదండ్రులు అనాథలుగా మరణిస్తే కనీసం తలకొరివి పెట్టడానికి కూడా ముందుకు రాని దుస్థితిని చూస్తోంది. కోట్లు సంపాదించి పెట్టిన ఆస్తులు చివరి క్షణంలో ఆశ్రయం ఇవ్వలేకపోయాయి. ఆప్యాయంగా పలకరించే నాలుగు మాటలు కరవై, ప్రాణం పోయే వేళ గొంతు తడవడానికి నీళ్లు కూడా దొరకని స్థితిలో ఎంతోమంది వృద్ధులు అసువులు బాస్తున్నారు.

“వీడియో కాల్ ప్రేమకు ప్రత్యామ్నాయం కాదు, అది కేవలం ఒక సాధనం మాత్రమే.”

తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కోరుకునేది కోట్ల రూపాయలు కాదు.. మన ప్రేమ, మన సమయం, మన ఆప్యాయత మాత్రమే. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఎక్కడో దూరంగా ఉండొచ్చు.. కానీ మనసులు మాత్రం దూరం కాకూడదు. వారు బతికున్నప్పుడే వారితో మాట్లాడండి. వారి ఆరోగ్యం గురించి తెలుసుకోండి.

వారు వెళ్లిపోయిన తర్వాత కార్చే కన్నీళ్లు, పెట్టే పూలదండలు, ఘనంగా చేసే అంత్యక్రియలు.. వారు బతికున్నప్పుడు చూపాల్సిన ప్రేమకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవు.

Loneliness in old age

“తల్లిదండ్రులు మన మొదటి దేవుళ్లు.. వారు ఉన్నప్పుడే వారిని గౌరవించడం నిజమైన భక్తి. వారు లేనప్పుడు కన్నీరు కార్చడం కాదు, వారు బతికున్నప్పుడే వారి కళ్లలో ఆనందం నింపడమే నిజమైన సంతానం ధర్మం.” ఇంటి పెద్దలను గౌరవించే కుటుంబం నిలబడుతుంది, తల్లిదండ్రులను ప్రేమించే సమాజం కలకాలం వర్ధిల్లుతుంది…

…….. ఇదీ ఆ సోషల్ మీడియా పోస్టు సారాంశం… నిజానికి ఇది కేవలం ఒక ఉదాహరణ… బయటికి రాని కథలు కొన్ని వందలు, కొన్ని వేలు… విదేశాల్లో ఉండి పిల్లలు రాలేకపోవడానికి కొన్ని విలువైన, సమర్థించుకోగల కారణాలు ఉంటాయి… మరీ ఇప్పుడైతే వీసాలు, స్టాంపింగ్ సమస్యలు మన్నూమశానం చాలా ఉన్నాయి… కానీ ఈ దేశంలోనే ఉండీ రాకపోవడం మాత్రం చివుక్కుమనిపించేదే…

యాంత్రిక జీవన శైలి, వ్యక్తిగత స్వార్థం, కృతజ్ఞతారాహిత్యం, డిటాచ్‌మెంట్స్ వంటి ఎన్ని కారణాలుగా చెప్పుకున్నా సరే… ఒకప్పటి కుటుంబం ఇప్పుడు లేదు… ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ యుగంలో ఇలాంటివి ఇంకా చాలా చాలా చెప్పుకోవాల్సి వస్తుంది… కొన్నాళ్లకు ఇవీ వార్తల్లోకి రాకుండా, సహజమైన పరిణామంగా మారిపోతాయి…

నాకు తెలిసిన ఓ ఉదాహరణ… గయకు వెళ్లి ఆత్మపిండం పెట్టుకుని వచ్చాడు… అంటే, తరువాత రోజుల్లో తనకు ఎవరూ పితృకర్మలు పెట్టాల్సిన పనిలేదు… ఎవరూ రారు, ఎవరికీ తాను ఏమీ కానని నిర్ధారణకు వచ్చాడు… ఓ వృద్ధాశ్రమంలో చేరాడు, డబ్బు డిపాజిట్ చేశాడు, ఆ వడ్డీతో నెలనెలా మెయింటెనెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం వంటి తన ఖర్చులకు సరిపడా కాసింత డబ్బు… మరణించాక తన అంత్యక్రియలకు సరిపడా డబ్బును కూడా అదనంగా డిపాజిట్ చేశాడు…

  • ఎంత డిటాచ్‌మెంట్ అంటే… తనకంటూ ఏ జ్ఞాపకాలను మిగుల్చుకోలేదు… నాలుగు దుస్తులు, చెప్పులు, ఓ ఫోన్, రోజూ వేసుకునే మందుల డబ్బా… మంచం, ఫ్యాన్, కుర్చీ కూడా ఆశ్రమం ఇచ్చినవే… అవును, తనకంటూ ఎవరూ లేరు, ఏమీ లేవు..!! ఓ అవస్థరహిత మరణం కోసం ఎదురుచూసే ప్రాణం తప్ప..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాకెంత? నీకెంత? – కేటీఆర్ చెప్పే లొట్టపీసు కేసులో చాలా పెద్ద కథ !!
  • ఐనవాళ్లు ఉన్నా… అనాథ ప్రేతాలే !! ముసలితనమే ఓ ‘ఒంటరిశాపం’…!!
  • విస్మయ ! సూపర్ స్టార్ కూతురు ! హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంట్రీ !!
  • కొరియన్ కనకరాజూ… కథ మరీ కామెడీ అయిపోయిందోయ్…
  • అరుపులు – కేకలు – నెత్తురు – బీజీఎం మోత – బీభత్సమైన హింస !!
  • రుక్మిణి వసంత్ ! ఆమెకు ఓ ఐడెంటిటీ లేదా ? ఇతర హీరోయిన్లకు కూడా !!
  • ‘రామాయణ’లో పేలవమైన వీఎఫ్‌ఎక్స్ ? లేక కొత్త సౌందర్య దృక్పథమా?
  • ఎవరు గురువు – ఎవరు శిష్యుడు ! అంతా హరీష్ హెలూసినేషన్ !!
  • స్మాల్ బడ్జెట్ – బిగ్ రెవిన్యూ ! కథాకథనాలు బాగుంటే కటౌట్లు దేనికోయ్ !!
  • అయోధ్య, శబరిమల, తిరుమల – ముంబై సిద్దివినాయకుడి గుడిలోనూ..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions